ఎమ్బీయస్‌ : పొత్తుల వెనుక ఎత్తుపైయెత్తులు

సీమాంధ్రలో టిడిపి-బిజెపి పొత్తులపై తుదిరూపం ఇవాళ రావచ్చంటున్నారు. వస్తుందో లేదో తెలియదు. నిన్న బాబు ‘తెలంగాణలో బిజెపితో పొత్తు వుంది, సీమాంధ్రలో లేదు’ అని బహిరంగంగా అన్నారు. వెంటనే ‘ఆయన అన్నది విన్నాం. ప్రస్తుతానికి…

సీమాంధ్రలో టిడిపి-బిజెపి పొత్తులపై తుదిరూపం ఇవాళ రావచ్చంటున్నారు. వస్తుందో లేదో తెలియదు. నిన్న బాబు ‘తెలంగాణలో బిజెపితో పొత్తు వుంది, సీమాంధ్రలో లేదు’ అని బహిరంగంగా అన్నారు. వెంటనే ‘ఆయన అన్నది విన్నాం. ప్రస్తుతానికి పొత్తు వుంది. రేపు ఏ విషయం తేలుస్తాం’ అన్నారు జావడేకర్‌. అదే ఫైనలో, ఆ తర్వాత ‘అబ్బే ఇవన్నీ తూనాబొడ్డు, ఆటల్లో అరటిపండు, ఉత్తుత్తినే వేళాకోళం ఆడుకున్నాం’ అంటారేమో తెలియదు. ఈ రెండు పార్టీల మధ్య తెలంగాణలో పొత్తు గురించి కూడా ఇలాంటి సీ-సా గేమ్‌ జరిగింది. ఫైనల్‌గా ఏదో తునితగవు చేసుకున్నారు. అక్కడ పొత్తు వద్దని బిజెపి క్యాడర్‌ తిరుగుబాటు చేసినా బాబు బిజెపి జాతీయనాయకత్వాన్ని ఒప్పించి వాళ్ల మెడలు వంచారు. సీమాంధ్రకు వచ్చేసరికి తిరుగుబాటు చేయడం టిడిపి క్యాడర్‌ వంతైంది. ఇప్పుడు వారి మెడలు వంచవలసిన టిడిపి నాయకత్వమే వారికి తలవంచుతోంది. దానికి పలుకారణాలు చెపుతోంది.

బలం లేనిచోట్ల సీట్లు అడిగితే ఎలా..?

రెండు రాష్ట్రాలు ఇంకా విడిపోనప్పుడు పొత్తు పార్టీలు మొత్తం ప్యాకేజీ ఒకేసారి మాట్లాడుకోవలసినది. తెలంగాణలో పొత్తు కుదిరి, నామినేషన్ల ఘట్టం పూర్తయేదాకా ఆంధ్రపై పేచీ పెట్టకుండా వుండి, ఇప్పుడు టిడిపి పేచీ పెట్టడం అన్యాయంగా తోస్తుంది. బిజెపికి ఎలాట్‌ చేసిన స్థానాల్లో టిడిపి నాయకులు ఎడాపెడా నామినేషన్లు వేసేస్తున్నారు. వీరికి బుద్ధి చెప్పడానికి తెలంగాణలో అన్ని స్థానాలకూ పోటీ చేయాలని తెలంగాణ బిజెపి నాయకులు అనుకున్నా అక్కడ నామినేషన్ల గడువు దాటిపోయింది. స్థూలంగా అంకెలు నిర్ధారించుకున్నాం కాబట్టి, పొత్తు కుదిరినట్టే అని బిజెపి నాయకులు అనుకున్నారు బాగుంది. ఇప్పుడు బాబు బిజెపిలో తప్పులు ఎంచుతున్నారు. వారు తమకు బలం లేని చోట్ల సీట్లు అడిగారట, అక్కడ బలహీనమైన అభ్యర్థులను నిలుపుతున్నారట, తాము చెప్పిన కాండిడేట్లకు టిక్కెట్లు ఇవ్వలేదట. ఈ కారణాలు భలే వింతగా వున్నాయి. పొత్తు ప్రతిపాదన చేసినపుడు బిజెపికి బలం వుండి, నామినేషన్ల వద్దకు వచ్చేసరికి హఠాత్తుగా బలం ఎగిరిపోయిందా?

