ఎమ్బీయస్‌ : కొసరు కొమ్మచ్చి – 6

చిత్రాలు చూడరో…  : 1996 జూన్‌ 28కి రమణ వర్ణనాచాతుర్యంపై ఒక వ్యాసం రాసి ఆంధ్రజ్యోతి వీక్లీలో యిచ్చాను. దానితో బాటు బాపు వేసిన రమణ రేఖాచిత్రం సర్క్యులేషన్‌లో పెట్టాను. నిజానికి అది ''ముళ్లపూడి…

చిత్రాలు చూడరో…  : 1996 జూన్‌ 28కి రమణ వర్ణనాచాతుర్యంపై ఒక వ్యాసం రాసి ఆంధ్రజ్యోతి వీక్లీలో యిచ్చాను. దానితో బాటు బాపు వేసిన రమణ రేఖాచిత్రం సర్క్యులేషన్‌లో పెట్టాను. నిజానికి అది ''ముళ్లపూడి వెంకటరమణ కథలు'' (రచన – ముళ్లపూడి వెంకటరమణే) అనే పుస్తకానికి బాపు వేసిన ముఖచిత్రం. నాకు చాలా యిష్టమైనది. అప్పటిదాకా పత్రికల వారి వద్ద రమణగారిది ఒకే ఫోటో వుండేది. ఇది చలామణీలో పెట్టాక చాలా పాప్యులర్‌ అయింది. సాహితీసర్వస్వంపై ఆ బొమ్మనే వేశాను. ఎందుకంటే ఆ రచనలు చేసినపుడు ఆయన అలానే వుండేవారు కాబట్టి! 

నా వ్యాసం చూసి ఆంధ్రజ్యోతి వీక్లీ వారు 'మీరు రమణగారికి చెప్పి మాకేమైనా రాయించవచ్చు కదా' అన్నారు. 'పుస్తకరూపంలో రాని ఆయన సినిమా సమీక్షలు వున్నాయి. వాటికి ఫోటోలు చేర్చి, ఆ సినిమాల గురించిన యిన్‌ఫర్మేషన్‌ అప్‌టుడేట్‌ చేస్తూ – అంటే దీనికి మూడు ఆస్కార్లు వచ్చాయి, కొంతకాలానికి వేరే పేరుతో రీమేక్‌ చేశారు యిలా అన్నమాట.. – బాక్స్‌ ఐటమ్స్‌గా తయారుచేసి యిస్తాను. వేస్తారా? అన్నాను. 1996, 97లలో అవి ''చిత్రాలు చూడరో..'' అనే పేరుతో వచ్చాయి. వాటికి పాఠకుల స్పందన చాలా బాగా వచ్చింది.  రమణగారికి ఉత్సాహం పెరిగింది. ఇంతలో ''సాల్మన్‌ అండ్‌ షెబా'' సమీక్ష వచ్చాక ఎవరో కాని ''అది రమణది కాదు, వేరేవాళ్లది. అన్నీ రమణ తన పేరున వేసేసుకుంటున్నాడు'' అని అన్నారట. ఆయన చాలా బాధపడి శీర్షిక ఆపేయమన్నారు. 

నేను మళ్లీ వాదించాను. ''అనామకంగా వచ్చే రచన విషయంలో యిది తప్పదండి. పరిశోధనలో పొరపాట్లు దొర్లవా? మీ శైలి బాగా పాప్యులర్‌ కావడంతో మీ కొలీగ్స్‌ చాలామంది దాన్ని అనుకరించారు. అందువలన ఏది మీదో, ఏది కాదో తెలుసుకోవడం కష్టం. ఇన్నేళ్లు పోయాక మీకూ గుర్తుండదు. అది అడ్డు పెట్టుకుని మీకు దురుద్దేశం ఆపాదించడం అన్యాయం.'' అని. ఆయన అనిష్టంగానే ''మీ జడ్జిమెంటుకి వదిలేస్తున్నాను.'' అన్నారు. దానాదీనా  సినిమా రచయితగా, నిర్మాతగా ప్రజల దృష్టిలో స్థిరపడిపోయిన రమణ పాఠకలోకానికి మళ్లీ పరిచయమయ్యారు.

