Advertisement

Advertisement


Home > Politics - Political News

వ్యాక్సిన్‌కు మాత్రం జ‌మిలి వ‌ద్దా?

వ్యాక్సిన్‌కు మాత్రం జ‌మిలి వ‌ద్దా?

అధికారాన్ని క‌ట్ట‌బెట్టే ఎన్నిక‌ల‌పై ఉన్న మోజు, వ్యాక్సినేష‌న్‌పై మోదీ స‌ర్కార్‌కు ఉండ‌డం లేదు. దేశ‌మంటే అధికారం, ప్ర‌జ‌లంటే ఓట‌ర్లే త‌ప్ప‌, వారికంటూ కొన్ని మ‌నోభావాలు, ఆకాంక్ష‌లు ఉంటాయ‌ని మోదీ-అమిత్‌షా ద్వ‌యంలోని బీజేపీ కేంద్ర స‌ర్కార్ ఏనాడో మ‌రిచిపోయింద‌నే విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. 

క‌రోనా సెకెండ్ వేవ్ ఉధృత‌మ‌వుతూ ప్రాణాలు బ‌లి తీసుకుంటున్న ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో వ్యాక్సినో మోదీ అని నెత్తీనోరూ కొట్టుకుంటున్నా ....ఆయ‌నలో మాత్రం ఉలుకూప‌లుకూ లేదు.

ఈ నేప‌థ్యంలో సోష‌ల్ మీడియా యాక్టివిస్ట్‌లు మోదీ స‌ర్కార్‌పై దుమ్మెత్తి పోస్తున్నారు. నిన్న‌మొన్న‌టి వ‌ర‌కూ ఒకే దేశం - ఒకే ఎన్నిక‌ల‌ని  కొత్త నినాదాల‌ను తెర‌పైకి తెచ్చిన మోదీ స‌ర్కార్ , క‌రోనా విప‌త్తు వేళ‌లో ఒకే దేశం -ఒకే ద‌ఫా వ్యాక్సిన్ అని ఎందుకు మాట్లాడ్డం లేదో స‌మాధానం చెప్పాల‌ని నిల‌దీస్తున్నారు. 

దేశ‌మంతా ఒకేసారి ఎన్నిక‌లు నిర్వ‌హించ‌గ‌లిగే వ్య‌వ‌స్థ‌, సామ‌ర్థ్యం భార‌త్‌కు ఉన్న‌ప్పుడు, ప్రాణాలు తీస్తున్న క‌రోనా విరుగుడుకు వ్యాక్సిన్ వేసేందుకు మాత్రం లేక‌పోవ‌డం ఏంట‌ని మోదీని పెద్ద ఎత్తున సోష‌ల్ మీడియాలో ప్ర‌శ్నిస్తున్నారు.

ఇటీవ‌ల ప‌శ్చిమ‌బెంగాల్‌, త‌మిళ‌నాడు, కేర‌ళ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో మెరుగైన ఫ‌లితాలు సాధించ‌క‌పోవ‌డం వ‌ల్లే మోదీ స‌ర్కార్ జ‌మిలి ఎన్నిక‌ల‌పై వెనుకంజ వేసింద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. 

లేదంటే 2022-23లో జ‌మిలి ఎన్నిక‌ల‌కు మోదీ స‌ర్కార్ వెళ్లేద‌ని చెబుతున్నారు. 2020లో జ‌మిలి ఎన్నిక‌ల‌పై బీజేపీ 80 వీడియో కాన్ఫ‌రెన్స్‌లు నిర్వ‌హించిన విష‌యాన్ని రాజ‌కీయ వ‌ర్గాలు గుర్తు చేస్తున్నాయి.

దేశ వ్యాప్తంగా ఒకేసారి లోక్‌స‌భ‌, అసెంబ్లీ, ఆయా రాష్ట్రాల్లో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌ను పూర్తి చేయ‌డం వ‌ల్ల ఎన్నిక‌ల ఖ‌ర్చు తగ్గుతుంద‌ని, అభివృద్ధికి అడ్డంకులు తొలుగుతాయ‌ని బీజేపీ పైకి వాదిస్తున్న‌ప్ప‌టికీ, దాని ఉద్దేశం వేర‌ని చెబుతున్నారు. 

ఒకే దేశం - ఒకే నాయ‌కుడు అన్న‌ది బీజేపీ వ్యూహంగా చెబుతున్నారు. అయితే ఇటీవ‌ల కొన్ని రాష్ట్రాల్లో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాలు త‌మ‌పై ఏ స్థాయిలో ప్ర‌జావ్య‌తిరేక‌త ఉందో తేల్చి చెప్ప‌డం వ‌ల్లే జ‌మిలిపై వెనుకంజ వేస్తున్నార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

ఏది ఏమైనా కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీకి అధికారం, ఎన్నిక‌ల‌పై ఉన్న శ్ర‌ద్ధాస‌క్తులు ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై లేవ‌న్న‌ది మ‌రోసారి క‌రోనా మ‌హ‌మ్మారి నిరూపించింద‌నే విమ‌ర్శ‌లు స‌ర్వ‌త్రా వినిపిస్తున్నాయి. ఒక‌వేళ ఇదే నిజం కాక‌పోతే, క‌రోనా క‌ట్ట‌డికి చేప‌ట్టిన‌ వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌లో ఇంత అల‌స‌త్వం ప్ర‌ద‌ర్శించి ఉండేవారు కాదంటున్నారు. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?