Advertisement

Advertisement


Home > Politics - Telangana

రి‘ప‌బ్లిక్‌’గా...ఆమె చుర‌క‌లంటించారు!

రి‘ప‌బ్లిక్‌’గా...ఆమె చుర‌క‌లంటించారు!

తెలంగాణ‌లో కేసీఆర్ స‌ర్కార్‌, గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై మ‌ధ్య రోజురోజుకూ ఆధిప‌త్య పోరు ప‌తాక స్థాయికి చేరుతోంది. రిప‌బ్లిక్ వేడుక సాక్షిగా కేసీఆర్ స‌ర్కార్‌కు గ‌వ‌ర్న‌ర్ ప‌రోక్షంగా చుర‌క‌లు అంటించ‌డం గ‌మ‌నార్హం. రిప‌బ్లిక్ వేడుక‌ల నిర్వ‌హ‌ణ‌లో కేసీఆర్ స‌ర్కార్ వైఖ‌రి స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్న సంగ‌తి తెలిసిందే. చివ‌రికి హైకోర్టు ఆదేశాల‌తో గ‌వ‌ర్న‌ర్‌తో క‌లిసి రాజ్‌భ‌వ‌న్‌లో ఉన్న‌తాధికారులు రిప‌బ్లిక్ వేడుక‌ల్లో పాల్గొన్నారు.

రిప‌బ్లిక్ వేడుక‌ల‌ను ఉద్దేశించి గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగిస్తూ... కేసీఆర్ స‌ర్కార్‌పై త‌న‌దైన స్టైల్‌లో విరుచుకుప‌డ్డారు. కొంద‌రికి తాను న‌చ్చ‌క‌పోవ‌చ్చ‌ని ప‌రోక్షంగా కేసీఆర్‌ను దృష్టిలో పెట్టుకుని అన్నారు. కానీ తెలంగాణ అంటే త‌న‌కెంతో ఇష్ట‌మ‌న్నారు. ఎంత క‌ష్ట‌మైనా తెలంగాణ ప్ర‌జ‌ల కోసం ప‌ని చేస్తాన‌న్నారు. కొత్త భ‌వ‌నాల నిర్మాణం అభివృద్ధి కాద‌న్నారు. జాతి నిర్మాణ‌మే అభివృద్ధిగా ఆమె అభివ‌ర్ణించారు. అలాగే ఫామ్‌హౌస్‌లు క‌ట్ట‌డం అభివృద్ధి కాద‌ని కేసీఆర్‌కు ప‌రోక్షంగా చీవాట్లు పెట్టారు. అంద‌రికీ ఫార్మ్‌లు కావాల‌ని ఆమె ఆకాంక్షించారు.

మన పిల్లలు విదేశాల్లో చదవడం కాద‌ని, రాష్ట్ర విద్యాలయాలలో అంతర్జాతీయ ఫెసిలిటి ఉండాల‌ని గ‌వ‌ర్న‌ర్ చెప్పుకొచ్చారు. తెలంగాణ గౌరవాన్ని నిలబెడ‌దామ‌న్నారు.  రాజ్యాంగాన్ని కాపాడుకుందామ‌న్నారు. తెలంగాణతో త‌న‌బంధం మూడేళ్లు కాద‌ని, పుట్టుకతో ఉంద‌న్నారు. నా తెలంగాణ కోటి రత్నాల వీణ అని ఆ ప్రాంత మ‌హాక‌వి మాట‌లు గ‌వ‌ర్న‌ర్ నోట రావ‌డం విశేషం. రాజ్యాంగం ప్రకారమే తెలంగాణకు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింద‌న్నారు.

తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కాపాడదామ‌ని పిలుపు నిచ్చారు. తెలంగాణలో ఆందోళనకర పరిస్థితులు ఉన్నాయ‌న్నారు. తెలంగాణలో రోజుకు 22 ఆత్మహత్యలు జరుగుతున్నాయ‌ని ఆమె సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ యువత ధైర్యంతో ఉండాలని విజ్ఞప్తి చేయ‌డం ద్వారా రిప‌బ్లిక్ దినం సాక్షిగా కేసీఆర్ స‌ర్కార్‌తో మ‌రోసారి గ‌వ‌ర్న‌ర్ పేచీ పెట్టుకున్న‌ట్టైంది. గ‌వ‌ర్న‌ర్ ఘాటు వ్యాఖ్య‌ల‌పై కేసీఆర్ స‌ర్కార్ ఎలా స్పందిస్తుందోన‌నే ఉత్కంఠ నెల‌కుంది. ఎందుకంటే కేసీఆర్ స‌ర్కార్‌పై ఆమె చేసిన విమ‌ర్శ‌ల‌ను తేలిగ్గా తీసుకోడానికి వీల్లేదు. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?