Advertisement

Advertisement


Home > Politics - Telangana

మర్యాదలు, సంస్కారంలో కేసీఆర్ స్టైల్ మారిందా?

మర్యాదలు, సంస్కారంలో కేసీఆర్ స్టైల్ మారిందా?

రాష్ట్రం రెండుగా విడిపోవడానికి ముందు.. కేసీఆర్ ఎంత దూకుడుగా మాట్లాడుతూ ఉండేవారో అందరికీ తెలుసు. ‘ఆంధ్రోళ్లు’ అనే పదమే ఒక బూతు లాగా ఆయన మార్చేశారు. ఆ పదం విలనిజానికి, దుర్మార్గానికి, దుష్టులకు ప్రతీక అన్నట్లుగా ఆయన ప్రచారంలోకి తెచ్చారు.

ఆంధ్రోళ్లు అంటూ.. వారిని ఎంత తీవ్రంగా తిట్టారంటే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండు ముక్కలుగా విడిపోతుందనే బాధ కంటె.. అలా విడిపోతే.. హైదరాబాదులో గానీ, తెలంగాణ ప్రాంతంలో గానీ.. తమని ఉండనివ్వరని, కొట్టి చంపేస్తారని కూడా ఎంతో మంది భయపడ్డారు. ఆ స్థాయి తీవ్రత కేసీఆర్ మాటల్లో ఉండేది.

కానీ.. వర్తంానంలో గమనిస్తే.. కేసీఆర్ మీద తెలంగాణలోని సీమాంధ్రుల్లో అంతగా ద్వేషం, భయం లేవు! ఎందుకంటే.. విభజన సమయంలో ఉన్న భయపూరిత వాతావరణాన్ని ఆయనే మార్చేశారు. పోరాటంలో ఉన్నప్పుడు ఎన్నెన్నో మాట్లాడుతుంటాం.. అంతే తప్ప, తెలంగాణలో నివసిస్తున్న వారంతా మా బిడ్డలే! మా ప్రభుత్వం వారందరి సంక్షేమం కోసం పనిచేస్తుంది అనే తరహా మాటలు చెప్పి.. కేసీఆర్ తన సంస్కారాన్ని నిరూపించుకున్నారు.

‘బరిలో ఉన్నప్పుడు మాత్రమే యుద్ధం, బరిలోంచి బయటకు రాగానే స్నేహం’ కొనసాగించడం అనేది అందరికీ సాధ్యమయ్యే విద్య కాదు. ఆ సంస్కారవంతమైన తీరు కేసీఆర్ లో ఉందని అందరూ అనుకున్నారు. 

అలాంటి తీరును కేసీఆర్ ఇప్పుడు మరచిపోయినట్లుగా కనిపిస్తోంది. 

రాష్ట్రపతి ఎన్నికలు ముగిశాయి. ద్రౌపది ముర్ము ఇప్పుడు సువిశాల భారతదేశానికి రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించారు. ఆమె బాధ్యతలు స్వీకరించే కార్యక్రమానికి తెరాస ప్రతినిధులు ఎవ్వరూ హాజరు కాలేదు. ఈ కార్యక్రమాన్ని వారు బహిష్కరించారు.

బిజెపికి ప్రధాన ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ పార్టీ సారధి సోనియా సహా ఆ పార్టీ వారందరూ కూడా కార్యక్రమానికి హాజరయ్యారు. యితరత్రా పార్టీల సంగతి సరే సరి. కానీ.. కేసీఆర్ ఒక ముఖ్యమంత్రిగా ఉంటూ తాను వెళ్లకపోవడం సంగతి తర్వాత, తన పార్టీ ఎంపీలను కూడా మర్యాదకోసమైనా ఆ కార్యక్రమానికి పంపలేదు.

ప్రతిపక్షాలు ఉమ్మడిగా బలపరచిన అభ్యర్థి యశ్వంత్ సిన్హాను కేసీఆర్ నెత్తికెత్తుకున్నారు. సిన్హా గెలిచే చాన్సు లేదని తెలిసి కూడా మద్దతివ్వడం.. కేవలం బిజెపి పట్ల తన ధిక్కార ప్రదర్శనకే అని అందరికీ తెలుసు. సిన్హా అనుకున్నట్టే ఓడిపోయారు.

ఎన్నికలు ముగిసిన తర్వాత.. తిరిగి సాధారణ వాతావరణానికి కేసీఆర్ అలవాటు పడాలి కదా. ఉద్యమం, రాష్ట్ర ఏర్పాటు విషయంలో అలాంటి మర్యాదను ఆయన నిరూపించుకున్నారు కద. ఇప్పుడు ఎందుకు మిస్సయ్యారు.?  

ఆయన ప్రస్తుతం బిజెపితో సున్నం పెట్టుకుని ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ దళాన్ని ఓడించగల అవకాశం ఉన్న బలమైన పార్టీగా బిజెపి అవతరిస్తున్న తరుణంలో ఆ పార్టీని చూసి కేసీఆర్ ఉలికిపడుతున్నారు. ఆ సంగతి ప్రజలందరికీ స్పష్టంగా కనిపిపస్తోంది.

మోడీని ఆత్మరక్షణలో పడేస్తున్నానని ఆయన అనుకుంటుండవచ్చు గాక.. కానీ ఆయన తీరులో ప్రతి అంశమూ.. దాచిపెట్టుకుంటున్న భయానికి సంకేతంగానే ప్రజలకు కనిపిస్తున్నాయి. 

మొన్నటి వరకు ద్రౌపది ముర్ము బిజెపి నాయకురాలు. నిన్న ఆ కూటమి తరఫు అభ్యర్థి! ఇవాళ ఆమెను రాజకీయ సులోచనాల్లోంచి చూడడానికి వీల్లేదు. ఆమె భారత దేశానికి ప్రథమ మహిళ. పార్టీ రహితంగా ఆమెను గుర్తించడం, గౌరవించడం అవసరం.

దేశ అత్యున్నత స్థానంపై ఒక గిరిజన మహిళ అధిష్ఠిస్తే.. ఆ కార్యక్రమానికి తమ పార్టీ గైర్హాజరు కావడం ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పంపిస్తుందని కేసీఆర్ కు అనిపించలేదా? ఏమో మరి?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?