Advertisement

Advertisement


Home > Politics - Political News

ఆర్కే మాటలకు అర్థాలు వేరులే

ఆర్కే మాటలకు అర్థాలు వేరులే

ఏది ఏమైతేనేం పెద్దవారి మాటల్లో కొన్ని నిజాలు అలా అల దొర్లిపోతుంటాయి. ఎవరికి వారు వారి వారి సిద్దాంతాలకు అనుగుణంగా వారి వారి వాదనలు నిర్మించుకుంటారు అంటారు రచయిత వీరేంద్రనాథ్. 

ఆర్కే వారం వారం రాసే తన కొత్తపలుకులో ఇలా సిద్దాంతాలకు అనుగుణంగా వాదనల నిర్మాణం ఏమీ వుండదు. దుమ్మెత్తిపోయడం తప్ప. కానీ అలా దుమ్మెత్తి పోయడంలో కూడా ఆయన పొరపాటునో, గ్రహపాటునో కొన్ని నిజాలు కక్కేస్తుంటారు. ఆ విధంగా ఈ వారం వెల్లడించిన కొన్ని నిజాలు తెలుసుకుందాం.

''...తాను ప్రధాన న్యాయమూర్తి పదవిని అందుకోలేకపోవడానికి జస్టిస్‌ రమణతో పాటు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కారణమని జస్టిస్‌ చలమేశ్వర్‌ తన సన్నిహితుల వద్ద విమర్శిస్తుంటారు...''

ఇదీ ఆర్కే రాసింది. చలమేశ్వర్ ఎవరు? రాజకీయ  వేత్త కాదు. చదువుకోని వారు అంతకన్నా కాదు. సుప్రీంకోర్టులో న్యాయమూర్తి లాంటి కీలక హోదాలో పని చేసిన వారు.  ఎన్ని ఢక్కామక్కీలు తినివుంటారు. ఎన్నిరకాల కేసులు చూసి వుంటారు. అలాంటి వ్యక్తి తాను ప్రధాన న్యాయమూర్తి కాకపోవడానికి చంద్రబాబు కారణం అని అకారణంగా అనుకుంటారా? అందులో నిప్పు ఏదో వుండే వుండాలి కదా. 

సుప్రీంకోర్టు న్యాయమూర్తే చంద్రబాబు లాంటి రాజకీయ ప్రముఖుడి కారణంగా తనకు రావాల్సిన పదవి రాలేదని అన్నారు అంటే, ఈ న్యాయమూర్తుల నియామకాల్లో రాజకీయాలు వున్నాయని అనుకోవాలా? వద్దా? ఆర్కే నే చెప్పాలి. ఇక మరో ముచ్చట చూద్దాం.

***

''..న్యాయమూర్తులపై ఫిర్యాదు చేసే హక్కు ఎవరికైనా ఉంటుంది. అయితే సదరు ఫిర్యాదును విలేకరుల సమావేశం పెట్టి మరీ ప్రభుత్వం బహిర్గతం చేయడాన్ని పలువురు ఆక్షేపించారు...''

అంటే ఫిర్యాదు చేయడం తప్పు కాదు. ఎవరికైనా ఆ హక్కు వుంటుంది. అనే కదా ఆర్కే చెబుతున్నది. మరి ఎందుకు జగన్ ఫిర్యాదు చేసారు అంటూ ఇంత యాగీ చేస్తున్నారు. రోజూ పేజీలకు పేజీలు వండి వారుస్తున్నారు. దీనికి ఆర్కే సమాధానం చెప్పాలి కాదా? ఓ పక్క ఫిర్యాదు చేసారని యాగీ చేస్తారు. దానిపై చేసిన తీర్మానాలను హైలైట్ చేస్తారు. అలా చేసే హక్కు ఎవరికైనా వుంది. ప్రెస్ మీట్ పెట్టడమే తప్పు అంటారు. ఇలా ద్వైదీ భావనలతో కాలమ్ రాయడాన్ని ఏమంటారు?

***

''...తన చర్యలకు నరేంద్ర మోదీ, అమిత్‌ షాల మద్దతు ఉందని న్యాయ వ్యవస్థను నమ్మించాలనుకోవడం ఆ వ్యూహం. నిజంగా ఇందులో వాస్తవం లేదు....''

అవును నిజమే. ఆర్కేకు స్వయంగా మోడీనో అమిత్ షా నో చెప్పారు అనుకోవాలి. నిజానికి ఇక్కడ రెండు పాయింట్లు. ఒకటి తన చర్యకు మోడీ, షాల మద్దతు వుందని జగన్ చెప్పలేదు. వైకాపా అంతకన్నా చెప్పలేదు. పోనీ మద్దతు లేదని భాజపా ఏమన్నా చెప్పిందా? భాజపా నాయకులు కానీ, అధికార ప్రతినిధులు కానీ ఖండించారా? మరి ఆర్కే ఎందుకు ఈ విధంగా చెప్పాలని ప్రయత్నిస్తున్నారు. ఎవరికి ఈ విధంగా ధైర్యం నూరిపోయాలని చూస్తున్నారు. అలా ధైర్యం చెప్పాలని ఆయన అనుకుంటున్న వాళ్లు ఏమన్నా చిన్న చితక జనాలా? 