అసలు బిజెపికి ఆంధ్రలో బలం ఎక్కడుంది కనుక? ఒకచోట బలం వుందని, మరో చోట బలం లేదని, ఫలానా బిజెపి నాయకుడు బలవంతుడని, ఫలానావారు బలహీనుడని బాబు ఎలా నిర్ణయిస్తున్నారు? గత అసెంబ్లీలో బిజెపికి ఆంధ్రలో సీట్లు లేవు కదా, వారు చేపట్టిన ఉద్యమాలు ఏవీ లేవు కదా. స్థానిక ఎన్నికలు జరిగి వుంటే ఫలానా మునిసిపాలిటీలో వారికి ఆధిక్యం వుంది అనుకునేవారం. టీవీ చర్చల్లో కూడా బిజెపి నాయకులు పాల్గొన్నారు అంటే వారు తెలంగాణ నాయకులే తప్ప, ఆంధ్ర నుండి ఎవరూ లేరు. జులై తెలంగాణ ప్రకటన వచ్చిన తర్వాత ఆంధ్ర బిజెపి నాయకులంటూ ఒకరిద్దరు అప్పుడప్పుడు టీవీల్లో కనబడ్డారు. ఇలాంటి బిజెపికి కొన్ని స్థానాల్లో బలం వుందని, మరి కొన్ని వాటిల్లో లేదని బాబు ఎలా చెప్పగలరు? ఆట్టే మాట్లాడితే ఎక్కడా లేదు. కమలం గుర్తును గ్రామీణప్రాంత ప్రజలు గుర్తు పడతారని కూడా అనుకోను. ఇప్పుడు మోడీ హవా వీస్తోందని హోరెత్తిస్తున్నారు కాబట్టి నగరాలలో మధ్యతరగతి ప్రజలు (వీళ్లల్లో ఓట్లేసేవారు ఎందరో తెలియదు) బిజెపికి ఓటేస్తారని అనుకోవాలి. అది కూడా మోడీని ప్రధాని చేయడానికి.. అంటే, పార్లమెంటు ఎన్నికలలోనే బిజెపికి ఛాన్సుంది! స్థానిక బిజెపి నాయకుణ్ని మంత్రిని చేయడానికై అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపికి ఓటేస్తున్నాం అని ఓటరు ఎవరి గురించైనా చెప్పగలరా? అసలు ఎవరున్నారో తెలిస్తే కదా! అందరూ బలహీన నాయకులే. ఏ పొత్తు లేకుండా సొంతంగా నిలబడి గెలిచే కాండిడేటు ఒక్కడూ కనబడరు. 

