తెలంగాణ ఉద్య‌మంలో కూడా చూడ‌ని నిర్బంధం

రేవంత్ పాలన గురించి క్లుప్తంగా చెప్పాలంటే తిట్లు కొట్లు, ఒట్లు నోట్లు అని విమ‌ర్శ‌లు చేశారు.

తెలంగాణ‌లో రేవంత్‌రెడ్డి స‌ర్కార్ ఏడాది పాల‌న పూర్తి చేసుకుంది. ఈ సంద‌ర్భంగా ప్ర‌తిప‌క్షాల త‌మ‌దైన స్టైల్‌లో నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్నాయి. బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు న‌డ్డా నేతృత్వంలో కాంగ్రెస్ ఏడాది పాల‌న‌ను నిర‌సిస్తూ స‌భ నిర్వ‌హించిన సంగ‌తి తెలిసిందే. ఇక బీఆర్ఎస్ వంతు. తెలంగాణ భ‌వ‌న్‌లో ఏడాది పాల‌న – ఎడ‌తెగ‌ని వంచ‌న పేరుతో బీఆర్ఎస్ చార్జిషీట్‌ను విడుద‌ల చేసింది.

ఈ సంద‌ర్భంగా మాజీ మంత్రి హ‌రీశ్‌రావు మాట్లాడుతూ రేవంత్ పాల‌న‌పై విరుచుకుప‌డ్డారు. కాంగ్రెస్ పాల‌న స‌మ‌స్తాన్ని ప్ర‌జా పీడ‌న ప‌రాయ‌ణ‌త్వంగా అభివ‌ర్ణించారు. సోనియమ్మ ఆరు గ్యారెంటీలు ఇస్తే, తాను ఏడో గ్యారెంటీగా ప్ర‌జాస్వామ్య పాల‌న అందిస్తాన‌ని రేవంత్ హామీ ఇచ్చార‌ని గుర్తు చేశారు. కానీ ఏడాది పాల‌న‌లో ప్ర‌జాస్వామ్యం అప‌హాస్య‌మైంద‌ని ఆయ‌న విమ‌ర్శించారు.

తెలంగాణ ఉద్య‌మంలో కూడా చూడ‌ని నిర్బంధ కాండ‌ను ఇప్పుడు రుచి చూస్తున్నామ‌ని హ‌రీశ్ ఆరోపించారు. సీఎం సొంతూరికి ఎవ‌రైనా పోవాలంటే పోలీస్‌స్టేష‌న్‌లో అనుమ‌తి ప‌త్రాలు తీసుకోవాల్సిన దుర్మార్గాన్ని ఎప్పుడైనా విన్నామా? క‌న్నామా? అని ఆయ‌న ప్ర‌శ్నించారు. పోలీసుల‌తోనే పోలీసుల్ని కొట్టించిన ఘ‌నుడీ ముఖ్య‌మంత్రి అని ఆయ‌న విమ‌ర్శించారు.

చ‌దువుకునే లైబ్ర‌రీల్లో లాఠీచార్జీ చేయించార‌ని, నిరుద్యోగుల క‌న్నీళ్ల‌తో అశోక‌న‌గ‌రాన్ని శోక న‌గ‌రంగా మార్చార‌ని ఆయ‌న ఆరోపించారు. బుల్డోజ‌ర్ల‌తో ఇళ్ల‌ను కూల్చి పేద‌ల జీవితాల‌ను ఛిద్రం చేశార‌ని హ‌రీశ్‌రావు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ల‌గ‌చ‌ర్ల లంబాడీ బిడ్డ‌ల‌పై ధ‌ర్డ్ డిగ్రీ ప్ర‌యోగించార‌ని విరుచుకుప‌డ్డారు. రేవంత్ పాలన గురించి క్లుప్తంగా చెప్పాలంటే తిట్లు కొట్లు, ఒట్లు నోట్లు అని విమ‌ర్శ‌లు చేశారు. ఫిరాయింపులు, దబాయింపులు, బుకాయింపులతో రేవంత్ మార్కు ప్రజా పాలన వర్ధిల్లుతోంద‌న్నారు.

One Reply to “తెలంగాణ ఉద్య‌మంలో కూడా చూడ‌ని నిర్బంధం”

Comments are closed.