గాజుగ్లాసు గుర్తుపై జనసేనకు స్వల్ప ఊరట దక్కింది. జనసేన పోటీ చేసే 21 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాల్లో గాజుగ్లాసు గుర్తుతో బరిలో దిగారు. అయితే జనసేన గుర్తింపు పార్టీ కాకపోవడంతో గాజుగ్లాసు గుర్తును ఫ్రీసింబల్‌గా కేంద్ర ఎన్నికల సంఘం ఉంచింది. దీంతో జనసేన పోటీ చేయని అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాల్లో స్వతంత్ర, రిజిస్టర్డ్ పార్టీ అభ్యర్థులు గాజుగ్లాసు గుర్తు ఎంచుకున్నారు. దీంతో కూటమిలో అయోమయం నెలకుంది.
టీడీపీ, బీజేపీ , జనసేన పొత్తులో ఉన్నాయని, గాజుగ్లాసు గుర్తును ఇతరులకు కేటాయిస్తే రాజకీయంగా ఇబ్బందులు తలెత్తాయంటూ పవన్‌కల్యాణ్ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో విచారించిన హైకోర్టు కేంద్ర ఎన్నికల సంఘం అభిప్రాయం కోరింది.
తాజాగా కోర్టుకు కేంద్ర ఎన్నికల సంఘం తరపున అఫిడవిట్ సమర్పించింది. ఇందులో 21 ఎమ్మెల్యే స్థానాల పరిధిలో ఎంపీ అభ్యర్థులకు, అలాగే రెండు ఎంపీ స్థానాల్లో జనసేన పోటీ చేస్తున్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో గాజుగ్లాసు గుర్తును ఇతరులకు కేటాయించమని స్పష్టం చేసింది.
ఈ మేరకు జనసేనకు స్వల్ప ఊరట దక్కినట్టైంది. పార్టీ స్థాపించి పదేళ్లైనా, ఇంత వరకూ జనసేన గుర్తింపునకు నోచుకోలేదు. ఫ్రీ సింబల్‌గా పెట్టిన గాజుగ్లాసును స్వతంత్ర అభ్యర్థులు ఎంచుకుంటే, నష్టం జరుగుతుందని జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ వాపోవడం విచిత్రంగా వుంది. తన స్థాయి ఏంటో ఇప్పటికైనా పవన్ తెలుసుకుని, అందుకు తగ్గట్టు రాజకీయాలు చేయాల్సిన అవసరం వుంది.