బిజెపి దేహంలో టిడిపి ఆత్మ

బిజెపికి వున్న నాయకుల కొరత తెలిసే బాబు పాపం సాయపడదామనుకున్నారు. కాంగ్రెసు, వైకాపాల నుండి తన దగ్గరకు వచ్చినవారిలో కొందర్ని డైరక్టుగా చేర్చుకున్నారు. మరి కొంతమందిని బిజెపిలో చేర్పించారు. అంటే వారు పేరుకి బిజెపి, కానీ బాబు మనుష్యులన్నమాట. రేపుమర్నాడు బిజెపి టిడిపికి వ్యతిరేకంగా వ్యవహరించబోతే వీళ్లు అడ్డుకుంటారన్నమాట. బిజెపిలో వుంటే టిడిపి ప్రయోజనాలు కాపాడతారన్నమాట. 1960లలో సిపిఐ ఇలాంటి ప్రయోగమే చేసింది. కాంగ్రెసు పార్టీని అధికారంలోకి రాకుండా ఎలాగూ నిరోధించలేం కాబట్టి మనవాళ్లనే ఆ పార్టీలోకి పంపించి, వారి విధానాలను మన కనుగుణంగా మలచుకోవాలి, వారి చేత మనకు అనుకూలమైన పనులు చేయించుకోవాలి అని సిద్ధాంతపరమైన నిర్ణయం తీసుకుని ఆ విధంగా అనేకమంది పెద్దనాయకులు కాంగ్రెసులో చేర్పించింది. వాళ్లు ఒక జింజర్‌ గ్రూపుగా ఏర్పడి కాంగ్రెసులో విభేదాలను రెచ్చగొట్టారు. మొరార్జీ, అతుల్య ఘోష్‌, ఎస్‌ కె పాటిల్‌ ఇత్యాదులు సిండికేటుగా ఏర్పడి ఇందిరా గాంధీని కట్టడి చేసే రోజుల్లో వీళ్లు ఇందిర చెంత చేరి, సిండికేటును తూర్పారబట్టి ఇందిర చేత బ్యాంకుల జాతీయకరణ, రాజభరణాల రద్దు వంటి సోషలిస్టు కార్యక్రమాలు చేయించారు. వీరి పుణ్యమాని కాంగ్రెసు చీలింది. మద్దతు ఎంతదూరం వెళ్లిందంటే ఇందిర ఎమర్జన్సీ ప్రకటించినా వీరు మద్దతు ఇచ్చారు. తమ పార్టీకి ధారాళంగా నిధులు పొందారు. ఆ సమయంలోనే సిపిఐకు అన్ని రాష్ట్రాలలో చక్కటి భవంతులు ఏర్పడ్డాయి. సిపిఎం ఎమర్జన్సీని ఎదిరించి, తన కార్యకర్తలను జైళ్లకు పంపింది. అందువలన ఎమర్జన్సీ అనంతరం సిపిఎం పెద్ద పార్టీగా ఎదిగింది, సిపిఐ కుంచించుకుపోయింది. బుద్ధి వచ్చిందని లెంపలేసుకుని కాంగ్రెసుకు దూరమయ్యారు. ఇప్పుడు టిడిపి కోవర్టులను బిజెపిలో చేర్చడంలో వ్యూహం ఏమిటో కొన్నేళ్లకు కానీ తెలియదు.

బిజెపికూడా చరిత్ర చదువుకున్నదే కాబట్టి బాబు చెప్పిన కాండిడేట్లకు టిక్కెట్టు ఇవ్వనంది. మా పార్టీ ఎవరికి ఇవ్వాలో చెప్పడానికి మీరెవరు అంటోంది. తమను పూర్తి డమ్మీ చేయడానికి బాబు పూనుకుంటే సహించే స్థితిలో ఆంధ్ర బిజెపి లేదు. తెలంగాణ బిజెపి వున్న కార్యకర్తలు వీళ్లకు లేకపోవచ్చు. కానీ మోడీ ప్రభంజనం జనాల్ని ఊపేస్తోందన్న ఆశాభావం మాత్రం దండిగా వుంది. అది చూసే బాబు తన చుట్టూ తిరుగుతున్నారనీ, లేకపోతే ఛస్తే తమను దగ్గరకు రానివ్వనని ఒట్టు పెట్టుకున్న బాబు ఇప్పుడు ఎందుకు వాటేసుకుంటున్నారని వాళ్ల సందేహం. ఆంధ్రలో బిజెపి నాయకులు లేరు కానీ ఆరెస్సెస్‌ కార్యకర్తలైతే వందల సంఖ్యలోనైనా వుంటారు కదా. వాళ్లు ముందుకు వచ్చి వ్యవహారాలు 

