cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Political News

జ‌గ‌న్ స‌ర్కార్‌కు క్ష‌త్రియుల స్వీట్ వార్నింగ్‌

జ‌గ‌న్ స‌ర్కార్‌కు క్ష‌త్రియుల స్వీట్ వార్నింగ్‌

మొద‌టి సారిగా జ‌గ‌న్ స‌ర్కార్‌కు క్ష‌త్రియ సామాజిక వ‌ర్గం స్వీట్ వార్నింగ్ ఇచ్చింది. దీన్ని రాష్ట్ర ప్ర‌భుత్వం సీరియ‌స్‌గా తీసుకోవాల్సిన అవ‌స‌రం ఉన్న‌ట్టే క‌నిపిస్తోంది. ఏ మాత్రం తాత్సారం చేసినా క్ష‌త్రియ సామాజిక వ‌ర్గంలో వైసీపీకి నెగెటివ్ అయ్యే ప్ర‌మాదం స్ప‌ష్టంగా క‌ళ్ల‌కు క‌డుతోంది. ఇంత‌కాలం న‌ర‌సాపురం ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజు విష‌యంలో ఆయ‌న సామాజిక వ‌ర్గం ఏమీ ప‌ట్టించుకోలేదు.

ర‌ఘురామ‌కృష్ణంరాజు చేష్ట‌లు కూడా అట్లే ఉన్నాయి. హూందాత‌నం లేక‌పోవ‌డంతో పాటు ఇత‌రుల రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం నేల‌బారు విమ‌ర్శ‌లు చేస్తున్న ర‌ఘురామ‌కృష్ణంరాజుతో త‌మ సామాజిక వ‌ర్గానికి ఎలాంటి సంబంధం లేద‌ని క్ష‌త్రియ సంఘాలు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. క్ష‌త్రియుల స్పంద‌న‌ను అన్ని ప‌క్షాలు ఆహ్వానించాయి. కులానికి అతీతంగా రఘురామ‌కృష్ణంరాజు ఎపిసోడ్‌ను చూడ‌డంపై అభినంద‌న‌లు వెల్లువెత్తాయి. ర‌ఘురామ అంశాన్ని పూర్తిగా రాజ‌కీయ కోణంలోనే క్ష‌త్రియ స‌మాజం చూసింది.

కానీ మాజీ మంత్రి, టీడీపీ సీనియ‌ర్ నేత, విజ‌య‌న‌గ‌ర రాజ‌వంశీయుడు పూస‌పాటి అశోక్ గ‌జ‌ప‌తిరాజు విష‌యంలో జ‌గ‌న్ స‌ర్కార్ వైఖ‌రి తీవ్ర విమ‌ర్శ‌ల‌కు తావిస్తోంది. పెద్ద మ‌నిషిగా పేరొందిన ఆయ‌న ప‌ట్ల జ‌గ‌న్ స‌ర్కార్ క‌క్ష‌పూరితంగా వ్య‌వ‌హ‌రి స్తోంద‌నే భావ‌న‌, ఆవేద‌న ఉత్త‌రాంధ్ర‌లో ఉంది. అలాంటిది క్ష‌త్రియ స‌మాజంలో ఎలాంటి వేద‌న ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. ఈ నేప‌థ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని క్ష‌త్రియ స‌మాజం పేరుతో టీడీపీ అనుకూల ప‌త్రిక‌ల్లో ఓ ప్ర‌క‌ట‌న (అడ్వ‌ర్‌టైజ్‌మెంట్‌) వెలువ‌డింది.

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌కు స‌విన‌యంగా విన్న‌పాన్ని స‌మ‌ర్పిస్తున్నామంటూ రాష్ట్ర ప్ర‌భుత్వంలోని కొంద‌రు పెద్ద‌ల వైఖ‌రిని తీవ్రంగా నిర‌సించ‌డం గ‌మ‌నార్హం. పూస‌పాటి అశోక్ గ‌జ‌ప‌తి రాజుపై ఇటీవ‌ల ప్ర‌భుత్వంలోని కొంద‌రు పెద్ద‌లు వాడిన అస‌భ్య ప‌ద‌జాలం మొత్తం త‌మ సామాజిక వ‌ర్గాన్ని గాయ‌ప‌రిచింద‌ని సీఎం దృష్టికి తీసుకెళ్ల‌డాన్ని సీరియ‌స్‌గా ఆలోచించాల్సి ఉంది. ఇంత‌కూ ఆ ప్ర‌క‌ట‌న‌లో ఏమున్న‌దో తెలుసుకుందాం.

"రెండు తెలుగు రాష్ట్రాల్లో గౌర‌వ మ‌ర్యాద‌ల‌తో జీవ‌న విధానాన్ని సాగిస్తున్న సామాజిక వ‌ర్గం క్ష‌త్రియ స‌మాజం. మాలో నూటికి 99 శాతం మంది సామాజిక, రాజ‌కీయ విమ‌ర్శ‌ల‌కు చాలా దూరంగా ఉంటారు. సంస్కార విలువ‌ల కోసం ఎన్నో త్యాగాలు చేసిన సంస్కృతి క్ష‌త్రియుల‌ది.

