Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌ : పాలస్తీనా సమస్య - 05

రెండవ ప్రపంచయుద్ధంలో హిట్లర్‌ సైన్యాల చేతిలో యూదులు అష్టకష్టాలు పడ్డారన్న సంగతి జగమెరిగిన సత్యం. జర్మనీ ప్రభావం పడిన దేశాలన్నిటినుండీ యూదులను రక్షించి ఇజ్రాయేలుకు తరలించే రహస్యోద్యమం మొదలైంది. యుద్ధం పూర్తయేసరికి మొత్తం జనాభాలో యూదుల సంఖ్య 33%కి చేరుకుంది. ఇది అరబ్బులకు కంటగింపు అయింది. యుద్ధం వలన దెబ్బ తిన్న బ్రిటన్‌ తన వలస రాజ్యాలను ఒక్కొక్కటిగా వదులుకోవలసి వచ్చింది. పాలస్తీనాను ఏం చేయాలో దానికి పాలుపోలేదు. ఎందుకంటే ఇజ్రాయేలు కూడా దాని చేయి దాటి పోయింది. ఇజ్రాయేలులోని అతివాద బృందాలు బ్రిటన్‌ ఏలుబడిలో వుండడానికి యిష్టపడక తమకు స్వాతంత్య్రం కావాలని ఘర్షణపడసాగాయి. దాంతో వారిని కంట్రోలు చేయడానికి బ్రిటన్‌ 1947లో ఇజ్రాయేలుకి వచ్చే యూదులను బంధించి సైప్రస్‌లో క్యాంపుల్లో పెట్టింది. ఈ పాలస్తీనా బాధ్యత నుండి తమను తప్పించమని నానాజాతిసమితి స్థానంలో 1945లో ఏర్పడిన ఐక్యరాజ్యసమితిని కోరింది. 

ఐక్యరాజ్యసమితి 1947 మేలో పాలస్తీనాపై ఒక ప్రత్యేక కమిటీ వేసింది. అది సెప్టెంబరులో యిచ్చిన సిఫార్సుల మేరకు బ్రిటిష్‌ మేన్‌డేట్‌ స్థానంలో అరబ్‌ ప్రాంతాన్ని మూడు ముక్కలు చేసింది. పాలస్తీనాను అరబ్‌, యూదు ప్రాంతాలుగా విభజించి రెండింటినీ స్వతంత్ర రాజ్యాలుగా గుర్తిస్తానంది. ఇక అందరికీ పవిత్రస్థలమైన జెరూసలెంను ఎవరికీ దఖలు పరచకుండా తటస్థంగా వుంచి దానిపై అజమాయిషీని అంతర్జాతీయ సమాజం ప్రతినిథిగా ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో వుంచుతానంది. 1947 నవంబరులో ఆ మేరకు తీర్మానం చేసింది. బ్రిటన్‌ దానికి ఒప్పుకుంది. దానికేం పోయింది, బాధ్యత తప్పితే చాలనుకుంది. ఒప్పించవలసినది అరబ్బులను. ఎందుకంటే స్థలం పోగొట్టుకుంటున్నది వాళ్లు! కానీ ఆ పని ఎవరూ పెట్టుకోలేదు. అరబ్‌ లీగ్‌, అరబ్‌ హయ్యర్‌ కమిటీ ఆఫ్‌ పాలస్తీనా దీన్ని తిరస్కరించాయి. 1947 డిసెంబరు 1 న అరబ్‌ హయ్యర్‌ కమిటీ మూడు రోజుల సమ్మె నిర్వహించింది. 

జరిగినదాన్ని అరబ్బులు నోరుమూసుకుని ఆమోదించకుండా యిలా సమ్మెలు చేయడమేమిటని వాదిస్తారు కొందరు. మన భారతదేశాన్ని హిందూస్తాన్‌, పాకిస్తాన్‌లుగా బ్రిటిష్‌ వాళ్లు విడగొట్టడాన్ని మనం సహించగలిగామా? మనల్ని బలహీనపరచడానికి ఆంగ్లేయులు పన్నిన కుట్రగా ఫీలవటం లేదా? ఒకరకంగా చూస్తే పాలస్తీనా కేసు పాకిస్తాన్‌ ఆవిర్భావం కంటె అన్యాయం. ముస్లింలు మెజారిటీ వున్న ప్రాంతాలను విడదీసి పాకిస్తాన్‌ ఏర్పాటు చేస్తున్నాం అంటూ పశ్చిమ పంజాబ్‌, వాయువ్య ప్రాంతాలను, తూర్పు బెంగాల్‌ ప్రాంతాలను విడగొట్టారు. అక్కడి ముస్లిములు ఎన్నో తరాలుగా వున్నారు. పాలస్తీనా విషయంలో ఎక్కణ్నుంచో యూదులను పట్టుకుని వచ్చి అక్కడ పెట్టి వారున్న ప్రాంతం అంటూ విడగొట్టారు. అంటే అది మాన్యుఫేక్చర్‌డ్‌ మెజారిటీ అన్నమాట. 

