మోహన మకరందం : నీ పోస్టింగ్‌ దక్క…

అనుభవాలూ – జ్ఞాపకాలూ: డా|| మోహన్‌ కందా  Advertisement నీ పోస్టింగ్‌ దక్క… ఎన్‌టి రామారావుగారు తీసిన ''ఉమ్మడి కుటుంబం'' సినిమాలో 'సతీసావిత్రి' అనే నాటకం వుంటుంది. దానిలో రామారావుగారు యుముడు పాత్రధారి. సావిత్రి…

అనుభవాలూ – జ్ఞాపకాలూ: డా|| మోహన్‌ కందా 

నీ పోస్టింగ్‌ దక్క…

ఎన్‌టి రామారావుగారు తీసిన ''ఉమ్మడి కుటుంబం'' సినిమాలో 'సతీసావిత్రి' అనే నాటకం వుంటుంది. దానిలో రామారావుగారు యుముడు పాత్రధారి. సావిత్రి పతిభక్తికి మెచ్చి వరాలు యిస్తూనే 'నీ పతిప్రాణంబు దక్క…' అని చివర్లో చేరుస్తూ వుంటారు.

ఆయన ముఖ్యమంత్రి అయ్యాక నా విషయంలో అలాటిదే చేశారు – డైలాగు చెప్పలేదు కానీ!

1988లో నేను  కమిషనర్‌ ఆఫ్‌ కోఆపరేషన్‌గా,  రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కోఆపరేటివ్‌ సొసైటీస్‌గా వున్నాను. రామారావుగారు ముఖ్యమంత్రి. ఒకసారి రమ్మన్నారని కబురు వచ్చింది. నేను ఈ ఉద్యోగానికి వచ్చే ముందు నాలుగేళ్ల క్రితం ఆయన ఆఫీసులో పనిచేసి స్పెషల్‌ సెక్రటరీగా చేశాను. గట్టిగా మాట్లాడితే ఆయన ఆఫీసు వ్యవహారాలతో నాకు సంబంధం ఏమీ లేదు. కానీ నన్ను అప్పుడప్పుడు పిలిచి సంప్రదించడం ఆయనకు అలవాటు. ''మోహన్‌, ఒకసారి రా'' అని పిలుస్తారు. నేను వెళుతూండేవాణ్ని. ఆయన ఏ అధికారిని ఎక్కడ నియమించాలి అనే విషయం ఫైనలైజ్‌ చేస్తున్నారు. పై స్థాయి నుండి కింది స్థాయి దాకా 17 మంది జాబితా తయారవుతోంది. 

అవేళ అలాగే పిలిపించి ''నాతో పాటు కూర్చో'' అన్నారు. 

ఆయన కార్యాలయంలో ముఖ్యకార్యదర్శి వున్నారు, ప్రభుత్వంలో ప్రధాన కార్యదర్శి వున్నారు. ఈ విషయం గురించి వాళ్లను యీయన అడిగారో లేదో తెలియదు. అడిగారా అని యీయన్ని అడగలేను కదా! అడిగేవుంటారులే అని సర్దిచెప్పుకుని నన్నేవో సూచనలు అడిగితే, నా హద్దులు మీరకుండా చెప్పా !  

మార్చవలసినవాళ్లలో నా పేరు కూడా వుంది. అది తెలిసినప్పుడు నాకిష్టమైన శాఖ వేయించుకుందాం అనుకున్నాను. జంధ్యాలగారి ''రెండు రెళ్లు ఆరు'' సినిమాలో శ్రీలక్ష్మి పాత్రకు వంట రాదు. ఆసక్తి లేదు. సంగీతంపై ఆసక్తితో పాట రాకపోయినా పాడతానంటుంది. ఈ లక్షణాలు నయం చేయించాలని ఆమె భర్త సుత్తి వీరభద్రరావు హిప్నాటిస్టు పట్టాభిరామ్‌ను పిలుచుకుని వస్తాడు. 

హిప్నాటిస్టు ''నువ్వు పాట మానేయి, అంతే కాదు రోజూ అన్నం వండాలి, పప్పూ, కూరా కూడా..'' అని చెప్తూ వుంటే పక్కనుంచి ''పెరుగుపచ్చడి నాకు చాలా యిష్టం. పనిలో పని ఆ జాబితాలో పెరుగుపచ్చడి కూడా చెప్పవయ్యా'' అని హిప్నాటిస్టును సతాయిస్తాడు. 

