ఎమ్బీయస్‌ : సమైక్యపార్టీ అవసరం వుందా?

తక్కిన పార్టీల గురించి రాసేటప్పుడు వాళ్లకు ఛాన్సుందా లేదా అని ఆలోచిస్తాం. కానీ కిరణ్‌ పెట్టిన సమైక్యాంధ్ర పార్టీ విషయానికి వస్తే అసలది వుండవలసిన అవసరం వుందా అన్న సందేహం వస్తుంది. ఎందుకంటే తక్కిన…

తక్కిన పార్టీల గురించి రాసేటప్పుడు వాళ్లకు ఛాన్సుందా లేదా అని ఆలోచిస్తాం. కానీ కిరణ్‌ పెట్టిన సమైక్యాంధ్ర పార్టీ విషయానికి వస్తే అసలది వుండవలసిన అవసరం వుందా అన్న సందేహం వస్తుంది. ఎందుకంటే తక్కిన పార్టీలన్నీ చేస్తున్న హంగామాలో నూరో వంతు కూడా అది చేయడం లేదు. 
ఎటు చూసినా సమరోత్సాహం

కాంగ్రెసు పార్టీ తెలంగాణలో ఒంటరిగా పోటీ చేసినా మాదే గెలుపు, పోనీ కదాని సిపిఐకి కొన్ని సీట్లు యిచ్చాం అంటోంది. సీమాంధ్రలో పార్టీ సవాళ్లు ఎదుర్కుంటోంది కానీ మేం నిలబెడతాం అంటున్నారు ఆ నాయకులు. టిడిపి చూడబోతే సీమాంధ్రలో అప్పుడే అధికారంలోకి వచ్చేసినట్లు బిల్డప్‌ యిస్తోంది. తెలంగాణలో కూడా మా బలం ఏమీ తగ్గలేదు అంటూ బిజెపితో గీచిగీచి బేరాలాడుతోంది. 'మీకు సీటు యిస్తే ప్రత్యర్థులకు ధారపోస్తారు, అదే మేమైతే కచ్చితంగా గెలుస్తాం' అంటున్నారు. సీమాంధ్రలో గెలుపు తథ్యం, తెలంగాణలో కొన్ని జిల్లాలలో కూడా.. అంటోంది వైకాపా. తెరాస 'ఒంటరిగా పోటీ చేసినా మాదే జయం. సమైక్యరాష్ట్రంలో యిన్నాళ్లూ దోచుకుతిన్నది కాంగ్రెసు వారే (యిప్పటిదాకా సీమాంధ్రులు దోచుకున్నారన్నారు, ఇప్పుడు కాంగ్రెసు వారంటున్నారు) వాళ్లకు మళ్లీ ఛాన్సు యిస్తామా?' అంటున్నారు. బిజెపి వారు తెలంగాణలో ఒంటరిగా పోటీ చేసినా సగానికి పైగా సీట్లు వస్తాయనుకుంటున్నారు. తెరాసతో కలిస్తే తక్కిన సగం కూడా వచ్చేసి ప్రభుత్వం మనదే అంటున్నారు. 

