దూరపు కొండలు నునుపు కాదు.. సామెతను కాస్త మార్చి రాసుకోవాలి. దూరపు కొండలు తియ్యగా ఉంటాయి. దగ్గరి కొండలు చేదుగా ఉంటాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్కడో దూరంగా ఉన్న కేరళకు, కర్ణాటకకు వెళ్లి అక్కడ కాంగ్రెస్ అభ్యర్థుల విజయం కోసం ప్రచారం చేస్తున్నారు. కానీ, పొరుగునే ఉన్న ఏపీలో మాత్రం పార్టీ కోసం ప్రచారానికి ఆయన పూనుకోవడం లేదు. అసలు పట్టించుకోవడం లేదు. దీని ద్వారా ఆయన ఏం సంకేతాలు ఇవ్వదలచుకున్నారు?
ఏపీలో తన రాజకీయ మార్గదర్శి, పెద్దదిక్కు చంద్రబాబు నాయుడుకు నష్టం జరుగుతుందనే భయంతో ప్రచారానికి వెళ్లడం లేదా? అలాకాక, తాను ప్రచారం చేసినా కూడా ఏపీలో ఒక్క సీటులో కూడా కాంగ్రెసు పార్టీకి డిపాజిట్ వచ్చే పరిస్థితి లేదని అందుకే పరువు పోకుండా అటుదిక్కు చూడకుండా మౌనంగా ఉండిపోతున్నారా? అనే సందేహాలు ప్రజలకు కలుగుతున్నాయి.
రేవంత్ రెడ్డి ఒక దఫా ఎంపీగా కూడా పనిచేసినప్పటికీ.. తెలంగాణకు మాత్రమే పరిమితమైన నేత. అయితే ముఖ్యమంత్రి అయిన తర్వాత.. ఆయన తనను తాను జాతీయ స్థాయిలో కాంగ్రెస్ కు కీలక నేతగా ప్రొజెక్టు చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. అందులో భాగమే.. కేరళకు, కర్ణాటకకు కూడా వెళ్లి పార్టీకోసం ప్రచారాలు నిర్వహించడం. అయితే ఆయన ఏపీ దిక్కు మాత్రం చూడడం లేదు.
ఏది ఏమైనా ఒకప్పుడు తెలుగుదేశంలో ఫైర్ బ్రాండ్ నాయకుడిగా ఆయనకు ఏపీలో కూడా ఒక మోస్తరు ఫాలోయింగ్ ఉంది. నిజం చెప్పాలంటే.. ఆయన తిరుగుతున్న కర్నాటక, కేరళ కంటె ఇక్కడే ఎక్కవ ఫాలోయింగ్ ఉంది. రేవంత్ భయపడుతున్నది కూడా అదే. అక్కడకు వెళ్లి ప్రచారం చేస్తే తెలుగుదేశానికి నష్టం జరుగుతుందని ఆయన భయపడుతున్నారట.
చంద్రబాబునాయుడుతో రేవంత్ కు లోపాయికారీ ఒప్పందం ఉందనేది అందరికరీ తెలుసు. అందువల్లనే తెలంగాణ ఎన్నికల్లో తెలుగుదేశాన్ని పోటీకి దింపకుండా చంద్రబాబు పార్టీని చంపేసి రేవంత్ కు మేలు చేశారు. ఇప్పుడు ప్రచారానికి వెళ్లకుండా రేవంత్ ప్రత్యుపకారం చేస్తున్నారని సమాచారం.
షర్మిల స్వయంగా వచ్చి కనీసం కడప నియోజకవర్గానికి వచ్చి తనకు అనుకూలంగా అయినా ప్రచారం నిర్వహించాలని కోరినప్పటికీ.. ఆయన అంగీకరించలేదని తెలుస్తోంది. ప్రచారం కోసం ఏపీకి వెళ్లరని.. కానీ, ప్రచారం ముగిసేలోగా ఇంటర్వ్యూలలోగానీ, వీడియో సందేశం ద్వారా గానీ జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి రేవంత్ పిలుపు ఇచ్చే అవకాశం ఉన్నదని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.