సెటిల్‌ చేయసాగారు. గతంలో టిడిపితో పొత్తు పెట్టుకుని రాష్ట్రంలో పార్టీని నాశనం చేసుకున్నామని, ఇప్పుడు సొంతంగా ఎదగాలంటే బాబుకు తోకలా వుండకుండా స్వతంత్రంగా వ్యవహరించాలని గట్టిగా నిశ్చయించుకుని, బాబు చెప్పిన అభ్యర్థులను కాదంటోంది. అది బాబుకి చిర్రెత్తిస్తోంది. ఆరెస్సెస్‌పై ఆగ్రహాన్ని బహిరంగంగా వెళ్లగక్కారు కూడా. మహాకూటమి రోజుల్లో కెసియార్‌ వ్యవహరించినట్లు ఇప్పుడు బాబు వ్యవహరించడం ఆశ్చర్యంగా వుంది. గుట్టుగా వుండే మనిషి ఇప్పుడిలా బయటపడడమేమిటి? ఇది బిజెపిని బెదిరించి మరిన్ని సీట్లు తీసుకోవడానికా? ఈయనకు ఏం కావాలన్నా బిజెపి నుండి నరుక్కురావడానికి వెంకయ్యనాయు డున్నారు. ‘బాబుగారు కోపంగా వున్నారట. మనకు మోడీ ప్రధాని కావడం అవసరం. ఆ నాలుగు పార్లమెంటు సీట్లు తీసుకుని 14 అసెంబ్లీ సీట్లలో సగం వాళ్ల మొహన విసిరికొడదాం’ అని వెంకయ్యగారు రాజ్‌నాథ్‌కు నచ్చచెప్పవచ్చు. 

తెలంగాణలో పర్యవసానాలు

ఇక్కడ ఎలాగోలా మేనేజ్‌ చేస్తారు, సరే, కానీ దీని పర్యవసానాలు తెలంగాణపై పడవా? అక్కడి బిజెపి నాయకులు అభ్యర్థులను నిలపలేరు కానీ నిలబడిన స్వతంత్ర అభ్యర్థులలో ఎవరో ఒకరికి మద్దతు ఇవ్వవచ్చు కదా. ఎవరూ దొరక్కపోతే తెరాస ఎలాగూ వుంది. కార్యకర్తలు ఒక ఏడాదిగా కలిసి ఉద్యమాలు చేస్తూ వుంటే వాళ్ల మధ్య పొత్తు వర్కవుట్‌ అవుతుంది. ఎన్నికల సమయంలో ఆఖరి రోజు వరకు చర్చలు, వాదోపవాదాలు జరిగితే ఆఖరి నిమిషంలో రెండు, మూడు వారాల గడువులో కార్యకర్తలు ఒకటవగలరా? ఈ కష్టాలకు తోడు ఆంధ్రలో తమ పార్టీకి టిడిపి జెల్లకాయ కొట్టిందని తెలిస్తే కార్యకర్తలు మండిపడరా? ఈ విషయాలు బాబుకి తోచడం లేదా? ఎక్కడో అక్కడ విషయాన్ని తెగ్గొట్టకుండా పొత్తుకి చెడ్డపేరు ఎందుకు తెస్తున్నారు? సమాధానం చెప్పడం కష్టం. తెలంగాణలో మీ మాట వినాల్సి వచ్చింది, కానీ ఆంధ్రలో నేనే కింగ్‌ను అని బిజెపికి గట్టిగా ప్రైవేటు చెప్దామనుకుంటున్నారా?

‘మోడీ-బాబు ఇద్దరిదీ ఒకే బాట, ఆ కాంబినేషన్‌ తిరుగులేనిది, ప్రస్తుతం సీమాంధ్రకు కావలసినది ఇలాంటి జమిలి నాయకత్వమే ’ అని టిడిపి అనుకూల మీడియా ఊదరగొడుతోంది. మొదటగా గ్రహించవలసినది మోడీ గుజరాత్‌ మోడల్‌ వేరు, బాబు ప్రస్తుత మోడల్‌ వేరు. మోడీ స్కీములో సంక్షేమపథకాలు లేవు. అంతా కార్పోరేట్‌కు మేలు చేసే వ్యవహారాలే. గ్రామీణులకు, పేదలకు ఒరిగేది ఏమీ లేదు. ప్రపంచబ్యాంకు మెచ్చుకునే విధానాలు వాళ్లవి. బాబు ఒకప్పుడు ఇలాగే వుండేవారు. కార్పోరేట్‌ సిఈఓగా రాష్ట్రాన్ని పాలించారు. కానీ అది బెడిసికొట్టింది. ఊళ్లో పల్లకీల మోత, ఇంట్లో ఈగల మోత అన్నట్టు అంతర్జాతీయ పత్రికలు ఆకాశానికి ఎత్తేస్తే, స్థానిక ఓటర్లు పాతాళానికి తొక్కేశారు. పదేళ్లగా ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. కాంగ్రెసు ఆశ చూపించిన సంక్షేమ పథకాలే వారికి నచ్చాయి. ఇక బాబు పంథా మార్చి సంక్షేమం అనడం మొదలెట్టారు. ఇప్పుడు ఆయన తనదీ, మోడీది ఒకటే ధోరణి అని ఎలా అనగలరు? విభజన తర్వాత సీమాంధ్రలో ఉద్యోగుల జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి వస్తుందని చెప్పిన ఈ ఆంధ్ర నాయకులందరూ ఇప్పుడు పెద్ద పెద్ద పథకాల గురించి మాట్లాడుతున్నారు, వాటితో బాటు సంక్షేమపథకాలు కూడా అమలు చేస్తారట. అన్ని పార్టీల మానిఫెస్టోలు అతిశయోక్తులతో వుంటే బాబుగారిది మరీ ఎక్కువగా వుంది. ఆయన మోడీ బాటైనా పట్టాలి, లేదా సంక్షేమ పథకాల గురించైనా మాట్లాడాలి. రెండూ చెపితే జనం నమ్మడం కష్టం. 

