Advertisement

Advertisement


Home > Politics - Political News

కొడుక్కి హైదరాబాద్.. కూతురుకి ఢిల్లీ..!

కొడుక్కి హైదరాబాద్.. కూతురుకి ఢిల్లీ..!

ఆమధ్య కేసీఆర్ జాతీయ రాజకీయాలంటూ హడావిడి చేసిన నేపథ్యంలో ఎక్కడికెళ్లినా కూతురు కవితను వెంట తీసుకెళ్లేవారు. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇతర కీలక నేతల భేటీల్లో కూడా ఆమె కనిపించేవారు. కవితను జాతీయ రాజకీయాల్లోకి తీసుకెళ్లాలని, కొడుకు కేటీఆర్ ని తెలంగాణ సీఎంగా చేయాలనేది కేసీఆర్ ఆలోచన అని అంటారు. 

ప్రస్తుతం కవిత ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆమె పుట్టినరోజు సందర్భంగా తెలంగాణలో రకరకాల విన్యాసాలు జరిగాయి. జాగృతి ఆధ్వర్యంలో భారీ ఎత్తున హంగామా చేశారు. ఇంతకీ కవిత, కేటీఆర్ కి పోటీ వస్తారా.. లేక జాతీయ రాజకీయాలకే ఫిక్స్ అవుతారా?

వారసత్వ రాజకీయాల విషయంలో కేసీఆర్ చాలా క్లారిటీతో ఉన్నారు. తన కంటే ఎత్తు ఎదుగుతాడేమోనన్న అనుమానంతో మేనల్లుడు హరీష్ రావుని మొదట్లోనే పక్కనపెట్టారు. కొడుకు కేటీఆర్ కి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పజెప్పి, హరీష్ ని మరింత తగ్గించేశారు. ఇటీవల ఈటల నిష్క్రమణతో హరీష్ ప్రాధాన్యం పెరిగినా అది కేటీఆర్ స్థాయిలో లేదనే విషయం తేలిపోయింది.

ఇక సొంత కుటుంబంలోనే ఆమధ్య రాజకీయ వారసత్వ రచ్చ జరిగిందని అంటారు. కొడుకు కేటీఆర్, కుమార్తె కవిత ఇద్దరూ పార్టీపై ఆధిపత్యం కోరుకున్నారని, ఇద్దరూ సీఎం అవ్వాలనుకుంటున్నారనే వార్తలొచ్చాయి. అయితే కేసీఆర్ తెలివిగా.. ఇప్పుడే ఇద్దరికీ వేరు దారులు చూపారు. కేటీఆర్ ని తెలంగాణకు, కవితను ఢిల్లీకి ఫిక్స్ చేసే ప్రయత్నాల్లో ఉన్నారు కేసీఆర్.

కవితను ఎమ్మెల్సీ చేసినా ఆమెకు మంత్రి పదవి ఇవ్వకుండా పక్కనపెట్టారు. మరోవైపు తాను జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్నట్టు ప్రకటించి, కుమార్తెను తన వెంట తీసుకెళ్తున్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలతో కాస్త బ్రేక్ పడింది కానీ, లేకపోతే కేసీఆర్ హడావిడి మామూలుగా ఉండేది కాదు.

ఆమధ్య కేసీఆర్ బర్త్ డే కి ఇతర రాష్ట్రాల్లో ఎలాంటి హడావిడి జరిగిందో ఇప్పుడు కేసీఆర్ కుమార్తె కవిత పుట్టినరోజుకి కూడా అంతే హడావిడి జరిగింది. తెలంగాణ వ్యాప్తంగా కార్యక్రమాలు జరిగాయి. ఇక ఇతర రాష్ట్రాలు, విదేశాల్లో కూడా తెలంగాణ జాగృతి సంస్థ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించారు. 

జాతీయ రాజకీయాల్లో టీఆర్ఎస్ పేరు చెబితే కవిత గుర్తొచ్చేలా చేస్తున్నారు. ఇప్పటికే జాగృతి సంస్థ ద్వారా కవితకు దేశవ్యాప్తంగా ఓ గుర్తింపు ఉంది. దాన్ని కొనసాగిస్తూ జాతీయ రాజకీయాల్లో తండ్రి వెంట నడవాలనుకుంటున్నారు కవిత. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?