***

''..ఆర్థిక నేరాలకు సంబంధించి తీవ్రమైన అభియోగాలు జగన్మోహన్‌ రెడ్డిపై ఉన్నాయన్న విషయం సుప్రీంకోర్టులో ప్రస్తుతం పనిచేస్తున్న పలువురు న్యాయమూర్తులకు తెలియదు. పదేళ్ల క్రితం ఆయనపై కేసులు నమోదైనప్పుడు వారంతా వివిధ హైకోర్టుల్లో పనిచేస్తుండేవారు. ఈ కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో అప్పుడేం జరిగిందో చాలామందికి తెలియదు. జగన్మోహన్‌ రెడ్డికి ఇంత ఘన చరిత్ర ఉందా? అని న్యాయమూర్తులతో పాటు న్యాయ నిపుణులు కూడా ఇప్పుడు ఆశ్చర్యపోతున్నారు...''

దీనికి నవ్వాలో ఏడవాలో అర్థం కావడం లేదు. న్యాయమూర్తులను మరీ అంత డార్క్ లో వుంచినట్లు మాట్లాడడం ఏమిటి ఆర్కే. సుప్రీంకోర్టుకు వెళ్లిన న్యాయమూర్తులు అంతకు ముందు ఎక్కడ వుంటే వుండొచ్చు. తెల్లవారి పత్రికలు చదవరా?వారికి ప్రాపంచిక విషయాలు తెలియవా? జగన్ కేసుల వివరాలు జాతీయ మీడియాలో కూడా వచ్చిన సంగతి మరిచిపోయారా? ఏ రాజకీయ నాయకులు ఏమిటో తెలియ నంత అమాయకంగా వున్నారా న్యాయమూర్తులు. 

***

''...న్యాయమూర్తిగా జస్టిస్‌ చలమేశ్వర్‌ ఎంపిక కావడానికి ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి పరోక్ష సహకారం ఉంది..''

అద్గదీ అసలు పాయింట్ వదిలారు ఆర్కే. జస్టిస్ చలమేశ్వర్ ఎంపిక కావడానికి చంద్రబాబు సహకరించారంటూ న్యాయమూర్తుల ఎంపిక వెనుక రాజకీయ సహకారం వుందీ అంటూ వెల్లడించారు ఆర్కే. అలా సహకరించినా ఇప్పుడు చలమేశ్వర్ సహకరించడం లేదన్న దెప్పుడు పరోక్షంగా వుంది. 

మరి చలమేశ్వర్ నియామకం వెనుక చంద్రబాబు సహకారం వుంటే, ఇంకెంతమంది వెనుక చంద్రబాబు సహకారం వుందని భావించాలి? ఇలాంటపుడు న్యాయవ్యవస్థ మీద జగన్ కావచ్చు మరెవరు కావచ్చు అనుమానపడడంలో, ఆరోపణలు చేయడంలో తప్పేంవుంది? ఆర్కేలాంటి సీనియర్ జర్నలిస్ట్, ఫేమస్ పెర్సనాలిటీనే న్యాయమూర్తుల ఎంపిక వెనుక రాజకీయ నాయకుల సహకారం వుందీ అని చెప్పిన తరువాత నమ్మకుండా ఎలా వుండగలం?

***

''కేసీఆర్‌ ఢిల్లీ పర్యటనలకు వెళ్లినప్పుడు తెలుగువారైన జస్టిస్‌ చలమేశ్వర్‌, జస్టిస్‌ రమణను కలుసుకుని రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని కోరేవారు...''

ఇక్కడ ఓ అనుమానం ఏమిటంటే, రాష్ట్ర అభివృద్దికి అందరి సహకారం కావాలి. ముఖ్యంగా అధికార హోదాలో వున్న రాజకీయ నాయకులు, పెట్టుబడులు పెట్టగల పారిశ్రామిక వేత్తలు, అలాగే వివిధ పదవుల్లో వుండి అనుమతులు ఇవ్వగల అధికారుల సహకారం. 

కానీ ఇరు పక్షాల వాదనలు విని నిస్పక్షపాతంగా తీర్పులు చెప్పే న్యాయమూర్తులను ఎందుకు కలవాలి? కలిసి ఏం మాట్లాడాలి? అలా మాట్లాడి ఏ విధమైన సహకారం వారి నుంచి అర్థించాలి. ఈ విషయం ఆర్కే వివరించగలరా? అలా జగన్ కలవకపోవడం నేరం గా ఆర్కే భావిస్తున్నారా? అందుకే అలా కలవనందుకు, లేదా కలిసి విధేయంగా వుండనందుకే,  ఆయనకు న్యాయ వ్యవస్థ సహకరించడం లేదని సామాన్యుడు అనుకోవాలా? 

***

''.. న్యాయవ్యవస్థలో పనిచేసిన వారు కొందరు అదే న్యాయ వ్యవస్థను చెరబట్టాలనుకునే వారి వైపు నిలబడాలనుకోవడం నిజంగా విషాదం...''

తన కొత్త పలుకు ముక్తాయింపులో, ముగింపులో ఈ మాట రాసారు ఆర్కే. ఇది ఎలాగైనా అన్వయించుకోవచ్చు. ఆర్కే చెప్పడం కాదు, వైకాపా జనాలో , జగన్ నో కూడా ఇదే చెబుతున్నారు కదా....''..''.. న్యాయవ్యవస్థలో పనిచేసిన వారు కొందరు అదే న్యాయ వ్యవస్థను చెరబట్టాలనుకునే వారి వైపు నిలబడాలనుకోవడం నిజంగా విషాదం...'' నిజంగా సరైన వాక్యంతో ముగించారు ఆర్కే తన కొత్త పలుకును. సంతోషం.

ఇండస్ట్రీలో 123 చిరంజీవే

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?