Advertisement

Advertisement

indiaclicks

Home > Politics - Political News

ఊపందుకున్న పోల‌వ‌రం.. 27న జ‌గ‌న్ విజిట్!

ఊపందుకున్న పోల‌వ‌రం.. 27న జ‌గ‌న్ విజిట్!

పోల‌వ‌రం ప్రాజెక్టు ప‌నులు మ‌ళ్లీ ఊపందుకున్నాయి. వ‌ర‌ద ప్ర‌భావం పూర్తిగా త‌గ్గిపోవ‌డం, ఇత‌ర వ్య‌వ‌హారాలూ ఒక కొలిక్కి రావ‌డంతో.. కీల‌క‌మైన స్పిల్ వే  నిర్మాణం ప‌నులు ఊపందుకున్నాయి. స్పిల్ వేకు సంబంధించిన 51 బ్లాకుల ప‌నులు ఇప్పుడు సాగుతూ ఉన్నాయ‌ని తెలుస్తోంది. గ‌త ఇంజ‌నీరింగ్ త‌ప్పిదాల‌తో పోల‌వ‌రం ప్రాజెక్టు ప‌నుల‌కు అవాంత‌రాలు ఏర్ప‌డ్డాయ‌ని ఇంజ‌నీరింగ్ నిపుణులు చెబుతూ ఉన్నారు. అది సామాన్యుల‌కు అర్థ‌మ‌య్యేలా కూడా వివ‌రిస్తూ ఉన్నారు. గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో కాఫ‌ర్ డ్యామ్ నిర్మాణానికి ప్రాధాన్య‌త‌ను ఇచ్చారు. ఆ నిర్మాణం పూర్తి చేసి ప్రాజెక్టు నిర్మాణం జ‌రిగిపోయింద‌ని ప్ర‌జ‌ల‌ను న‌మ్మించే ఒక బూట‌క‌పు ప్ర‌య‌త్నం అప్పుడు జ‌రిగింది. దాని ఫ‌లితంగా ప్రాజెక్టు నిర్మాణ‌మే ఆల‌స్యం అయ్యింది. గ‌త ఏడాది విప‌రీత‌మైన స్థాయిలో వ‌ర‌ద‌లు రావ‌డంతో, కాఫ‌ర్ డ్యామ్ నిర్మిత ప్రాంతమంతా భారీగా వ‌ర‌ద‌నీటితో నిండిపోయింది! 

ఎంత‌లా అంటే.. పోల‌వ‌రం నిర్మాణం ప్రాంతంలో నిలిచిపోయిన వ‌ర‌ద నీరు దాదాపు 4 టీఎంసీలు! ఒక చిన్న‌సైజు ప్రాజెక్టులో నిల్వ ఉంచ‌ద‌గిన స్థాయిలో అక్క‌డ వ‌ర‌ద నీరు నిలిచిపోయాయి. దీంతో వ‌ర్షాలు త‌గ్గిపోయిన చాన్నాళ్ల‌కు కూడా ప‌నులు మ‌ళ్లీ మొద‌లుపెట్ట‌లేని ప‌రిస్థితి నెల‌కొంది. కాఫ‌ర్ డ్యామ్ ను ముందుగా నిర్మించ‌డం వ‌ల్ల ఈ ప‌రిస్థితి త‌లెత్తింద‌ని ఇంజ‌నీరింగ్ నిపుణులు వివ‌రిస్తూ ఉన్నారు. ఇక ప్రాజెక్టు నిర్మాణంలో ఇప్పుడు కీల‌క‌మైన స్పిల్ వే నిర్మాణం జ‌రుగుతూ ఉంది. స్పిల్ వేలో ఒక్కో బ్లాక్ ఎత్తు దాదాపు 52 మీట‌ర్లు అని తెలుస్తోంది. ఈ మేర‌కు స్పిల్ వే పియ‌ర్స్ నిర్మితం అవుతున్నాయి. భారీ ఎత్తున యంత్ర సామాగ్రి ఒక్క రోజుకు కేవ‌లం నాలుగు మీట‌ర్ల ఎత్తున స్పిల్ వే పియ‌ర్స్ కు కాంక్రీట్ వేయ‌గ‌ల‌వ‌ట‌. అయితే రోజుకు ప‌న్నెండు బ్లాకుల‌కు సంబంధించి నాలుగు మీట‌ర్ల ఎత్తు చొప్పున ప‌నులు జ‌రుగుతున్న‌ట్టుగా తెలుస్తోంది.

