తెలంగాణ కేబినెట్ విస్తరణ సామాజిక వర్గాల మధ్య చిచ్చు పెడుతోంది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి ఆశిస్తున్నా, ఆ పదవి ఇవ్వాలా, వద్దా? అనే విషయంపై పార్టీ నాయకత్వం తర్జనభర్జన పడుతున్నట్లు సమాచారం. రెడ్డి సామాజిక వర్గం నుంచి సీనియర్లు పదవులు ఆశిస్తుండగా, ఒకే కుటుంబంలోని అన్నదమ్ములు మంత్రులు అవడమా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పటికే మంత్రిగా ఉన్నారు. అయితే, ఆయన తమ్ముడు రాజగోపాల్ రెడ్డికి కూడా మంత్రి పదవి ఇస్తే, అన్నదమ్ములకు పదవులు ఇచ్చినట్లవుతుంది. దీనికి రెడ్డి సామాజికవర్గమే వ్యతిరేకించే అవకాశం ఉంది. అసంతృప్తి గళం వినిపించే ప్రమాదం ఉంది. కాబట్టి రాజగోపాల్ రెడ్డికి పదవి ఇస్తారో, ఇవ్వరో చెప్పలేం.
ఇలాంటి సమస్య చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ విషయంలోనూ తలెత్తింది. ఇది మాల, మాదిగ సామాజిక వర్గాల మధ్య చిచ్చు పెట్టేలా తయారైంది. భర్తీ చేయబోతున్న నాలుగు మంత్రి పదవుల్లో ఒకటి ఎస్సీ మాల సామాజిక వర్గానికి ఇవ్వాలని నిర్ణయించారు. వివేక్ ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవారు.
ఆయనకు మంత్రి పదవి ఇవ్వాలనే యోచనను మాదిగ సామాజిక వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇందుకు ఓ కారణం ఉంది. వివేక్ ఎమ్మెల్యే, ఆయన సోదరుడు వినోద్ ఎమ్మెల్యే. అదే కుటుంబంలోని గడ్డం వంశీకృష్ణ పెద్దపల్లి ఎంపీ. అంటే ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చట్టసభల్లో ఉన్నారు. ఇప్పుడు వివేక్‌కు మంత్రి పదవి ఇస్తే, ఒకే కుటుంబంలో నాలుగు పదవులు ఇచ్చినట్లవుతుంది.
ఇది న్యాయం కాదని మాదిగలు వాదిస్తున్నారు. వివేక్‌కు మంత్రి పదవి ఇస్తే ఊరుకోమని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పటికే మాలలకు చాలా పదవులు ఇచ్చారని, మళ్లీ వారికే పదవులు ఇస్తే ఎలా? అని ప్రశ్నిస్తున్నారు. దీంతో మాదిగ ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్లనున్నట్లు సమాచారం. ఇప్పటికే మెయిల్ ద్వారా కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, వేణుగోపాల్, మీనాక్షి నటరాజన్‌లకు ఎమ్మెల్యేలు లేఖలు పంపారు.
ఎమ్మెల్యేలు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, కవ్వంపల్లి సత్యనారాయణ, వేముల వీరేశం, మందుల సామేల్, కాలే యాదయ్యలు.. కేబినెట్‌లో తమ వర్గానికి మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి వివేక్‌కు మంత్రి పదవి ఇవ్వడంలో అధిష్టానం పునరాలోచిస్తుందా?