అసలు విషయం చెప్పిన స్పీకర్

అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్ అసలు విషయం చెప్పారు. ఎన్నికల ముందు రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి లోతు తెలియక ఆరు గ్యారంటీలతోపాటు అనేక హామీలు ఇచ్చామని చెప్పారు.

అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్ అసలు విషయం చెప్పారు. ఎన్నికల ముందు రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి లోతు తెలియక ఆరు గ్యారంటీలతోపాటు అనేక హామీలు ఇచ్చామని చెప్పారు. నిజమే! ఎన్నికల ముందు రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని ఏ పార్టీ కూడా స్టడీ చేయదు.

గులాబీ పార్టీ పదేళ్ళపాటు అధికారంలో ఉంది కాబట్టి రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి ఎలా ఉందో ఆ పార్టీకి అవగాహన ఉంటుంది. కానీ కాంగ్రెస్ ఎప్పుడూ అధికారంలో లేదు కదా. కానీ రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవడం కాంగ్రెస్ పార్టీకి పెద్ద కష్టం కాదు. ఆర్ధిక పరిస్థితిపై అవగాహన ఉంటే దాన్నిబట్టి ఇచ్చే హామీలను ఎలా అమలు చేయాలో అవగాహన ఉంటుంది.

లేనప్పుడు అధికారంలోకి రావాలనే తాపత్రయంతో అలవిగానీ హామీలు ఇస్తాయి పార్టీలు. తీరా అధికారంలోకి వచ్చాక హామీలు అమలు చేయలేక సతమతం కావడం సహజం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పరిస్థితి అలాగే ఉంది. హామీలు అమలు చేయకుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో, ఇతరత్రా ఎన్నికల్లో గెలవడం కష్టం.

ప్రభుత్వం నాలుగు పథకాలను జనవరి 26 నుంచి ప్రారంభిస్తామని ప్రకటించింది. కానీ ఈలోగా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అడ్డం వచ్చింది. దీంతో రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అమలు ఆగిపోయింది. రైతు భరోసా అరకొరగా అమలు చేసింది.

ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి పూర్తి స్థాయిలో చేసే అవకాశం లేదు. మార్చి నెలాఖరునాటికి రైతు భరోసా అమలు చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. కళ్యాణ లక్ష్మి చెక్కులతోపాటు తులం బంగారం కూడా ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఇది తొందరపాటు హామీ అని చెప్పకతప్పదు.

ప్రస్తుతం తులం బంగారం రేటు ఎనభై వేలకు పైగానే ఉందని చెబుతున్నారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలతోపాటు 420 హామీలు ఇచ్చిందని, వాటిని వెంటనే అమలు చేయాలని గులాబీ పార్టీ రోజూ డిమాండ్ చేస్తోంది. అందుకే ఏ పార్టీ కూడా అలవిగాని హామీలు ఇవ్వకూడదు.

2 Replies to “అసలు విషయం చెప్పిన స్పీకర్”

  1. ఇచ్చిన మాట తప్పని, మడమ తిప్పని మా “పథకాల పితామహుడు” ఆంధ్రలో 99.9% హామీలు అమలుచేసాడు కదా..! రేవంతన్నా ఆడి దగ్గరికి ట్యూషన్ పోరాదే??

Comments are closed.