ఈ వ్యాసాలకై ఆంధ్రజ్యోతివారు రమణగారికి పారితోషికం పంపారు. అప్పట్లో వారికి అది అలవాటు లేని పని. రమణగారి పేరు చూసి పంపారు. ఈయన అది కూడా వుంచుకోలేదు. ఎవరో ఒడుగు చేసుకుంటామంటూ వస్తే వాళ్ల చేతిలో ఆ డబ్బు పెట్టేశారట. 'ఇదంతా ప్రసాద్‌గారి పుణ్యం' అన్నారట శ్రీరమణగారితో. ఆయనే నాకు చెప్పారు. ఈ ఔదార్యం రమణగారి దగ్గర బాగా గమనించాను. నిజానికి అదంతా ఆయనకు కష్టకాలం. వేరేవాళ్లకోసం అప్పులిచ్చి నిండా మునిగి వడ్డీలు కట్టుకుంటూ వున్నారు. ''పెళ్లికొడుకు'' ఆయనను బాగా దెబ్బ తీసింది. అలాటి సమయంలో నాలుగు రూకలు వస్తే దగ్గర పెట్టుకోవాలని అనుకోలేదాయన. ఆయన డబ్బుతో ఎప్పుడూ సరసాలాడుతూనే వున్నారు. ఆయన చిన్నప్పటి స్నేహితులైన వాకాటి కూడా చెప్పేవారు. డబ్బు ఎలా వస్తుంది అనే చింత వున్నట్టు కనబడేది కాదు. ఎంతో మేధావి అయి వుండి, 'ఋణహృదయాన్ని' పూర్తిగా ఆకళింపు చేసుకుని కూడా ఋణాల చేత దాఋణబాధకు గురయ్యారు. వ్యవహారదకక్షుడై వుండి కూడా ఆర్థిక వ్యవహారాల నిర్వహణలో దెబ్బ తిన్నారు. ఋణగ్రస్తుడిగానే పోతానేమోనని చింతించారు కొంతకాలం. కానీ దేవుడు కొన్నాళ్లకు ఆ చింతలన్నీ తొలగించి, ఆర్థికపరిపుష్టి, చిత్తశాంతి కలిగించి ఆ తర్వాతే తీసుకుని వెళ్లిపోయాడు.

ముళ్లపూడి కథల గురించి : ''రావిశాస్త్రి స్మారక ట్రస్టు(హైదరాబాదు)'' వారు 1998 సంవత్సరం అవార్డు రమణగారికి యిచ్చారు. ఆ సందర్భంగా ''రచన'' అక్టోబరు, 1998 సంచిక రమణ ప్రత్యేక సంచికగా వెలువరించింది. శాయిగారు నన్ను ఒక ప్రత్యేక రచన చేయమన్నారు. 'సబ్జక్ట్‌ మీ యిష్టం' అన్నారు. ఏం రాయాలో, ఎలా రాయాలో నాకేం తోచలేదు. ఓ రోజు ఓ వామపక్ష కథా రచయితతో  రమణ రచనల గురించి మాట్లాడబోతే ఆయన ''నేను చదవనండి. ఆయనకు సామాజిక స్పృహ లేదు.'' అనేశారు. నేను తెల్లబోయి, 'అదేమిటండీ అలా అంటారు..' అని వాదించబోతే 'నాకే కాదండీ, మాలాటి వాళ్లం ఎవరమూ ఆయన్ని ఆమోదించం.' అంటూ విశాఖపట్టణంలో  అభ్యుదయ కథా సంకలనం వేయబోయినపుడు రమణ కథ చేర్చాలా వద్దా అని వివాదం వచ్చి సంకలనమే వెలువడలేదని చెప్పారు. నేను ఆశ్చర్యపడ్డాను. అప్పుడు గుర్తుకు వచ్చింది. 
రావిశాస్త్రి ఎవార్డు సమయంలో మాట్లాడిన వాసిరెడ్డి సీతాదేవి గారు కూడా ఎంతసేపూ ''బుడుగు'' గురించే మాట్లాడారు తప్ప ''ఆకలీ-ఆనందరావు'', ''ఛాయలు'', ''మహారాజు-యువరాజు'' కథల గురించి మాట్లాడలేదని. అసలు వీళ్లు ఆయన కథలన్నీ చదివారా లేదాన్న అనుమానం వచ్చింది. రమణ కథల, వ్యాసాల గురించి, వాటిలో వైవిధ్యం గురించి ఒక విహంగవీక్షణం చేసి చూపిస్తే మంచిదనిపించింది. ఇది ఒకళ్లిద్దరి అభిప్రాయం మాత్రమే కాదని 'కానుక'లో ఆరుద్ర పీఠిక చదివితే అర్థమైంది. ఇక ఆ దృక్పథాన్ని ఖండిస్తూ రాసుకుని పోయాను. అదే యీ వ్యాసం – 