మా సామాజిక వ‌ర్గానికి చెందిన అశోక్‌గ‌జ‌ప‌తిరాజుపై రాజ్య‌స‌భ స‌భ్యులు అస‌భ్య భాష వాడిన సంఘ‌ట‌న మూలంగా మా స‌మాజంలో కొంత ఆవేద‌న నెల‌కొంది. మా క్ష‌త్రియుల‌లోని ఒక ప్ర‌ఖ్యాతిగాంచిన రాజ‌వంశానికి చెందిన, ఎన్నో ఉన్న‌త ప‌ద‌వుల‌ను అధిష్టించిన పూస‌పాటి అశోక్ గ‌జ‌ప‌తిరాజుపై సంబోధించిన విధానం చాలా అమ‌ర్యాద‌క‌రంగా ఉంది. అందువ‌ల్లే మా క్ష‌త్రియ స‌మాజం నుంచి వ్య‌క్త‌మైన భావాల‌ను మీకు (సీఎం) విన్న‌విస్తున్నాం.

ముఖ్యంగా విజ‌య‌న‌గ‌ర రాజ‌వంశానికి చెందిన పూస‌పాటి అశోక్ గ‌జ‌ప‌తిరాజుపై, మాన్సాస్ ట్ర‌స్ట్ వ్య‌వ‌హారాల‌పైన చేస్తున్న అస‌త్య ప్ర‌చారం, మీ మంత్రి వ‌ర్గ స‌భ్యుల విమ‌ర్శ‌లు, ఆయ‌న వాడిన అస‌భ్య‌క‌ర ప‌ద‌జాలం, ఆ మంత్రిగారి స్థాయిని, మీ ప్ర‌భుత్వ స్థాయిని దిగ‌జార్చే విధంగా మాట్లాడారు. ఆ సంఘ‌ట‌న మా క్ష‌త్రియ స‌మాజాన్ని గాయ‌ప‌రిచింద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. 

అశోక్ గ‌జ‌ప‌తిరాజుపై వాడిన భాష‌, ఒక పార్ల‌మెంట్ స‌భ్యుడి స్థాయికి వాడ‌కూడ‌ని ప‌దాలు ప్ర‌యోగించారు. ద‌య‌తో త‌మ విన్న‌పాన్ని ప‌రిశీలించి, ఆంధ్ర‌రాష్ట్ర ప్ర‌జాప్ర‌తినిధుల్లోని కొంద‌రి శృతి మించిన భాష‌ను స‌రిచేసి త‌మ క్ష‌త్రియ స‌మాజ మ‌నోభావా ల‌ను సంర‌క్షించాల్సిందిగా కోరుతున్నాం"

గాయ‌ప‌డిన క్ష‌త్రియుల హృద‌యం త‌మ వేద‌న‌ను సీఎంకు మొర పెట్టుకుంది. రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య‌సాయిరెడ్డి పేరు ప్ర‌స్తావించ‌కుండానే ఆయ‌న అస‌భ్య ప‌ద‌జాలాన్ని వాడార‌ని సీఎంకు ఫిర్యాదు చేశారు. ఆయ‌న వాడిన భాష త‌మ సామాజిక వ‌ర్గ హృద‌యాన్ని గాయ‌ప‌రిచిందంటూ స్ప‌ష్టంగా లేఖ ద్వారా ప్ర‌క‌టించారు. 

అలాగే దేవాదాయ‌శాఖ మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస్ వైఖ‌రిని కూడా త‌ప్పు ప‌డుతూ సీఎంకు ఫిర్యాదు చేశారు. అధికార పార్టీకి చెందిన కొంద‌రి శృతి మించిన భాష‌ను స‌రిచేసి త‌మ సామాజిక వ‌ర్గం మ‌నోభావాల‌ను సంర‌క్షించాల‌ని ఆ లేఖ‌లో కోర‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది.

అశోక్ గ‌జ‌ప‌తిరాజుపై విజ‌య‌సాయిరెడ్డి వాడిన భాష‌పై సొంత పార్టీ నేత‌లు కూడా అంత‌ర్గ‌త సంభాష‌ణ‌ల్లో త‌ప్పు ప‌డుతున్నార‌ని స‌మాచారం. అశోక్ గ‌జ‌ప‌తిరాజును పార్టీల‌కు అతీతంగా గౌర‌విస్తారు. ఎన్నిక‌ల్లో ఆయ‌న ఓడిపోయినంత మాత్రాన ప్ర‌జ‌ల్లో విలువ లేద‌ని భావిస్తే ఎలా? అనే ప్ర‌శ్న‌లు వ‌స్తున్నాయి. ర‌ఘురామ‌కృష్ణంరాజు, కొంద‌రు వైసీపీ నేత‌ల తీరు దొందు దొందేన‌ని, కానీ అశోక్ గ‌జ‌ప‌తిరాజు హూందాత‌నానికి ప్ర‌తీకగా నిలుస్తార‌నే టాక్ ఉత్త‌రాంధ్ర‌లో ఉంది.  

ఆయ‌న‌పై అన‌వ‌స‌ర వ్యాఖ్య‌ల‌తో అధికార పార్టీకే న‌ష్ట‌మ‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. మ‌రోవైపు క్ష‌త్రియ స‌మాజం సీఎంకు రాసిన బ‌హిరంగ లేఖ చ‌ర్చ‌కు దారి తీసింది. ఈ లేఖ ఒక ర‌కంగా జ‌గ‌న్ స‌ర్కార్‌కు ఓ హెచ్చ‌రికే అనే అభిప్రాయాలు స‌ర్వ‌త్రా వ్య‌క్త‌మ‌వుతున్నాయి. క్ష‌త్రియుల గాయ‌ప‌డిన హృద‌య ఘోష‌ను జ‌గ‌న్ స‌ర్కార్ ఏ విధంగా తీసుకుంటుందో చూడాల్సిందే.

స్టార్ హీరోలతో చెయ్యాలనే ఇంట్రెస్ట్ లేదు

అందుకే కాంగ్రెస్ సీనియర్లు జగన్ వెంట రాలేదు

 


×