అలాగ యిన్ని పోస్టింగులు జరుగుతున్నాయి కదా, నాకు తొలినుంచీ వ్యవసాయ శాఖ అంటే యిష్టం కదాని అగ్రికల్చర్‌ శాఖలో కమిషనర్‌గా పేరు రాయించుకున్నాను.

మర్నాడు ఆ లిస్టు రిలీజైందిట. నాకు తెలియదు. ఎక్సయిజ్‌ డిపార్టుమెంటు నుండి పివిఆర్‌కె ప్రసాద్‌ ఫోన్‌ చేసి ''ఏవయ్యా, ఎప్పుడు చార్జ్‌ తీసుకుంటున్నావ్‌?'' అన్నారు.

''అదేమిటి?'' అన్నాను తెల్లబోతూ. 

''నిన్ను ఎక్సయిజ్‌ కమిషనర్‌గా వేశారుగా. నీకు అప్పగించి నేను వెళదామని…అదేమిటి? 17 పేర్లతో లిస్టు రిలీజైంది. నీకు తెలియదా? ఎవరూ చెప్పలేదా?'' అన్నారు.

ఎవరిని ఎక్కడ వేస్తున్నారో తెలుసు అని చెప్పుకోలేను. ఎందుకంటే అది ఎవరికీ తెలిసే విధంగా చేసిన పని కాదు.

నా గురించి తెలియదు అన్నమాట మాత్రం వాస్తవం. 

అందరి పోస్టింగులూ నాతో చర్చించినాయన 'నీ పోస్టింగ్‌ దక్క…' అన్నట్టు నా దాని గురించి నా యిష్టాయిష్టాలు కనుక్కోకుండా వేసేశారు.

ఇష్టం లేని చోట ఏం రాణిస్తాం?

xxxxxx

సాక్షాత్తూ రామారావుగారే పోస్టు చేసిన తర్వాత ఆయనకేం చెప్పుకుంటాం? చీఫ్‌ సెక్రటరీ జి ఆర్‌ నాయర్‌గారి దగ్గరకి వెళ్లి వాపోయాను. ''ఏమిటి సార్‌, నాకు ఆ డిపార్టుమెంటే యిష్టం లేదు. పైగా దానిలో చాలా మార్పులు చేయబోతున్నారట. రాజకీయశక్తులు చొరబడతాయని అందరూ అనుకుంటున్నారు. ఈ టైములో నన్ను వేశారేమిటి?'' అని.

''ఫర్వాలేదయ్యా, నువ్వు ఏదో సాధించుకుని వస్తావు. చూస్తున్నాగా నీకేదో లక్కు వుంది. నిన్ను ఎక్కడ వేసినా అక్కడ బాగా జరుగుతోంది. ఇక్కడా బాగుంటుంది, బెంగపడకు.'' అని నన్ను మెచ్చుకున్నారో, నా అదృష్టాన్ని మెచ్చుకున్నారో తెలియని రీతిలో ఓదార్చి పంపారు. 

xxxxxx

ప్రభుత్వ కార్యాలయాల్లో వున్న పెద్ద చిక్కు ఏమిటంటే – అందరూ ఏదో ఒకటి పని చేస్తూనే వుంటారు కానీ లక్ష్యాలు చేరం. కమ్మర్షియల్‌ టాక్స్‌ డిపార్టుమెంట్‌ అయినా, ఎక్సయిజ్‌ అయినా.. మరొకటి అయినా యిదే తంతు. ప్రభుత్వాధికారులందరూ సైన్యాధిపతి లేని సైన్యంలాగ అటూయిటూ తిరుగుతూనే వుంటారు, పన్నులు వసూలు చేస్తూనే వుంటారు. కానీ ఏడాది చివరకు వచ్చేసరికి అనుకున్నంత ఆదాయం రాదు. ఎందుకంటే అందరు వ్యాపారస్తుల వద్దకు వెళ్లడానికి తగినంతమంది సిబ్బంది వుండరు. ఉన్న సిబ్బందితో మాగ్జిమమ్‌ ఆదాయం రాబట్టాలంటే ఒకటే ఉపాయం. ఎ,బి,సి.. మెథడ్‌. దీన్ని నేను ఎప్పుడూ నమ్ముకున్నాను. 