అవధులు లేని కథా రచయిత ముళ్లపూడి వెంకటరమణ

ముళ్లపూడి హాస్య రచయితగా సుప్రసిద్ధుడు కావడం వల్ల అయన బహుముఖ ప్రజ్ఞ చాలా మందికి తెలియకుండా పోయిందనే చెప్పాలి. రమణ ఆంధ్ర సచిత్ర వారపత్రికలో పనిచేసే రోజుల్లో పిల్లల కోసం సైన్స్‌ రచనలు చేసారనీ, స్త్రీల కోసం మహిళా రచనలు చేసారనీ, అనేక రకాల సబ్జెక్టులపై అనేకమందిపై వ్యాసాలు రాసారనీ, అనువాదాలు చేసారనీ, ''ప్రేమించి చూడు'', ''పక్కలో బల్లెం'' సినిమాలకు పాటలు రాసారని చెబితే ''ఆహాఁ, అలాగా. ఆయన సరదాకథలు రాసాడనీ, ఇదివరకు సినిమా రివ్యూ లేవో రాసేవాడనీ అనుకున్నానే. ఇవన్నీ ఎప్పుడు చేసాడు?'' అనేవాళ్లే ఎక్కువ.

పిల్లల కోసం రమణ రాసాడనగానే 'బుడుగు' యే అందరికీ గుర్తుకొస్తుంది. బుడుగు భాష, బుడుగు ఆలోచనా సరళి తెలుగు ప్రజలపై చెరగని ముద్ర వేసేసి, 'తెలుగుపిల్లలున్నంతకాలం బుడుగు చిరంజీవి' అనేట్లా జరిగింది. బుడుగు నిజానికి పెద్దల కోసం రాసిందే అనుకోవాలి. పిల్లల చేష్టలు చూసి మురిసేది పెద్దలే కదా.
పిల్లల కోసం రమణ రాసిన ''భోగిమంట'' కథ ఆంధ్ర ప్రతిక వీక్లీ 12-1-1995లో ప్రచురించబడి 40 ఏళ్ళ తర్వాత ''రచన'' జనవరి 1995లో పునర్ముద్రించబడింది. భోగిమంట దగ్గర కూర్చున్న కుర్రాళ్ల కబుర్లు చెబుతుందా కథ. వాళ్ల భాషలోనే- ''ఒరేయ్‌ బాబీ! మీ ఇంట్లోకి పరిగెట్టుకెళ్లి ఇంకో రెండు తాటాకు బుట్టలూ, నాలుగు బైండు బుక్కుల అట్టలూ పట్రారా. మంట అయిపోతుంది.. పరవాలేదులే బైండు బుక్కుల అట్టలేం సరస్వతి కాదులే… పాపం కాదురా, ఒట్టురా, మా చిన్నన్నయ్య కూడా చెప్పాడు…'' అంటుంది.
''స్వయంవరం'' అనే కథ కూడా పిల్లల కోసం రాసినదే.

ఎగరడానికి మనిషి చేసిన ప్రయత్నాల గురించి, దానిలో ఇమిడి వున్న సైన్స్‌ గురించి పిల్లలకర్థమయ్యేటట్టు పి.దక్షిణామూర్తి అనే పేర రమణ రాసిన ''విమానం కథ'' 1958లో సీరియల్‌గా వచ్చింది. అది ఎంత జనరంజకంగా రాసారో కాస్త చూడండి – ''విమానాల మీద కన్న బెలూన్‌ మీద ఎగరడమే ఒక విధంగా గొప్ప కదా. ఇందులో ఎక్కువ ప్రమాదం ఉంది. అది మనిషిని ఎక్కడికి తీసుకెళ్తుందో చెప్పలేం. ఎప్పుడు పేలిపోతుందో, ఎప్పుడు నిప్పంటుకు భగ్గుమంటుందో (అంటుందిలే) చెప్పలేము. అలాటిది జరిగితే కథ కంచికి వెళ్ళిపోతుంది. శత్రుసైన్యం ఏం చేస్తోందో చూసి చక్కా వద్దామని ఈ బెలూన్‌ ఎక్కి వెళ్లారనుకో. సరిగా ఆ సైన్యం నెత్తిమీద, ఎత్తుగా ఉన్న బెలూన్‌ గబుక్కున పేలిపోతే. గోవిందా అని ఇంగ్లీషు భాషలో అరుస్తూ ఇతగాడు సరాసరి శత్రువుల వళ్లో పడతాడుగదా. ఆ తరువాత వాళ్ళు ఇతన్ని మళ్ళీ గోవింద కొట్టించేస్తారు.''
అలాగే ఆడవాళ్ల సంగతులు గురించి కూడా రాయడానికి రమణ ఆడపేరు ఎంచుకున్నారు. సి.వి.విజయలక్ష్మి, సి.వి.వి.లక్ష్మి అనే పేర్లు పెట్టుకుని 'ఎప్పుడూ ఇంతే', 'చోళీ దాని పరిణామాలు', 'జడలూ, వాటి తీరూ', 'కట్టూ-బొట్టూ', 'సలహాలు', 'ఉల్లి చేసిన మేలు', 'పొరపొచ్చాలు' – ఇలాటి వ్యాసాలు రాసారు. 'అత్తలూ-కోడళ్లూ', 'నగలు-నాణ్యాలు' వంటి వ్యాసాలు పేరు లేకుండానే రాసారు. 

