cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Political News

రోజాను గుచ్చుతున్న జ‌బ‌ర్ద‌స్త్ ముల్లు

రోజాను గుచ్చుతున్న జ‌బ‌ర్ద‌స్త్ ముల్లు

వైసీపీలో న‌గ‌రి ఎమ్మెల్యే ఓ ఫైర్‌బ్రాండ్‌. త‌న అధినేత వైఎస్ జ‌గ‌న్ కోసం ప్రాణాలైనా ఇవ్వ‌డానికి వెనుకాడ‌ర‌ని వైసీపీ శ్రేణులు న‌మ్ముతాయి. అందుకే ఆమెకు పార్టీలో అంత క్రేజ్‌. గ‌త పాల‌న‌లో ఏడాది పాటు అసెంబ్లీ బ‌హిష్క‌ర‌ణ‌కు గురి అయ్యారంటే...ఆమె వైఎస్ జ‌గ‌న్‌పై పెంచుకున్న అభిమానం, గౌర‌వం ఏ పాటివో అర్థం చేసుకోవ‌చ్చు.

బ‌హిష్క‌ర‌ణ‌కు గురైన రోజా భ‌యంతో ఇంటికో, షూటింగ్‌ల‌కో ప‌రిమితం కాలేదు. క‌ష్ట‌న‌ష్టాల‌ను ఆమెను మ‌రింత రాటుదేల్చాయి. జ‌గ‌న్ త‌ర్వాత పార్టీలో అంత ఇమేజ్‌ను సంపాదించుకున్న నేత ఎవ‌రైనా ఉన్నారా అంటే రోజా పేరే వినిపిస్తోంది. నిజానికి ప్ర‌తిప‌క్షంలో ఉంటూ అధికార టీడీపీపై మ‌హిళ‌గా ఆమె చేసిన పోరాటం సామాన్య‌మైంది కాదు. సినీ , రాజ‌కీయ రంగాల్లో ఎలాంటి బ్యాక్ స‌పోర్ట్ లేకుండానే అంచెలంచెలుగా ఎదిగిన న‌టి, నాయ‌కురాలు ఆమె.

దీని వెనుక ఆమె స్వ‌యంకృషి, ప‌ట్టుద‌ల దండిగా ఉన్నాయి. వైసీపీ అధికారంలోకి వ‌చ్చాక ఆమెను మంత్రి ప‌ద‌వి వ‌రిస్తుంద‌ని అంద‌రూ అనుకున్నారు. చివ‌రి నిమిషంలో అనేక స‌మీక‌ర‌ణాల రీత్యా తృటిలో మంత్రి ప‌ద‌వి చేజారింది. ఏపీఐఐసీ చైర్మ‌న్‌గా ఆమెను జ‌గ‌న్ నియ‌మించారు. ఇప్పుడా నేత‌ను ఓ చిన్న విష‌యం ముల్లులా ప‌దేప‌దే గుచ్చుతోంది. చాలా కాలంగా రోజా ఈటీవీలో ఎక్స‌ట్రా జ‌బ‌ర్ద‌స్త్‌, జీతెలుగు చాన‌ల్‌లో బ‌తుకుజ‌ట్కా బండి కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తున్నారు. బ‌తుకుజ‌ట్కా బండి కార్యక్ర‌మంలో పంచాయితీలు చేసే పెద్ద‌క్క పాత్ర‌లో రోజా చ‌క్క‌గా రాణిస్తూ ప‌లువురి ప్ర‌శంస‌లు అందుకుంటున్నారు.

జ‌బ‌ర్ద‌స్త్ విష‌యానికి వ‌స్తే ఆమె విమ‌ర్శ‌ల‌ను మూట‌క‌ట్టుకుంటున్నారు. ఈ కార్య‌క్ర‌మానికి ఆమె జ‌డ్జిగా (నిన్న‌మొన్న‌టి వ‌ర‌కు నాగ‌బాబు కూడా జ‌డ్జిగా ఉన్నారు) వ్య‌వ‌హ‌రిస్తున్న‌ విష‌యం తెలిసిందే. జ‌బ‌ర్ద‌స్త్ ఓ బూతు ప్రోగ్రామ్ అని, మ‌హిళ‌ల‌పై అస‌భ్య స్కిట్స్‌తో అవ‌మాన‌ప‌రుస్తున్నార‌ని మ‌హిళా సంఘాలు కేసు పెట్టిన ఘ‌ట‌న‌లు కూడా లేక‌పోలేదు. ముఖ్యంగా హైప‌ర్ ఆది స్కిట్స్ మ‌హిళ‌ల‌ను కించ‌ప‌రిచేలా ఉంటాయ‌ని మ‌హిళా సంఘాల నేత‌లు తీవ్ర అభ్యంత‌రం చెబుతున్నారు.

మ‌హిళ‌ల‌ను అవ‌మాన‌ప‌రిచేలా స్కిట్స్ ఉంటే, వాటిని చూస్తూ బాధ్య‌తాయుత‌మైన ఎమ్మెల్యేగా రోజా ఎలా న‌వ్వుతూ మార్కులు వేస్తార‌ని ప‌లువురు ప్ర‌శ్నిస్తున్నారు. ప‌లు చాన‌ళ్లలో ఇచ్చిన ఇంట‌ర్వ్యూల్లో బూతు కార్య‌క్ర‌మానికి మీరు జడ్జిగా ఎలా వ్య‌వ‌హ‌రిస్తార‌నే ప్ర‌శ్న‌కు "మీరు ఇదే ప్ర‌శ్న‌ను ఈటీవీ య‌జ‌మాని రామోజీ గారిని ఎందుకు అడ‌గ‌రు" అని నిల‌దీశారు.

అసెంబ్లీలో ఉల్లిపై చ‌ర్చ‌కు ప‌ట్టుప‌ట్టిన ప్ర‌తిప‌క్ష నేత‌ల‌ను ఉద్దేశించి  ‘మీరసలు మనుషులేనా? మాతృమూర్తులను గౌరవించకపోగా ఉల్లితో పోటీపెట్టి అవమానిస్తారా? అన్నం తింటున్నారా? గడ్డి తింటున్నారా?’.. అంటూ ఘాటుగా విమర్శించారు.

టీడీపీ అధికార ప్ర‌తినిధి పంచుమ‌ర్తి అనురాధ స్పందిస్తూ  రోజాపై ఫైర్ అయ్యారు. ఆడ‌వాళ్ల‌ను కించ‌ప‌రిచేలా బూతు డైలాగుల‌తో న‌డిచే జ‌బర్ద‌స్త్ కార్య‌క్ర‌మంలో జ‌డ్జిగా వ్య‌వ‌హ‌రించే రోజా నీతులు మాట్లాడటం ఏంట‌ని ప్ర‌శ్నించారు. అనురాధ ప్ర‌శ్నించింద‌ని కాదు కానీ, ఆ కార్య‌క్ర‌మంలో రోజా పాల్గొన‌క‌పోతే హూందాగా ఉంటుంద‌ని ఆమెను అభిమానించే వైసీపీ శ్రేణులు కూడా అభిప్రాయ‌ప‌డుతున్నాయి.

ప్ర‌తిప‌క్షం వైపు రోజా ఒక వేలు చూపిస్తే...నాలుగు వేళ్లు తాను పాల్గొనే జ‌బ‌ర్ద‌స్త్ వైపు చూపుతాయ‌ని ఇప్ప‌టికైనా గుర్తిస్తే మంచిది. సో...త‌న‌పై తాను తీర్పు చెప్పుకునే స‌మ‌యం ఆస‌న్న‌మైంద‌న్న మాట‌.