వైకాపాతో బహుపరాక్‌

ఒక విషయం మాత్రం స్పష్టం. టిడిపి వైకాపాను గట్టి ప్రత్యర్థిగా భావిస్తోంది. బయటకు ఏం చెప్పినా, వైకాపాకు తమతో సమానంగా సీట్లు వచ్చే ప్రమాదం వుందన్న భయం లోపల వుంది. ఏ మాత్రం ఏమరుపాటుగా వున్నా, వైకాపాకు తమ కంటె ఎక్కువ సీట్లు వస్తాయన్న శంకా వుంది. బిజెపికి ఇచ్చిన సీట్లలో బలమైన అభ్యర్థులు లేక, వైకాపా గెలిస్తే తమకు అధికారం చేజారిపోతుందన్న జంకు వుంది. అందువలన ప్రతి సీటూలోనూ తమ అదృష్టాన్ని పరీక్షించుకుందామని చూస్తున్నారు. ఒకప్పుడైతే కాంగ్రెసు, వైకాపా, టిడిపి సమానస్థాయిలో వుండేవి. విభజన తర్వాత కాంగ్రెసు నాయకుల గుండెధైర్యం జారిపోవడంతో ఆ పార్టీని సీమాంధ్రలో దివాళా తీయించడానికి ఆ నాయకులందరినీ తన పార్టీలో చేర్చుకోసాగారు. ఆ స్ట్రాటజీ బాగానే వుంది కానీ ఇది ఏ ఆర్నెల క్రితమో జరిగివుంటే బాగుండేది. సరిగ్గా ఎన్నికల సమయంలో అప్పటిదాకా నియోజకవర్గాన్ని పోషించుకుంటూ వచ్చిన వ్యక్తిని పక్కకు పడేసి కాంగ్రెసువాణ్ని తీసుకుని వచ్చి ‘వీరివీరి గుమ్మడిపండు, వీరి పేరే అభ్యర్థి’ అంటే ఈ టిడిపి కార్యకర్తకు దిమ్మ తిరిగిపోదా? తాము ఆందోళనలు చేసినదీ, ఇతన్ని అవినీతి పరుడని నిందించినదీ ఈ కాంగ్రెసు నాయకుడికి వ్యతిరేకంగానే కదా. ఇప్పుడు అతను ఇంద్రుడు, చంద్రుడని ప్రజలకు చెప్పడం ఎలా? అందువలన తన క్యాడర్‌ అర్ధమనస్కంగా పనిచేసి విజయావకాశాలు దెబ్బ తీస్తారన్న ఇంగితం బాబుకి కూడా వుండే వుంటుంది. ఇప్పుడు ఆయన ప్రకటించిన ఎంపీ అభ్యర్థుల జాబితాలో ఒరిజినల్‌ టిడిపి వారి కంటె ఇతర పార్టీ నాయకులే రెట్టింపు వున్నట్టున్నారు.  ఈ కారణాల చేత తన పార్టీ విజయావకాశాల గురించి మీడియాలో వచ్చేదంతా ఆయన నమ్మటం లేదనుకుంటున్నాను. అందుకే బిజెపి నుండి సాధ్యమైనన్ని ఎక్కువ సీట్లు గుంజుకుందామని చూస్తున్నారు. లేదా తన వాళ్లచేతనే బిజెపి వేషం వేయించి గెలిపించుకుందామని చూస్తున్నారు.