1976, 77లో వుండగా అర్బన్‌ ల్యాండ్‌ సీలింగ్‌ చట్టం అమలుకై స్పెషల్‌ ఆఫీసరుగా వున్నపుడు దీన్ని ప్రయోగించి చూశాను. నగరంలో వున్న అన్ని స్థలాల గురించి వచ్చిన డిక్లరేషన్స్‌ను ఒక్కొక్కటీ పట్టి చూడాలంటే సమయం సరిపోదు. అందువలన ఒక లిమిట్‌ పెట్టుకున్నాం.10,000 చ.అ.లు వైశాల్యం కంటె ఎక్కువ వున్న స్థలాలు 'ఎ' క్యాటగిరీ, దాని కంటె తక్కువ 500 చ.అ.ల కంటె ఎక్కువ వున్న స్థలాలు 'బి' క్యాటగిరీ,500 కంటె తక్కువవున్న స్థలాలు 'సి' క్యాటగిరీ. 

'ఈ 'సి' క్యాటగిరీ వాళ్ల సంగతి తర్వాత చూసుకోవచ్చు, వాళ్లు ఎంత డిక్లేర్‌ చేస్తే దాన్ని ఒప్పేసుకుని ముందుకు సాగుదాం. 'బి' క్యాటగిరీ వాళ్లను ఓ మాదిరిగా ర్యాండమ్‌ చెక్‌ చేస్తూ చూదాం. ఇక 'ఎ' క్యాటగిరీని కక్షుణ్ణంగా చూదాం. అవి ఎలాగూ సంఖ్య తక్కువే వుంటాయి. వాటి వ్యవహారం సెటిల్‌ చేయడం వలన తీవ్రమైన ప్రభావం కనబడుతుంది. మనం యీ పనిపై సీరియస్‌గా వున్నామని ప్రజలకు తెలిసివచ్చి యిప్పటిదాకా డిక్లేర్‌ చేయాలా వద్దా అని తటపటాయించేవాళ్లు కూడా ముందుకు వస్తారు.'' అని మా స్టాఫ్‌కు చెప్పాను.

ఈ పని నేను 1973 నుండి 1976 వరకు కమ్మర్షియల్‌ టాక్స్‌ డిప్యూటీ కమిషనర్‌గా వున్నపుడు చేసినదే. అక్కడ కూడా ఈ కేటగరైజేషన్‌కు, దాని అమలుకు టైమ్‌ టేబుల్‌ వేసుకున్నాను. ఏడాది చివరకు పూర్తి కావలసిన ప్రోగ్రాం ఏమిటి? ఆర్నెల్లకు కావలసిన కార్యక్రమం ఏమిటి? నెలకేమిటి? వారం వారం ఎన్ని యిన్‌స్పెక్షన్లు చేస్తే నెల టార్గెట్‌ సాధించగలం? ఏ స్థాయి వాళ్లు, ఎవరు ఎక్కడికి వెళ్లాలి? ఎలా చేస్తే అత్యుత్తమ ఫలితాలు రాబట్టగలం? అని ప్లాను వేసుకుని చేశాం. అనుకున్నట్టే అది అద్భుతమైన ఫలితాల నిచ్చింది. అర్బన్‌ ల్యాండ్‌ వ్యవహారంలో కూడా సత్ఫలితాల నిచ్చింది. అప్పణ్నుంచి నాకు జాబ్‌ చార్ట్‌స్‌ వేయడం, మానిటరింగ్‌ సూపర్‌వైజ్‌ చేయడం ఒక పిచ్చిలా పట్టిందనుకున్నా తప్పు లేదు. 

xxxxxx

ఇప్పుడు యిదే పద్ధతి ఎక్సయిజ్‌లో కూడా చేయడానికి నిశ్చయించుకున్నాను. ఇక్కడ కూడా చిన్నా, పెద్దా వేలాది డీలర్లు వున్నారు. ఫలానా పరిమితి కంటె ఎక్కువ ఆదాయం యిచ్చే డీలర్లు ఎవరు? ఎందరు? వాళ్ల దగ్గర నుంచి మొత్తం వచ్చేది ఎంత? అని చూస్తే సుమారుగా 75% ఆదాయం డీలర్లలో 10% మంది దగ్గర్నుంచి వస్తోందని తేలింది. వాళ్లను 'ఎ' క్యాటగిరీ అనుకున్నాం. చిన్న డీలర్లు వున్న 'సి' క్యాటగిరీలో 70% మంది డీలర్లు వున్నారు. వారి దగ్గర్నుంచి ఆదాయం మొత్తం ఆదాయంలో 10% మాత్రమే. ఈ 70% మందిని ఎంత రాపాడించినా పెద్ద లాభం లేదు. వాళ్లను చూసీచూడనట్లు వదిలేయవచ్చు. 'ఎ' క్యాటగిరీలో వున్న పెద్ద డీలర్లపై గట్టిగా నిఘా వేస్తే తక్కువ శ్రమతో, తక్కువ స్టాఫ్‌తో ఎక్కువ ఆదాయం, ప్రయోజనం చేకూరుతాయి. 'బి' మధ్యతరహా. టైము వుంటే వాటిని పట్టించుకోవచ్చు. 

