Advertisement

Advertisement


Home > Politics - Political News

వాళ్ల అక్రమ సంబంధం మరోసారి బయటపడింది

వాళ్ల అక్రమ సంబంధం మరోసారి బయటపడింది

రాజకీయాల్లో అక్రమ పొత్తులు, చీకటి ఒప్పందాలు, లోపాయికారీ వ్యవహారాలకు బాబు పెట్టింది పేరు. తాజాగా పరిషత్ ఎన్నికల ఫలితాలు, తదనంతర వ్యవహారాలతో ఈ చీకటి ఒప్పందాలన్నీ మరోసారి బయటపడ్డాయి. తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో తన ఉనికి చాటుకున్న జనసేన.. ఆయా మండలాల్లో టీడీపీతో అంటకాగుతోంది. ఈ పొత్తుల వల్లే కడియం లాంటి చోట్ల ఎంపీపీ స్థానాలను టీడీపీ కైవసం చేసుకుంది.

స్వయానా బుచ్చయ్య చౌదరే ఈ సర్దుబాటు వ్యవహారాలను బహిరంగంగా ఒప్పుకున్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన సర్దుబాటు చేసుకుని పోటీ చేశాయని, ఫలితాల తర్వాత కూడా ఆ అవగాహన మేరకే ఎంపీపీ స్థానాలను సాధించుకున్నామని చెప్పారు. వచ్చే ఎన్నికలనాటికి పరిస్థితులు ఎలా ఉంటాయోనంటూ భవిష్యత్ పొలిటికల్ సీన్ ని ముందే ఆవిష్కరించారు.

టీడీపీ, జనసేన కలవడం ఖాయం..

2019 ఎన్నికలకు ముందు వైసీపీ ఓట్లను చీల్చేందుకే జనసేన ఒంటరిగా పోటీ చేసింది. కానీ చంద్రబాబు అనుకున్నట్టేమీ జరగలేదు. టీడీపీ, జనసేన, బీజేపీ.. విడివిడిగా పోటీ చేసినా అందర్నీ చుట్టచుట్టి అవతల పడేసింది. దీంతో మరోసారి చంద్రబాబు కలివిడి పోటీయే మేలని అనుకుంటున్నారు. 

బీజేపీతో పొత్తు పెట్టుకోవాలంటే.. ఎంపీ సీట్ల విషయంలో డిమాండ్లు ఎక్కువగా ఉన్నాయి. అందుకే జనసేనతో కమల దళానికి మిత్ర భేదం సృష్టించి.. పవన్ ని పక్కకు తేవాలనుకుంటున్నారు. ఈ క్రమంలో స్థానిక ఎన్నికల్లో టీడీపీ-జనసేన వ్యూహం కొంతవరకు ఫలించింది. దీంతో భవిష్యత్తులో కూడా టీడీపీ, జనసేన కలసి పనిచేస్తాయని అంటున్నారు నాయకులు.

ఏపీలో బీజేపీ బద్నామ్...?

ఇప్పటివరకూ బీజేపీతో అంటకాగిన జనసేన.. స్థానిక ఎన్నికల్లో టీడీపీకి ఎందుకు సపోర్ట్ చేసింది, ఎంపీపీల విషయంలో టీడీపీకి ఎందుకు మద్దతిస్తోందనేదే ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్. అసలైన ప్రతిపక్షం మేమే, టీడీపీకి సిసలైన ప్రత్యామ్నాయం మేమేనంటూ చెప్పుకుంటున్న బీజేపీ-జనసేన.. స్థానిక ఎన్నికల్లో ఎందుకు కలసి పనిచేయలేకపోయాయి. 

జనసేన, టీడీపీ వైపు ఎందుకు చూస్తోంది..? రాజకీయాల్లో ఎవరు ఎప్పుడు ఎవరితో కలసి ఉంటారో చెప్పలేం. అయితే బయటకు మాత్రం జనసేన, టీడీపీ బద్ధ శత్రువులుగా కలరింగ్ ఇస్తూ.. లోలోపల లోపాయికారీ ఒప్పందాలు ఎందుకనేదే అసలు ప్రశ్న. 

రెండు పార్టీలు కలసిపోయాయంటే ప్రజలు ఛీత్కరిస్తారు కాబట్టే.. ఇలా విడివిడిగా పోటీ చేసి గెలిచాక ఒక్కటవుతున్నారు. మరి అసెంబ్లీ ఎన్నికలనాటికి కూడా ఇదే వ్యూహంతో ముందుకెళ్తారో లేక.. బహిరంగంగానే తమ పొత్తును ప్రకటిస్తారో వేచి చూడాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?