ఇప్పుడు హైదరాబాదు స్టేట్‌ వుంది. దాని పాలకుడు పాకిస్తాన్‌లో చేరదామను కున్నాడనుకోండి. 'జనాభాలో మెజారిటీగా వున్న హిందువులు హిందూస్తాన్‌లో చేరదామనుకుంటున్నారు కదా, కుదరదు' అని అతనితో అంటే అయితే వుండండి అని, ప్రపంచంలోని అన్ని దేశాల నుండి ముస్లిములను అక్కడకు దిగుమతి చేసుకుని, వారిని అధికసంఖ్యాకులను చేసి వారి కోరిక మేరకు పాకిస్తాన్‌లో చేరుతున్నాను అంటే, - ఎలా వుండేది? చుట్టూ హిందూస్తాన్‌, మధ్యలో పాకిస్తాన్‌! ఆ తర్వాత హైదరాబాదు నుండి యిరుగుపొరుగులపై దాడులు! ఆ చేష్టలకు అగ్రరాజ్యాల మద్దతు!! సర్దుకోమని మనకు సుద్దులు!!! ఇది మనకు అంగీకారమైతేనే ఇజ్రాయేల్‌ ఆవిర్భావాన్ని అంగీకరించాలి. అరబ్బులు ఆమోదించలేదు. అరబ్‌ బృందాలు యూదులపై దాడులు చేశాయి. యూదులు మొదట్లో ఆత్మరక్షణ చేసుకున్నా ఆ తర్వాత వాళ్లే వీళ్ల మీద పడి దాడులు చేశారు. రెండున్నర లక్షల మంది పాలస్తీనా అరబ్బులను ఆ ప్రాంతం నుండి తరిమివేశారు. 

బ్రిటన్‌ మాత్రం ఐక్యరాజ్యసమితి తీర్మానాన్ని ఆమోదించి 1948 మే 15 న తాను మేన్‌డేటరీ బాధ్యతల నుండి వైదొలగుతూ పాలస్తీనాను మూడుముక్కలు చేస్తానని ప్రకటించింది. అయితే యూదులు ఒక రోజు ముందుగానే ఇజ్రాయేలు పేరిట కొత్త దేశం ఏర్పడిందని ప్రకటించింది. తమ దేశపు సరిహద్దులు కూడా తనే ఏకపక్షంగా నిర్ణయించింది. ఐక్యరాజ్యసమితి తీర్మానం అంటే ప్రపంచదేశాలన్నీ గౌరవించాల్సినా నీ లెక్కేమిటి అని ఖాతరు చేయలేదు. పొరుగుదేశాల అంగీకారంతో దానికి పని లేదు. ఇజ్రాయేలు యిలా ప్రవర్తిస్తుంది కాబట్టే నా ఉద్దేశంలో అది రోగ్‌ (పోకిరి) కంట్రీ. ఎవరినీ లక్ష్యపెట్టదు, ఏ ఒప్పందానికి కట్టుబడదు, న్యాయాన్యాయాలు చూడదు. బలం వుంది కదాని చిత్తం వచ్చినట్లు విరుచుకు పడుతుంది. చిన్న దేశం కదా దానికి ఆ బలం ఎక్కడిది? ఎక్కడిదంటే సామ్రాజ్యవాద దేశాలది. ఇజ్రాయేల్‌ ఏర్పడగానే యిదేం పని అని చివాట్లు వేయకుండా వెంటనే బ్రిటన్‌, ఫ్రాన్స్‌, అమెరికా తదితర దేశాలు ఆ దేశాన్ని గుర్తించాయి. ఎందుకంటే వాటి చరిత్రా అలాటిదే. వలస దేశాలపై పడి తిని బలిసిన రాజ్యాలవి.  ధనస్వామ్యమే వాటిని నడిపిస్తుంది. ఆఫ్రికాలో బంగారుగనులు, వజ్రాల గనులు వుండడం వాటి ఖర్మ. వలసకు గురయ్యాయి. అలాగే అరేబియాలో పెట్రోలు పడడం దాని దురదృష్టం. వంచనకు గురయ్యాయి. ఈ విషయం గుర్తించగానే నాలుగు అరబ్‌ దేశాలు - ఈజిప్టు, సిరియా, ట్రాన్స్‌ జోర్డాన్‌, ఇరాక్‌ కలిసికట్టుగా పాలస్తీనాలో ప్రవేశించి దురాక్రమణదారుగా వారు భావించే ఇజ్రాయేలును తరిమివేయాలని చూశాయి. 