డిపార్టుమెంటల్‌ వర్క్‌లో కూడా ఎ, బి, సి తరహా మూడు రకాల పనులు వుంటాయి. తక్కువ టైమ్‌, ఖర్చు, శక్తితో ఎక్కువ ఫలితాలు రాబట్టేది – 'ఎ' క్యాటగిరీ.  దాన్ని తప్పకుండా చేయించాలి. సర్వశక్తులూ దానిపై కేంద్రీకరించాలి. ఇక అనవసరమైన పనులు చేసి సమయం, శక్తి వృథా చేసేది 'సి' క్యాటగిరీ. ఫలితం కూడా తక్కువ. దాన్ని మాన్పించాలి. ఆ మాన్పించడమే పెద్ద పనే. 

ఇక మధ్యలో వున్నది 'బి' క్యాటగిరీ. ఇవి చిల్లరమల్లర పనుల్లాటివి. ఎడతెరిపి లేకుండా వస్తూనే వుంటాయి. వీటి వలన ప్రయోజనమూ పెద్దగా వుండదు. వీటిని పట్టించుకుంటే రోజులో 24 గంటలూ దీనికే పోతుంది. మనం వుండే రెండు, మూడు ఏళ్లల్లో యీ తరహాపనులే రోజూ వచ్చి మనను సతాయించి, అటు 'ఎ'ను చేయనీయకుండా, యిటు 'సి'ను ఆపనీయకుండా చేసి చివరకు మనను డిపార్టుమెంటే కాళ్లూచేతులూ కట్టేసి నిర్వీర్యం చేసే స్థితి వస్తుంది. అందుకని నేను వాటిని వదిలేసేవాణ్ని. అలా కాకుండా అన్ని పనులకూ సమాన ప్రాముఖ్యత యివ్వడం అనేది ప్రాక్టికల్‌గా అసంభవం. ఎందుకంటే నిర్వహణకు సంబంధించిన ఎడ్మినిస్ట్రేటివ్‌ పనులు వుంటాయి. చట్టప్రకారం చేయవలసిన స్టాచ్యుటరీ విధులు వుంటాయి. ఇవన్నీ స్టాఫ్‌ చేత చేయించాలంటే వేరేవేరాగ క్యాటగరైజ్‌ చేసి ఒక మూవ్‌మెంట్‌ షెడ్యూల్‌ తయారు చేయించేవాణ్ని. దాని వలన ఎవరు ఏం చేస్తున్నారో గమనించేందుకు, మానిటర్‌ చేసేందుకు వీలుగా వుంటుంది. పెద్దపెద్ద డిపార్ట్‌మెంట్స్‌లో పన్నులు వసూలు చేసే ప్రత్యేకమైన డ్యూటీ వున్నవాళ్ల పట్ల యిలాటి సిస్టమాటిక్‌ విధానం బాగా పనిచేస్తుంది.

ఎక్సయిజ్‌ శాఖలో కల్లు దుకాణాల ద్వారా వచ్చే ఆదాయం తక్కువ. 'సి' క్యాటగిరీ అన్నమాట. చీప్‌ లిక్కర్‌ (ఆరక్‌) ద్వారా వచ్చేది ఎక్కువ. 'ఎ' క్యాటగిరీగా పరిగణించి, ఆ షాపుల మీద దృష్టి ఎక్కువ పెట్టాం. దానివలన అక్కణ్నుంచి వచ్చే ఆదాయానికి గండిపడకుండా చూశాం.  

