Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌ : వెంకయ్యను చూస్తే జాలా? జుగుప్సా?

ఎమ్బీయస్‌ : వెంకయ్యను చూస్తే జాలా? జుగుప్సా?

మీరు మీడియాలో వుండి, మీ ఎడిటరు ఎవరిదైనా జాతీయ నాయకుడి యింటర్వ్యూ ఒక్కరోజులో పట్టుకురా అంటే ప్రస్తుతం మీకు అతి తేరగా దొరికే నాయకుడు - వెంకయ్యనాయుడు! అడగనివాడిది పాపం, ఆయన రాజ్యసభలో ఎంత ఘనకార్యం చేసి సీమాంధ్రను ఉద్ధరించారో చెప్పుకుంటున్నారు. ఒక యింటర్వ్యూ చూస్తే అన్నీ చూసినట్లే. అన్నిటా ఒకటే పాయింటు - 'కాంగ్రెసు తెలంగాణ ఎగ్గొట్టేసి, మా మీదకు తప్పు నెట్టేద్దామని చూసింది. మేం మాట పడేరకం కాదు. మీ పని యిలా వుందాని మేం కూడా సరే అనేశాం.' ఈ పాట తెలంగాణలో వినిపిస్తే ఓట్లు పడకపోయినా చప్పట్లు పడతాయి. ఆంధ్రసీమకు యీ మాటలు ఏ మాత్రం ఉపశమనం కలిగించవు. అందుకని ఆయన యింకోటి కలిపి చెప్తున్నారు - 'విభజన విషయంలో మీరు తిట్టదలిస్తే కాంగ్రెసును తిట్టండి. వాళ్లని వదిలేసి మమ్మల్ని తిట్టకండి. మేం మీకు మేలు చేద్దామని కొన్ని పాయింట్లు లేవనెత్తాం.' అని. లేవనెత్తారని మేమూ టీవీలో చూశాం. ఆ తర్వాత ఏం చేశారనేదే ముఖ్యం. వాళ్లేదో పిచ్చి సమాధానాలు చెప్తే వినేసి చతికిలపడ్డారు. ఒక్కటంటే ఒక్క సవరణ కోసమైనా పట్టుబట్టకుండా కాంగ్రెసుతో కలిసి బండి లాగించేశారు. కురియన్‌గారు ఆయ్‌ అంటే ఓయ్‌ అనుకుంటూ చదువుకుంటూ వెళ్లిపోయారు. మూజువాణీ మేజువాణీ యింత చెత్తగా వుంటుందని దేశప్రజలందరికీ తెలిసింది.

'ప్రత్యేక ప్రతిపత్తి ఐదేళ్లు చాలదు, పరిశ్రమలు పెట్టడానికే ఐదేళ్లు పడుతుంది, పదేళ్లు వుండాలి' అని వెంకయ్యనాయుడు అంటే కురియన్‌ 'హైదరాబాదు ఉమ్మడి రాజధాని ఎన్నేళ్లు?' అని షిండేని అడిగాడు. షిండే పదేళ్లు అని వేళ్లు చూపించాడు. పదేళ్లుట, హ్యాపీయేనా? అనేసి కిల్లాడీ కురియన్‌ ముందుకు వెళ్లిపోబోయాడు. అప్పుడు వెంకయ్య అడ్డుపడి 'ఉమ్మడి రాజధాని కాదు, ప్రత్యేక ప్రతిపత్తి..' అంటూ మళ్లీ అడిగారు. ఐదేళ్లే అన్నారు వాళ్లు. పదేళ్లు వుండి తీరాలి అని వెంకయ్య పట్టుబట్టలేదు. బిజెపి అంతకు ముందు రోజే 'ప్రధాని ప్రకటన రాజకీయ ప్రకటనగానే చూడాలి. బిల్లులో యిమడ్చకపోతే దానికి విలువ వుండదు' అని వాదించారు. అలా అన్నవాళ్లు రాజ్యసభలో మన్‌మోహన్‌ ఆముదం తాగిన మొహం వేసుకుని ఏదో చదివితే సరేసరే అనేశారు. బిల్లులో పెట్టాలని పట్టుబట్టనే లేదు. ఏం?

