Advertisement

Advertisement


Home > Politics - Political News

అయ్యో పాపం క‌మ‌ల్‌...

అయ్యో పాపం క‌మ‌ల్‌...

ఓట‌మి ఎలాంటి చేదు ప‌రిణామాల‌కు దారి తీస్తుందో ఇప్పుడిప్పుడు క‌మ‌ల్‌హాస‌న్‌కు తెలిసొస్తోంది. విల‌క్ష‌ణ న‌టుడు, అగ్ర‌హీరో క‌మ‌ల్‌హాస‌న్ త‌మిళ రాజ‌కీయాల్లో స‌త్తా చాటేందుకు మ‌క్క‌ల్ నీది మ‌య్యం (ఎంఎన్ఎం) అనే పార్టీని స్థాపించారు. ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో దాదాపు 150 సీట్ల‌లో ఆయ‌న పార్టీ పోటీ చేసింది. చివ‌రికి తాను కూడా ఓట‌మిపాలు అయ్యారు.

ఈ నేప‌థ్యంలో పార్టీ నుంచి ఒక్కొక్క‌రుగా జారుకుంటున్నారు. ఓడిపోయిన త‌ర్వాత పార్టీకి భ‌విష్య‌త్ లేద‌నే భావ‌న‌తో పార్టీని వీడ‌డం క‌మ‌ల్‌హాస‌న్‌లో అస‌హ‌నం పెంచుతోంది. పార్టీ నుంచి వెళ్లిపోతున్న వారంతా ద్రోహులుగా ఆయ‌న అభివ‌ర్ణిస్తున్నారు.తాజాగా ఎంఎన్ఎం ఉపాధ్య‌క్షుడు ఆర్‌.మ‌హేంద్ర‌న్ కూడా పార్టీకి రాజీనామా చేశారు. పోతూపోతూ రాజీనామా లేఖలో ప‌లు ఆరోప‌ణ‌లు గుప్పించ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

పార్టీలో కొందరు సలహాదారులు కమల్‌ను పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. అలాగే కమల్‌ పార్టీ నడిపే తీరు కూడా ప్రజాస్వామ్యయుతంగా లేదని, పార్టీలో ‘విభజించు-పాలించు’ విధానం అమల్లో ఉందంటూ ఘాటు వ్యాఖ్య‌లు చేయ‌డం క‌మ‌ల్ హాస‌న్‌కు ఆగ్ర‌హం తెప్పించింది. మ‌హేంద్ర‌న్ రాజీనామాపై క‌మ‌ల్ సీరియ‌స్‌గా స్పందించారు.  

మహేంద్రన్ ఓ ‘ద్రోహి’ అని విరుచుకుప‌డ్డారు. మహేంద్రన్‌ రాజీనామా చేయకపోయినా పార్టీ నుంచి తామే తొలగించేవారమని చెప్పారు. పార్టీ నుంచి ఓ ‘కలుపు మొక్క’ బయటకు వెళ్లిందని.. దానికి తాము సంతోషిస్తున్నామ‌న్నారు. పిరికిపందల్లా పార్టీని వీడేవారి గురించి ఆలోచించే ప్ర‌శ్నే లేద‌న్నారు. 

కొంతమంది రాజీనామా వల్ల పార్టీ లక్ష్యం మాత్రం మారదని క‌మ‌ల్ స్ప‌ష్టం చేశారు. ఇదిలా ఉండ‌గా మ‌హేంద్ర‌న్‌తో పాటు పార్టీలో కీల‌క నేత‌లైన ఏజీ మౌర్య‌, మురుగనందమ్‌, సీకే.కుమరావెల్‌, ఉమాదేవీ రాజీనామా చేసినట్లు పార్టీ అధికారిక ప్రకటనలో పేర్కొంది.

రాజ‌కీయాలంటే సినిమాలో హీరో వేషం వేసినంత సుల‌భం కాద‌ని క‌మ‌ల్‌కు ఇప్పుడిప్పుడే అర్థ‌మ‌వుతోంద‌ని రాజ‌కీయ విశ్లేషకులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. చివ‌రికి క‌మ‌ల్ ఒక్క‌రే ఆ పార్టీలో మిగిలేలా ఉన్నార‌ని, అయ్యో పాపం క‌మ‌ల్‌, ఎర‌క్క‌పోయి ...ఇరుక్కున్నారే అని మ‌రికొంద‌రు సానుభూతి వ్య‌క్తం చేస్తున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?