ఫిబ్ర‌వ‌రి నుంచి జూన్ వ‌ర‌కూ.. పోల‌వ‌రం ప‌నుల‌కు సంబంధించిన కీల‌క‌మైన స‌మ‌యం. ఈ నెల‌ల్లోనే స్పిల్ వే నిర్మాణ ప‌నుల‌ను పూర్తి చేయ‌డానికి శ‌ర‌వేగంగా ప‌నులు చేయాల‌ని సంక‌ల్పిస్తూ ఉన్నారు. అలాగే రాక్ ఫిల్ డ్యామ్ నిర్మాణానికి సంబంధించిన ప‌రీక్ష‌ల‌ను ఇప్పుడే పూర్తి చేయ‌నున్నార‌ని తెలుస్తోంది. ప్రాజెక్టు గ‌ర్భంలో ఇసుక నాణ్య‌త‌ను ప‌రిశీలించి అక్క‌డ కాంక్రీట్ ప‌నుల‌ను మొద‌లుపెట్ట‌నున్నారు. స్పిల్ వే ఎగువ‌న‌, దిగువ‌న కూడా కాంక్రీట్ ప‌నులు సాగ‌బోతున్నాయ‌ని తెలుస్తోంది.

ఈ ఏడాది కూడా పోల‌వ‌రం ప్రాజెక్టుకు వ‌ర‌ద నీటి ప్ర‌భావం ఉండ‌వ‌చ్చు. అయితే ఈ సారి వ‌ర‌ద నీటి నిర్వ‌హ‌ణ‌కు కూడా ప్ర‌ణాళిక ర‌చించారు. రాబోయే  ఐదు నెల‌లూ ప‌నుల విష‌యంలో కీల‌కం అని, 14 నెల‌ల్లో ప‌నుల‌ను పూర్తిగా కొలిక్కి తీసుకురావ‌డ‌మే ల‌క్ష్య‌మ‌ని ఏపీ ప్ర‌భుత్వం, కాంట్రాక్ట్ సంస్థ చెబుతున్నాయి. 2021 ఆగ‌స్టు నాటికి ఫినిషింగ్ ప‌నులు కూడా పూర్తి చేయ‌డ‌మే ల‌క్ష్య‌మ‌ని అంటున్నాయి. 

ఈ ప్రాజెక్టు ద్వారా ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో ల‌క్ష ఎక‌రాల‌కు పైగా సాగు నీరు అందించ‌డం, 80 టీఎంసీల‌ను కృష్ణకు త‌ర‌లించ‌డం, గోదావ‌రి డెల్టాలో 13 ల‌క్ష‌ల ఆయ‌క‌ట్టును ర‌బీలో స్థిరీక‌రించ‌డం, విశాఖ‌కు 23 టీఎంసీల తాగునీటిని అందించ‌డం వంటి సౌల‌భ్యాలు ఉంటాయి. పోల‌వ‌రం ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు జీవ‌నాడిగా ప‌రిగ‌ణింప‌బడుతోంది. ఈ ప్రాజెక్టు పూర్తి కోసం అటు అనంత‌పురం నుంచి ఇటు ఉత్త‌రాంధ్ర వ‌ర‌కూ ఎదురుచూస్తూ ఉంది. ఇటీవ‌లే ఏపీ ప్ర‌భుత్వం పోల‌వ‌రం విష‌యంలో రివ‌ర్స్ టెండ‌రింగ్ నిర్వ‌హించి 628 కోట్ల రూపాయ‌ల వ‌ర‌కూ ఆదా చేసింది. ఇక ప‌నులు పూర్తి కావ‌డం విష‌యంలోనే స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొని ఉంది. ఈ క్ర‌మంలో ఈ నెల 27న ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పోల‌వ‌రం సంద‌ర్శ‌న‌కు వెళ్తూ ఉండ‌టం గ‌మ‌నార్హం.

సంక్షేమ పథకాలు రాష్ట్రానికి క్షేమమేనా?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?