Advertisement

Advertisement


Home > Politics - Political News

కాలు కదపండి జగన్..ప్లీజ్

కాలు కదపండి జగన్..ప్లీజ్

ఆంధ్ర సిఎమ్ జగన్ గారికి బహిరంగ లేఖ..

అయ్యా..మీకు అధికారం ఎలా సంప్రాప్తించిందో మీరు మరిచిపోయినట్లున్నారు. ఎండనక, వాననక, చలికి తట్టకుని పాదయాత్ర చేసారు. ఆ సంగతి మీకు గుర్తుండే వుంటుంది. ఆ విధంగా జనాల సమస్యలు మీకు తెలిసాయి. వాటి నుంచే నవరత్నాల హామీలు పుట్టుకువచ్చాయి. వాటి ఆలంబనగానే మీకు అధికారం సంప్రాప్తించింది.  కానీ అలా అధికారం అందిన తరువాత మీర మీ పాదాలకు పూర్తి విశ్రాంతి ఇచ్చేసారు. ఇల్లు-ఆఫీసు తప్ప మరో ప్రదేశం వాటికి అలవాటు లేకుండా చేసేసారు. బయటకు వెళ్లడం మానేసారు. గత రెండేళ్లుగా ఎలా గడిచినా సరిపోయింది.

కానీ ఇప్పుడు దేశం, రాష్ట్రం ఘోర విపత్తులో వున్నాయి. జనం చచ్చిపోతున్నారు. మీరు నిమ్మకు నీరెత్తినట్లు అమరావతిలో కూర్చుని ఆదేశాలు జారీ చేస్తున్నారు. సమీక్షలు చేస్తున్నారు. కానీ గ్రౌండ్ లెవెల్ లో ఏం జరుగుతుందో చూడడం లేదు. మీరు ఏం చేస్తున్నారు. 

టాప్ లెవెల్ అధికారులను పిలచి, ఇలా చేయండి..అలా చేయండి అంటూ ఆదేశాలు ఇస్తున్నారు. వారు మీ కన్నా రెండు ఆకులు ఎక్కువ చదివారు. అందుకే వారు కూడా కాలు అమరావతి దాటనివ్వకుండా కిందవారికి అదే ఆదేశాలు కట్..పేస్ట్ చేస్తున్నారు..అలా అలా కిందకు ఆదేశాలు వెళ్తున్నాయి తప్ప ఆచరణ మాత్రం అమోఘంగా వుండడం లేదు. అంతంత మాత్రంగా వుంటోంది.

మంత్రులు, ఎమ్మెల్యేల జాడ అక్కడక్కడ కనిపిస్తోంది. ఆసుపత్రుల్లోకి, కోవిడ్ సెంటర్లలోకి మీరు ఒక్కసారైనా అడుగుపెడితే అక్కడ నిర్వాహకులకు భయం వుంటుంది. పెట్టే ఫుడ్ లో నాణ్యత వుంటుంది. చేసే చికిత్సలో, సదుపాయాల్లో అన్నింటిలో తేడా వుంటుంది. ఎవ్వరూ రారు, ఎవ్వరూ చూడరు అన్నపుడు ఏం భయం వుంటుంది?

అలా అని మీరు మళ్లీ రాష్ట్రం అంతా కోవిడ్ పాదయాత్ర చేసేయనక్కర్లా. కనీసం ప్ర‌త్యేక విమానాలు లాండింగ్ సదుపాయాలు లేదా హెలికాప్టర్ లాండింగ్ సదుపాయాలు వున్న ఊళ్లకు వెళ్లండి. అక్కడి కోవిడ్ సెంటర్లను చూడండి. అధికారులు మీకు చెబుతున్నవి, మీకు చూపిస్తున్నవీ అన్నీ నిజాలా? కాదా? తెలుసుకోండి. గ్రౌండ్ లెవెల్ లో ముఖ్యమంత్రిగా మీరు కాలు పెడితే మంత్రులు కూడా పెడతారు. 

మంత్రులు, ముఖ్యమంత్రులు గ్రౌండ్ లెవెల్ లో వుంటే ఆ వ్యవహారాలే వేరుగా వుంటాయి. అలా కాకుండా అమరావతి దాటము అంటే సరికాదని చెప్పకతప్పదు. మీ ఆలోచన మంచిది అయితే సరిపోదు. ఆచరణ కూడా మంచిది కావాలి. మీ ఆచరణ మంచిది కావాలి అంటే కార్యాచరణ మరింత క్రమంగా వుండాలి. ఇవన్నీ వుండాలంటే  మీరు ఇల్లు, ఆఫీసు వదిలి గ్రౌండ్ లెవెల్ కు రావాలి. వస్తారని ఆశిస్తూ

.....ఆంధ్ర పౌరుడు..

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?