ఇది 1948  మే నాటి యుద్ధం. సౌదీ అరేబియా సైన్యదళాన్ని పంపి వూరుకుంది. యెమెన్‌ యుద్ధం ప్రకటించింది కానీ యుద్ధరంగంలోకి దిగలేదు. పశ్చిమదేశాల, అమెరికా మద్దతు వలన ఇజ్రాయేలు వీరందరినీ నిలవరించగలిగింది. ఏడాది పాటు యుద్ధం చేసినా అరబ్బులు గెలవలేదు. చివరకు 1949 జులైలో యుద్ధవిరమణ జరిగి అప్పటికి అధీనంలో వున్న ప్రాంతాలనే సరిహద్దులుగా నిర్ణయించుకున్నారు. దానికి గ్రీన్‌ లైన్‌ అని పేరు పెట్టారు. జోర్డాన్‌ తూర్పు జెరూసలెంతో సహా వెస్ట్‌ బ్యాంకును తన అధీనంలోకి తెచ్చుకుంది. ఈజిప్టు గాజాను ఆక్రమించింది. 7 లక్షల మంది పాలస్తీనీయులు ఇజ్రాయేలు ఆక్రమిత ప్రాంతాల నుండి తరిమివేయబడ్డారు. ఇలాటి ఇజ్రాయేలుపై ఐక్యరాజ్యసమితి ఆంక్షలు విధించకపోగా 1949 మేలో సభ్యదేశంగా చేర్చుకుంది. అప్పటి ఇజ్రాయేలు ప్రధాని 'ఒన్‌ మిలియన్‌ ప్లాన్‌' అని ప్రకటించి ప్రపంచంలో వున్న యూదులందరినీ ఆహ్వానించాడు. దాని కారణంగా 1948లో 8 లక్షలున్న యూదు జనాభా 1958 నాటికి 20 లక్షలైంది. 

జనాభా పెరుగుతున్నకొద్దీ ఇజ్రాయేలు, అరబ్‌ ప్రాంతాలపై దాడి చేసి ఆక్రమించుకోవడం ఎక్కువైంది. అంతేకాదు, శాంతి, సంధి పేరుతో ఒక్కోసారి ఒక్కో అరబ్‌ దేశంతో చేతులు కలుపుతూ వారులో తమలో తాము కలిసి వుండకుండా చేసింది. 1950 ఏప్రిల్‌లో ట్రాన్స్‌ జోర్డాన్‌ (జోర్డాన్‌గా పేరు మార్చుకుంది) తో సంధి చేసుకుని 'నీ అధీనంలో వున్న ప్రాంతాలు నీవే అని ఒప్పుకుంటాం, పాలస్తీనా వ్యవహారంలో జోక్యం చేసుకోకూడదు' అని షరతు విధించింది. ఓకే అనేసింది జోర్డాన్‌, పోతే పాలస్తీనా పోతుంది నాకేం అనుకుని! 1967లో జోర్డాన్‌ యితర అరబ్‌ దేశాలతో కలిసి ఇజ్రాయేలుపై యుద్ధం చేసి ఓడిపోయింది. అది అలుసుగా తీసుకుని ఇజ్రాయేలు జోర్డాన్‌ వెస్ట్‌ బ్యాంకును లాగేసుకుంది. జోర్డాన్‌ తెల్లమొహం వేసింది. ఇలా అక్కడి యుద్ధాల గురించి ఎంతైనా రాస్తూ పోవచ్చు కానీ బోరు కొడుతుంది. ఇజ్రాయేలు విధానం ఏమిటో చెప్పడానికి అక్కడక్కడ కొన్ని విషయాలు తెలుసుకుంటే చాలు. (సశేషం) 

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఆగస్టు 2014)

[email protected]

Click Here For Part-1

Click Here For Part-2

Click Here For Part-3

Click Here For Part-4

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?