xxxxxx

ఎక్సయిజ్‌లో పని చేస్తూనే వున్నా ఆయనను కలిసినప్పుడల్లా చెపుతూనే వుండేవాణ్ని. 'ఇది నాకు వద్దండి. ఏదో వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, మరి కాకపోతే వైద్య, ఆరోగ్యశాఖ లేకపోతే విద్యాశాఖ… ఇటువంటి వాటిలో వెయ్యవచ్చుకదా. పోయిపోయి యీ అబ్కారీ ఏమిటి' అని సణుగుతూండే వాణ్ని. ఆయన విని వూరుకునేవాడు. 11నెలల తర్వాత 1989 జనవరిలో వున్నట్టుండి శాఖ మార్పు వచ్చింది. హమ్మయ్య యిప్పటికైనా వ్యవసాయ శాఖ వేశారేమో అనుకుంటే – అబ్బే కమీషనర్‌ ఆఫ్‌ సివిల్‌ సప్లయిస్‌గా వేశారు. ఈసారీ నా ముచ్చట తీరలేదు.

ఆయన దృష్టి పౌరసరఫరాల శాఖమీద వుంది. ఎందుకంటే అది ఎన్నికల సంవత్సరం. బియ్యం సేకరణలో ఆంధ్రప్రదేశ్‌ అప్పటికే టాప్‌లో వుంది. ఆ రికార్డును అధిగమించాలని, రెండు రూపాయల బియ్యం పథకానికి బియ్యం సరఫరా నిరంతరంగా సాగాలని ఆయన పట్టుదల. బియ్యం సేకరణలో మిల్లర్లతో వేగే సమస్య చాలా వుంటుంది. అప్రదిష్ట కలిగే ప్రమాదమూ చాలా వుంది. 

ఇవన్నీ తెలిసే ఆయన నన్ను అక్కడ వేశారు. మళ్లీ అక్కడా ఎ,బి,సి మెథడ్‌ అప్లయ్‌ చేశాను. ఏయే జిల్లాలలో బియ్యం ఎక్కువగా వచ్చే అవకాశం వుంది, ఎక్కడ లేదు అని. తక్కువ ప్రయత్నంతో ఎక్కువ సేకరణ జరిగే జిల్లాలకు మొదటి ప్రాధాన్యత. అది 'ఎ' కేటగిరీ. గింజుకున్నా గింజ ఓ పట్టాన రాలని జిల్లాలు 'సి' క్యాటగిరీ. మన ప్రయత్నాలకు సమాంతరంగా మిల్లర్స్‌ లాబీ ఎలాగూ పనిచేస్తుంది. వాళ్ల కష్టసుఖాలు వాళ్లవి. వచ్చి చెప్పుకునేవారు. వీలైతే చిన్నమార్పులు చేసేవాణ్ని. లేకపోతే కుదరదనేవాణ్ని. ఏం చేసినా రామారావుగారి సపోర్టు ఎప్పుడూ వుండేది. కఠినచర్య తీసుకున్నా అడిగేవారు కారు. వెసులుబాటు కల్పిస్తే దాని వెనకాల ఏముంది అని అనుమానాలు తెచ్చుకునే (దానికి తావు లేకపోలేదు) వారు కాదు. మహానుభావుడు. నా నిజాయితీని, కాని ఉద్దేశాలను కానీ ఎప్పుడూ సందేహించలేదు. ఏదైనా వుంటే వెళ్లి డైరక్టుగా మాట్లాడేసేవాణ్ని. ఇమ్మీడియేట్‌ సుపీరియర్స్‌తో ఏదో మాటవరసకి చెప్పేవాణ్ని. 

ప్రయత్నాలు వూరికే పోలేదు. ఆ ఏడాది బియ్యం సేకరణలో రికార్డు నెలకొల్పాం.

xxxxxx

అన్నట్టు యిష్టం లేకుండా వెళ్లిన ఎక్సయిజ్‌ డిపార్టుమెంటులో ఏం జరిగిందో చెప్పలేదు కదా! ఆ ఏడాది లిక్కర్‌ షాపుల ద్వారా అబ్కారీ ఆదాయం  500 కోట్ల రూ.ల నుండి 650 కోట్లకు పెరిగింది. 

నీతి ఏమిటంటే యిష్టం లేనిదాని శాఖలో పని చేసినా కష్టం వూరికే పోదు. 

మీ సూచనలు [email protected] కి ఈమెయిల్‌ చేయండి.

excerpted from the forthcoming book Mohana Makarandam
print version distributed by Navodaya, e-version by kinige.com

please click here for audio version