అలాగే పోలవరం ప్రాజెక్టు గురించి జైరాం రమేష్‌ అడ్డంగా అబద్ధాలు ఆడేస్తున్నాడు. భద్రాచలంలోని మండలాలు కాకుండా గ్రామాలు మాత్రమే కలుపుతూ పునరావాసం సవ్యంగా జరక్కుండా చేస్తున్నాడు. ఒడిశా ఎంపీ యీ మేటర్‌ సబ్‌-జ్యుడిస్‌ (కోర్టులో వున్న వ్యవహారం) అయినపుడు జాతీయ ప్రాజెక్టుగా ఎలా ప్రకటిస్తారు? అని సూటిగా అడిగాడు. జైరాం రమేష్‌ దేనికీ సమాధానం చెప్పలేదు. 2010లో పోలవరం జాతీయప్రాజెక్టుగా ప్రకటించేటప్పుడు దాన్ని తెలంగాణ నాయకులు అడ్డుకున్నారు. పర్యావరణం పేరుతో, పునరావాస చర్యల పేరుతో కేంద్రమంత్రిగా అడ్డుకుని వాళ్లకు సహకరించినది జైరాం రమేశే. ఒడిశాలో ప్రజాభిప్రాయం సేకరణ జరిగితే తప్ప అనుమతి యివ్వం అన్నాడు. అక్కడి ప్రభుత్వం ఆ ప్రజాభిప్రాయ సేకరణ చేయదు, మన ప్రభుత్వం వెళ్లి చేయబోతే చేయనీయదు. మొన్నటికి మొన్న 'పోలవరం రావడం నాకు యిష్టం లేదు' అని ప్రకటించినదీ జైరామే. అలాటివాడు 'పోలవరం పూర్తి చేసే బాధ్యత నాది' అని చెపితే మనం నమ్మాలా? మూణ్నెళ్ల తర్వాత యీయన మంత్రిగా కూడా వుండడు. ఇవన్నీ వెంకయ్యకు తెలియదా? అయినా నమ్మినట్టు నటించడం దేనికి?

ఇక మొదటి సంవత్సరం సీమాంధ్రకు రెవెన్యూలోటు వుంటుంది కాబట్టి రూ.10 వేల కోట్లు అడుగుతానన్న వెంకయ్య పూర్తిగా జావకారిపోయాడు. జైరాం రమేశ్‌ ఎపాయింటెడ్‌ డేట్‌, బజెట్‌ డేట్‌ అనే మాటల్ని తిప్పితిప్పి చెపితే సంతృప్తి పడిపోయి కూర్చున్నాడు. హైదరాబాదు ఆదాయంలో వాటా అడగడం అత్యంత ముఖ్యమైన విషయం. హైదరాబాదుకు 13 వేల కోట్ల రూ.లు మిగులు ఆదాయం. సీమాంధ్రకు 17 వేల కోట్ల రూ.ల లోటు బజెట్‌. అయినా హైదరాబాదు ఆదాయంలో వాటా ఒక్క పైసా కూడా యివ్వలేదు. వెంకయ్య అడగనే లేదు. ఇంతకు మించిన అన్యాయం వుందా? 

కాంగ్రెసువాళ్లు అనుకున్న దాని కంటె అంగుళం ముందుకు కదలలేదు. బిజెపి వాళ్లతో కలిసి సీమాంధ్రను దగా చేసింది. ఏదైనా సవరణ పాసయితే మళ్లీ లోకసభకు వెళ్లవలసి వస్తుంది. అక్కడ మళ్లీ టీవీలు ఆపేసి, ఎంపీలను తన్నిస్తే రభస అవుతుంది అనుకుని యిద్దరూ కలిసి డ్రామా ఆడేసి రాష్ట్రాన్ని చీల్చేశారు. లోకసభలో బిల్లు ప్రవేశపెట్టలేదని మొదటిరోజు వాదించిన సుష్మా స్వరాజ్‌ రెండో రోజు ఆ వూసే ఎత్తకుండా, ఏ సవరణా ప్రతిపాదించకుండా కాంగ్రెసుకు సహకరించింది. టీవీ ప్రసారం ఆపేసినపుడు బిజెపి ఎంపీలు వచ్చి ఆమెకు చెపితే 'మీరేం మాట్లాడకండి' అని ఆమె అన్నట్టు ఎన్‌డిటివి చెప్పింది. తర్వాత ఆ విషయం నాకు తెలియదని సుష్మ బుకాయించింది. టీవీ మాట వదిలేయండి, సవరణలు కోరతాం అన్నవారు ఎందుకు కోరలేదు? సుష్మ నిస్సిగ్గుగా కాంగ్రెసుతో కుమ్మక్కయింది. వెంకయ్య మాత్రం సిగ్గు నటిస్తూ కాంగ్రెసుతో పోరాడినట్లు భ్రమలు కల్పించబోయారు. కానీ రాజ్యసభ తతంగం యావత్తు టీవీల్లో వచ్చేసింది కాబట్టి యీయన ప్రతాపమూ తెలిసిపోయింది.