''అత్తలూ-కోడళ్లూ'' (అక్టోబర్‌ '59) వ్యాసం కోడళ్లకూ, అత్తలకూ కొన్ని ప్రశ్నలు ఇచ్చి వాటి సమాధానాల బట్టి మీ మీ స్వభావాన్ని అంచనా వేసుకోమంటుంది. అయితే ఆ వ్యాసం మొదట్లోనే ఓ సూచన! – 'ఒకరి స్వభావం ఒకరికి తెలుసుగదా అని అత్తగారి ప్రశ్నలకు కోడలు, కోడలు ప్రశ్నలకు అత్తగారూ తమంతట తాము సమాధానాలు చెప్పేయకూడదు. ఎవరి ప్రశ్నలకు వారే సమాధానాలు చెప్పుకుని ఊరుకోవాలి.'

'నగలు-నాణ్యాలూ' (ఆగస్టు '59) అన్న వ్యాసం ప్రారంభం గమ్మత్తుగా ఉంటుంది. ''ఏదో వినయం కొద్దీ శ్రావణ మాసం తన గురించి అలా చెప్పుకుంటుంది తప్ప అది శనగల మాసమే కాదు. నగల మాసం కూడా. కొత్త పెళ్లికూతుళ్లకు శ్రావణంలో తొలి శనగల వాయనం ఇచ్చి పుచ్చుకునే వేళకు నగల వాయనం ముట్టి ఉండడం రివాజు'' అంటూ మొదలుపెట్టి ''మన కనుముక్కు తీరును బట్టి. సౌలభ్యాన్ని బట్టి నిరాడంబరంగా నగలు ధరించి అలంకరించుకోవడం మన అభిరుచిని, సంస్కారాన్ని తెలియజేస్తుంది. అసలు నగలు ఎలాటివి ఎన్నేసి పెట్టుకున్నామన్నది ప్రశ్నే కాదు. పెట్టుకున్నవి మనకి నప్పుతున్నాయా, మన వల్ల వాటికి, వాటి వల్ల మనకీ అందం వస్తోందా అన్నదే ముఖ్యం '' అంటూ ముక్తాయింపు పలికారు.

'బాల వ్యాకరణం'ను 'పన్‌' చేస్తూ 'బాలా వ్యాకరణం' పేర ఆడవాళ్ల ఆలోచనా ధోరణిని ప్రదర్శించారు రమణ. 

''నై' తత్పురుష'' అనే పేరుతో జనవరి '57లో రాసిన వ్యాసంలో జీవితంలో పనికివచ్చే కొన్ని సూచనలు చేశారు. ''నువ్వు చెప్పేది పచ్చి అబద్ధం'' అనే బదులు ''నువ్వు నిజం చెప్పటంలేదు కదూ?'' అనవచ్చంటారు. 

సి.వి.విజయలక్ష్మి పేరుతో శాస్త్ర సమాచారం అందించే వ్యాసాలు కూడా రాశారు. ''సయాం కవలల కథ'' అనే పేరుతో జూన్‌'57లో రాసినది ఇలా ప్రారంభమవుతుంది-. ''కవల పిల్లలు కలిసిపోయి పుట్టారన్న కబురుతో ఊరంతా అట్టుడికిపోయింది. ''కలికాలం వచ్చి పడిందనుకున్నారు.'' జనం అంతా సయామీస్‌ భాషలో దేశానికి అరిష్టం అన్నారు పెద్దలు. అందువల్ల వాళ్లని వధించడం మంచిదని అభిప్రాయపడ్డాడు రాజు. శాస్త్రోక్తంగా వధించితే, అందువల్ల కవలల జన్మ రహస్యం అవగతం చేసుకోవచ్చునని, ఆశపడ్డారు వైద్య శాస్త్రజ్ఞులు. ఆ కవలలను కన్న తల్లి మటుకు అలా అనుకోలేదు…''(సశేషం)

 – ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఆగస్టు 2014)

[email protected]

Click Here For Part-1

Click Here For Part-2

Click Here For Part-3

Click Here For Part-4

Click Here For Part-5