ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చంద్రబాబునాయుడు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మధ్య రాజకీయ పోరు ఇప్పటిది కాదు. విద్యార్థి దశ నుంచి ఇద్దరూ ఢీ అంటే ఢీ అని తలపడుతున్నారు. ఇద్దరూ వేర్వేరు పార్టీల్లో ప్రాతినిథ్యం వహిస్తూ, పరస్పరం దూషించుకుంటున్నారు. కుప్పంలో చంద్రబాబునాయుడిని ఓడించే బాధ్యతను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై సీఎం జగన్ ఉంచారు. ఈ నేపథ్యంలో కూటమి మేనిఫెస్టోపై పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
చిత్తూరు జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నైజం తెలుసుకునే మేనిఫెస్టోకు బీజేపీ పెద్దలు దూరంగా ఉన్నారన్నారు. హామీలను చంద్రబాబు నిలబెట్టుకోలేరని బీజేపీ నేతలకు బాగా తెలుసన్నారు. అందుకే మేనిఫెస్టోపై కేవలం చంద్రబాబు, పవన్‌కల్యాణ్ ఫొటోలు మాత్రమే ఉన్నాయన్నారు. కనీసం మేనిఫెస్టో కాపీని తీసుకోడానికి కూడా బీజేపీ నేతలు నిరాకరించారన్నారు.
చంద్రబాబుకు మేనిఫెస్టో అంటే ఏ మాత్రం విలువ లేదన్నారు. కానీ తమ నాయకుడు వైఎస్ జగన్ మేనిఫెస్టో అంటే పవిత్ర గ్రంథంగా చూస్తారని పెద్దిరెడ్డి చెప్పుకొచ్చారు. చంద్రబాబు మేనిఫెస్టోను ప్రజలే కాదు కూటమి నేతలు కూడా నమ్మడం లేదని తప్పు పట్టారు. అధికారంపై లోకేశ్ కలలు కంటున్నారని పెద్దిరెడ్డి విమర్శించారు. అధికారంలోకి వచ్చి, అప్పుడే రాజధాని అమరావతిని నిర్మిస్తామని లోకేశ్ అంటున్నారని ఆయన చెప్పారు. రాజధాని పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనే లోకేశ్ ఉద్దేశం బయట పడిందని పెద్దిరెడ్డి విమర్శించారు.
తమ నాయకుడు వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారంలో మీకు మంచి జరిగి వుంటేనే ఓట్లు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారన్నారు. ఇలా చెప్పడానికి ఎంతో దమ్ము, ధైర్యం నాయకులకు ఉండాలన్నారు. తమ నాయకుడి విశ్వసనీయతే వైసీపీని గెలిపిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.