టిడిపికి తెలంగాణలో అధికారం దక్కుతుందని ఎంతటి ఆశావాదీ చెప్పడు. సీమాంధ్రలో ఛాన్సుంది అన్నవరకే చెప్పగలం. ఛాన్సు గట్టిగా లేకపోతే, అధికారం కొద్దిలో మిస్సయిపోతే మూడుసార్లు వరుసగా ఓటమి చవిచూసినట్లు అవుతుంది. ఇక టిడిపి క్యాడర్‌ చెల్లాచెదరు కావచ్చు. వాళ్లు ఎక్కడకు పోవచ్చు? కాంగ్రెసు పార్టీలో కాని, దాని నుండి విడివడి వచ్చిన వైసీపీ, సమైక్యపార్టీలలో చేరడానికి సిద్ధాంతరీత్యా అభ్యంతరాలు వుండవచ్చు. మోడీ ప్రధాని అయి, దక్షిణాదిన పార్టీ వేళ్లూనుకునేలా చేయాలని భావిస్తే ఆ పార్టీలో చేరిన పక్షంలో త్వరగా పెద్ద నాయకుడిగా ఎదిగే అవకాశాలున్నాయి. అందువలన ఈ క్యాడర్‌ బిజెపిలో చేరి, టిడిపికి ప్రత్యర్థిగా మారవచ్చు. అది జరగకుండా చూడాలంటే బిజెపి ఆంధ్రలో బలపడకుండా చేయాలి. దానికి గాను పొత్తు వుంటుందంటూనే వాళ్ల అభ్యర్థులు గెలవకుండా చేయాలి. గెలిచిన కొద్దిమంది అభ్యర్థులూ తనవాళ్లయి వుండాలి. 

టిడిపి తరఫు వాదన

పొత్తు ఇలా చెడగొట్టడానికి టిడిపి ఇస్తున్న సంజాయిషీ ఏమిటంటే – మోడీకి సన్నిహితుడైన అడానీ జగన్‌కు కలిసి మంతనాలు సాగించారట. ఇలా డబుల్‌గేమ్‌ ఆడుతున్న బిజెపి ధోరణి చూసే బాబుగారికి ఆగ్రహం వచ్చిందట. ఈ సమావేశం వార్తను టిడిపి అనుకూల మీడియాయే ప్రచారంలోకి తెచ్చినా నమ్మడానికి ఏమీ శంకించనక్కరలేదు. రాజకీయాల్లో ఒకరితో మరొకరు ఎప్పుడూ కలుస్తూనే వుంటారు. తెలంగాణ సాధించుకోవడానికి కాంగ్రెసు ఢిల్లీ పెద్దలు బిజెపి నాయకుల ఇళ్లకు వెళ్లలేదా? ఎన్నికల వేళ రాజకీయ నాయకులు, వారి తరఫున పారిశ్రామికవేత్తలు ప్రత్యర్థులను కలిసి బేరసారాలు ఆడడం సహజం. టిడిపి బలపడకుండా వైకాపా ప్రయత్నిస్తుందన్నది అందరికీ తెలిసినది సత్యం. ‘టిడిపితో పొత్తెందుకు, ఎన్నికల తర్వాత మీరు అధికారంలోకి వస్తే నేను మీకు మద్దతు ఇస్తాను కదా’ – అని జగన్‌ మోడీకి ప్రతిపాదించడంలో ఆశ్చర్యం ఏముంది? టిడిపి, వైకాపాలలో ఎవరికి ఎక్కువ సీట్లు వస్తాయో తెలియని ఈ ఘడియలో ‘అబ్బే మీ మొహం చూడం’ అని బిజెపి అంటుందా? ద్వారములు తెరిచే వున్నాయి అంటుంది ఏ పార్టీ అయినా. తెరాస, బిజెపి ఈరోజు తెలంగాణలో పోటీ పడుతున్నాయి. ఎన్నికల తర్వాత తెరాస బిజెపికి మద్దతు  అంటే వద్దంటుందా? దానికి గాను టిడిపిని దూరం పెట్టాలి అనే షరతు విధిస్తే ‘ఛ, ఛ, అది మిత్రద్రోహం అవుతుంది’ అని బిజెపి నిరాకరిస్తుందా? ఇవన్నీ బాబుకి మాత్రం తెలియవా? ఆయన మూడో ఫ్రంట్‌ను మోస్తూనే హఠాత్తుగా ఆ కాడి పారేసి, ఎన్‌డిఏ కాడి ఎత్తుకోలేదా? అందువలన టిడిపి-బిజెపి కూటమి విచ్ఛిన్నం చేయడానికి జగన్‌ చేసే సకలయత్నాలలో యీ సమావేశం కూడా ఒకటి కావచ్చు’ అనుకుని దానికి స్పందించనవసరం లేదు. 