మరొకరైతే తలవంచుకుని యిటువైపు రావడం మానేస్తారు. కానీ వెంకయ్య తగుదునమ్మా అని జనాల్లోకి వచ్చి మాట్లాడదామని చూస్తున్నారు.  తెలంగాణ విషయంలో వెనక్కి పోయామని కాంగ్రెసు ఎక్కడ మమ్మల్ని అనేస్తుందోనని మేం వాళ్లతో కుమ్మక్కయ్యాం అంటున్నారు వెంకయ్య. కాంగ్రెసు వాళ్ల ఏదో ఒకదానికి మిమ్మల్ని అంటూనే వుంటారు.  దేశాన్ని మతం పేరుతో చీలుస్తున్నారు, రక్తపిపాసులు, గాంధీగార్ని చంపిన సిద్ధాంతాలు మీవి అంటున్నారు. దానికి ఏం చేస్తారు? ఇంత చేసినా తెలంగాణ విషయంలో బిజెపి అడ్డుపడబోయింది, మేమే వాళ్ల పీచమణచి తెలంగాణ తెచ్చాం అని టి-కాంగ్రెసు నాయకులు చెప్తున్నారు. దానికేం చేస్తారు? అన్నిటికీ వెంకయ్య దగ్గర సమాధానం ఒక్కటే - 'సీమాంధ్రులారా, యిప్పుడు మీకు అన్యాయం జరిగిందని బాధపడకండి. రాబోయే ప్రభుత్వం మాదే. మేం అన్నీ సరిచేసేస్తాం'. పార్లమెంటులో షిండే, సిబ్బల్‌ కూడా గూడుపుఠాణీ ధోరణిలో బిజెపి వాళ్లతో అన్నారు - 'కోర్టు యీ బిల్లు కొట్టేస్తే దానిదేముంది, మీరో మేమో పరిపాలనలోకి వస్తాం, మనిద్దరం కలిసి రాజ్యాంగసవరణ చేసేస్తాం' అని. ఆ పనేదో యిప్పుడే చేయవచ్చుగా! ఎన్నికల తర్వాత మీరో, మేమో అధికారంలోకి వచ్చేస్తాం అంటూ అంత ధీమా దేనికి? ఢిల్లీ ఎసెంబ్లీ ఎన్నికలలో అలాగే అనుకున్నారు. చివరకు అరవింద్‌ కేజ్రీవాల్‌ యిద్దరికీ జెల్లకాయ కొట్టాడు. రేపు ఎన్నికల్లో యితర పార్టీలు అధికారంలోకి వస్తే యీ రాజ్యాంగ సవరణలు ఏమవుతాయి? సీమాంధ్రకు జరిగిన అన్యాయాన్ని ఎవరు పూరిస్తారు?

ఇవన్నీ వెంకయ్యనాయుడుకి తెలియవా? అయినా ఆయన ఏ మొహం పెట్టుకుని సీమాంధ్ర ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు? సుష్మ స్వరాజ్‌ తెలంగాణకు చిన్నమ్మ అవుదామనుకుంటున్నారు. అక్కడ నుండి పోటీ చేసినా చేయవచ్చు. బిజెపి రాష్ట్రనాయకులందరూ తెలంగాణ వారే. వారంతా వారు కోరుకున్నది సాధించడానికి ఏదో ఒకటి చేశారు. సీమాంధ్ర నుండి జాతీయ స్థాయికి ఎదిగిన వెంకయ్య నాయుడు సీమాంధ్రకు చేసినదేమిటి? ఈ రోజు తన చేతిలో వున్నది చేయలేదు కానీ రేపు ఏదో చేస్తానని చెప్పడమేమిటి? మమ్మల్ని గెలిపిస్తే ప్రత్యేక ప్రతిపత్తిని పదేళ్లు చేస్తాం అన్న స్లోగన్‌ ఒకటా? ఐదేళ్లకే దిక్కూ దివాణం లేదని అందరికీ తెలుసు. ఆ నిర్వచనం సీమాంధ్రకు అప్లయి కాదని, జాతీయ అభివృద్ధి మండలి ఆమోదించదని అందరికీ తెలుసు. ఇది కంటితుడుపు కాదు, మోసగింపు. ఈ మోసంలో కాంగ్రెసు, బిజెపి యిద్దరూ దోషులే. సీమాంధ్ర ప్రజలకు ఏ మాత్రం వివేకం వున్నా యిద్దరికీ బుద్ధి చెప్పాలి. వారికి వివేకం కలగకుండా చేయడానికి, మాయమాటలతో మభ్యపెట్టడానికి ప్రయత్నం చేస్తున్న వెంకయ్యను చూస్తే జాలి కలుగుతుందా, జుగుప్స కలుగుతుందా అంటే చెప్పడం కష్టం. ఎందుకంటే 1972 ఉద్యమంలో విద్యార్థి నాయకుడిగా సీమాంధ్రకు అన్యాయం జరుగుతోందని గంభీరోపన్యాసాలు యిచ్చి తన రాజకీయభవిష్యత్తుకు పునాది వేసుకున్న వెంకయ్య యీనాడు అదే సీమాంధ్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టి తన రాజకీయ జీవితాన్ని కాపాడుకున్నారు.  

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఫిబ్రవరి 2014)

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?