Advertisement

Advertisement


Home > Politics - Telangana

నిజ‌మే.. రేవంత్ కూ, డీకే అరుణ‌కూ పోలికేంటి!

నిజ‌మే.. రేవంత్ కూ, డీకే అరుణ‌కూ పోలికేంటి!

రాజ‌కీయాల్లో ఎప్పుడు ఎవ‌రి స్థితిగ‌తి ఏ స్థాయికి పోతుందో అంచ‌నా వేయ‌లేరెవ‌రూ! తెలంగాణ సీఎం హోదాలో రేవంత్ రెడ్డి ఇప్పుడు మ‌హ‌బూబ్ న‌గ‌ర్ బీజేపీ ఎంపీ అభ్య‌ర్థి డీకే అరుణ‌ను ఉద్దేశించి ఆమెకూ త‌న‌కూ పోలికేంటి అంటూ చేసిన వ్యాఖ్య‌లు గ‌త చ‌రిత్ర‌ను గుర్తు చేస్తున్నాయి! ఒకే జిల్లాకు చెందిన వీరిద్ద‌రూ గ‌తంలో రాజ‌కీయంగా త‌గ‌వులాడుకునే వాళ్లు, ఇప్పుడూ విమ‌ర్శించుకుంటూ ఉన్నారు. అయితే అప్ప‌టికీ ఇప్ప‌టికూ చాలా వ్య‌త్యాసం అయితే ఉంది!

ఇప్పుడు కాదు కానీ.. ఒక 15 యేళ్ల కింద‌ట‌, రేవంత్ రెడ్డి టీడీపీ త‌ర‌ఫున యాక్టివ్ గా ఉన్న రోజుల్లో, 2009 ఎన్నిక‌ల‌కు కాస్త అటూఇటూగా ఉన్న రోజుల్లో రేవంత్ పై డీకే అరుణ ఒక రేంజ్ లో ఫైర్ అయ్యే వారు! డీకే అరుణ కుటుంబాన్ని రేవంత్ ఏదో విమ‌ర్శిస్తే, అందుకు ప్ర‌తిగా డీకే అరుణ స్పందిస్తూ.. మా ఇంట్లో డ్రైవ‌ర్ ఉద్యోగం ఖాళీగా ఉంది, వ‌చ్చి చేర‌తావేమో చేరు అంటూ .. డీకే అరుణ అప్ప‌ట్లో బాహాటంగా అనేవారు. ఒక‌సారి కాదు, ప‌లు సార్లు ఆ మాట వ‌చ్చేది! రేవంత్ అంటే అప్ప‌టికి డీకేకు అంత తేలిక‌!

పూర్వాశ్ర‌మంలో కాంగ్రెస్ నేత జైపాల్ రెడ్డి కుటుంబం వ‌ద్ద రేవంత్ రెడ్డి డ్రైవ‌ర్ గా ప‌ని చేశార‌ని, అలా వారింట్లో ఆయ‌న రాజ‌కీయంగా ఎదిగాడ‌ని, ఆ త‌ర్వాత తెలుగుదేశంలో చేరి త‌మ‌ను విమ‌ర్శిస్తున్నాడంటూ కాంగ్రెస్ నేత‌గా డీకే అరుణ అలా రేవంత్ పై విరుచుకుప‌డే వారు!

క‌ట్ చేస్తే.. అప్ప‌టికే మంత్రి, పాల‌మూరు జిల్లాలో పెద్ద రాజ‌కీయ కుటుంబం అయిన డీకే అరుణ ఇప్పుడు రాజ‌కీయంగా ఉనికి కోసం క‌ష్టాలు ప‌డుతున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో ఈమె ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఈ సారి మ‌రోసారి త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకుంటూ ఉన్నారు క‌మ‌లం పార్టీ త‌ర‌ఫున‌! ఒక‌వేళ క‌ష్ట‌మోన‌ష్ట‌మో ఈమె కాంగ్రెస్‌ లోనే కొన‌సాగి ఉండి ఉంటే, ఇప్పుడు కాంగ్రెస్ లో కీల‌క నేతగా ఉండేవారు, మంత్రి హోదా వ‌ద్ద‌న్నా ఉండేది! అయితే బీజేపీలో చేరి డీకే అరుణ రాజ‌కీయం అటూఇటూ కాకుండా పోయిన‌ట్టుగా ఉంది.

ఒక‌ప్పుడు రేవంత్ ను ఇష్టానుసారం తూల‌నాడారు అరుణ‌, అయితే ఇప్పుడా దూకుడు ఉండ‌క‌పోవ‌చ్చు! రేవంత్ ను అలా మాట్లాడలేక‌పోవచ్చు! రాజ‌కీయ విమ‌ర్శ‌ల‌కే ప‌రిమితం కావొచ్చు! అందుకే ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా త‌న‌కూ, డీకే అరుణ‌కు పోలికేంటి.. అంటూ ప్ర‌శ్నిస్తున్నారు! నిజ‌మే ఒక‌ప్పుడు డీకే అరుణ ముందు చోటాలా క‌నిపించిన రేవంత్ కూ, ఇప్పుడు ఆమెకూ పోలికే లేకుండా పోయింది!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?