కానీ తీవ్రంగా స్పందిస్తున్నారు. సమావేశం ఎప్పుడు జరిగిందో మీడియా చెప్పటం లేదు. అదేదో మొన్న జరిగినట్లు, బాబు వెంటనే రియాక్ట్‌ అయినట్టు బిల్డప్‌ ఇస్తున్నారు. ఎప్పుడో జరిగినా, నిన్ననే తెలిసింది అనుకోవడానికి లేదు. ఎందుకంటే రాజకీయాల్లో విభీషణులకు కొరత లేదు. వార్తలు అక్కణ్నుంచి ఇక్కడకు మోసుకుని వచ్చేవాళ్లు కోకొల్లలు. అయితే ఈ వార్తను సాకుగా చూపించడానికి కారణం ఏమిటంటే – బిజెపి తను చెప్పినట్లుగా ఆడలేదని బాబుకి కోపం వచ్చింది. ‘మీ కంట్లో నన్ను వేలుపెట్టనీయటం లేదు. మీ దగ్గర సరైన అభ్యర్థులు లేరు కాబట్టి, నేను చెప్పిన నా మనిషిని మీ పార్టీలో చేర్చుకుని టిక్కెటు ఇవ్వండి’ అంటే ఈ బ్యాక్‌సీట్‌ డ్రైవింగ్‌కు బిజెపి ఎలా ఒప్పుకుంటుంది? ఒప్పుకోవాలని బాబుగాని, ఆయన సానుభూతిపరులు కానీ ఎలా ఆశిస్తారు? బిజెపికి ఇచ్చిన సీట్లు కృష్ణార్పణం అనుకుంటేనే పొత్తు నిలుపుకోవాలి. లేకపోతే ధైర్యం వుంటే ఒంటరిగా పోటీ చేయాలి. అంతేగాని తన కనుసన్నల్లో వేరే పార్టీ నడవాలని చూడడం అసంబద్ధం.

ఈ తర్కం తప్పు అనవచ్చు. బాబుకి అనవసరంగా దురుద్దేశాలు అంటగడుతున్నా ననవచ్చు. కానీ ఇలా ఆలోచించకుండా వేరే ఏ విధంగా ఆలోచించినా బాబు చేష్టలకు అర్థం కనబడటం లేదు. బిజెపి-టిడిపి పొత్తు వుంటుందా లేదా? ఉంటే/ఉండకపోతే రఘురామరాజు, పురంధరేశ్వరిల పరిస్థితి ఏమిటి? పవన్‌ బిజెపికి మద్దతిస్తాడా? లేక టిడిపి కా? లేక ఇద్దరికీనా? లేక తన స్నేహితులకు మాత్రమేనా? – ఇలాంటి ప్రశ్నలకు ఈ వారాంతంలోనే  సమాధానం లభిస్తుంది. 

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఏప్రిల్‌ 2014)

[email protected]