అత్యాశ్చర్యకరంగా సీమాంధ్ర బిజెపిలో కూడా ఉత్సాహం పెల్లుబుకుతోంది. 5 పార్లమెంటు సీట్లు కావాలట. సిపిఐ నారాయణ భుజంపై కండువా వేసుకుని  కాంగ్రెసు, తెరాసల మధ్య మధ్యవర్తిత్వానికి బయలుదేరారు. దేశమంతా కాంగ్రెసును సిపిఐ చీల్చి చెండాడుతోంది. ఖమ్మం వరకు వచ్చేసరికి నారాయణగారు కాంగ్రెసు మద్దతుతో ఎంపీ సీటు గెలవాలని చూస్తున్నారు. మరీ యింత ద్వంద్వ విధానమా? సిపిఎం కూడా యిలాటి ప్రయత్నాలు చేస్తోంది. పవన్‌ జనసేన, లోకసత్తా యివన్నీ బిజెపి-టిడిపి కూటమికి ఉపగ్రహాల్లా తేలుతున్నాయి. ఇంతమంది సమరోత్సాహంతో రంకెలు వేస్తున్నారు, టిక్కెట్టు దొరకదన్న భయం వున్నా, నమ్ముకున్న పార్టీ గెలిపించదన్న అనుమానం తగిలినా వెంటనే పార్టీ ఫిరాయిస్తున్నారు. పార్టీలు కూడా ఎలాటి సంకోచాలు పెట్టుకోకుండా వారిని ఆహ్వానిస్తున్నాయి. వారిపై నిన్నటిదాకా చేసిన అవినీతి ఆరోపణలను తూనాబొడ్డు అనుకుంటున్నాయి. ఎవరు ఏ పార్టీలో వున్నారో చటుక్కున చెప్పడం కష్టంగా వుంది. 

మూకబలం, రూకబలం ఏదీ లేదు

ఇలాటి వాతావరణంలో స్తబ్దంగా, నిశ్శబ్దంగా వున్న పార్టీ సమైక్యపార్టీ. గర్జనలు, శంఖారావాలు పేర అదరగొట్టడం లేదు. వారి పార్టీలోకి దూకేవారు ఎవరూ లేరు. కాంగ్రెసు నుండి విడిపోయి వచ్చిన తర్వాత కిరణ్‌ వెంట నిలిచినవారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. మొత్తం అందర్నీ కలిపి రెండు చేతుల వేళ్లమీద లెక్కించవచ్చు. మరి కొంతకాలంలో అది ఒక చేతిమీద వేళ్లకే సరిపోయే సంఖ్యకు చేరినా ఆశ్చర్యం లేదు. గద్దె నుండి దిగిపోయి పార్టీ పెట్టమని కిరణ్‌ను ప్రోత్సహించినవారే ఆయనను ఒంటరిగా వదిలేసి వెళ్లిపోయారు. ఎందుకంటే కిరణ్‌ మొదటినుండి ఒంటరిగానే వుండేవారు. ఎవర్నీ నమ్మి చేరదీయలేదు. ఎవరితోను సంప్రదించలేదు. అందువలన యిప్పుడు ఎవరూ అతని వెంట రానంటున్నారు. ఉన్నవాళ్లు కూడా తమ నియోజకవర్గ ప్రజలు సమైక్యభావనకు అంకితమై వున్నారన్న ఉద్దేశంతో వున్నారు కానీ కిరణ్‌ మళ్లీ ముఖ్యమంత్రో, కేంద్రంలో మంత్రో అయ్యి తమ ప్రయోజనాలను కాపాడతాడన్న ఆశతో కాదు. పార్టీకి మూకబలమే కాదు, రూకబలం వున్నట్టూ లేదు. బడా వ్యాపారవేత్తలు ఎవరూ చేరలేదు. మీడియా బలం ముందే లేదు. వాళ్ల అభ్యర్థులెవరో, ఆశావహులెవరో ఏమీ రాయటం లేదు. ఎన్నికలలో నిలబడతాడో లేదో తెలియని పవన్‌కు యిచ్చిన కవరేజిలో పదోవంతు కూడా వీళ్లకు యివ్వలేదు. అసలు సోదెలోకి లేనట్టే చూస్తున్నారు. ఇలాటి పార్టీకి మనుగడ అవసరమా?

కోర్టులను నమ్ముకునే అమాయకులు

అసలు సమైక్యపార్టీ ఆశయమే అందరికీ హాస్యాస్పదంగా తోస్తోంది. విభజన అయిపోయింది, చెంబూ తప్పాలా పంపకాలు జరిగిపోతున్నాయి. ఉద్యోగులు ప్రమోషన్లు వచ్చాక ఎవరెక్కడ కూర్చోవాలో చూసుకుని రుమాళ్లు వేసేసుకుంటున్నారు. ఇంకా సమైక్యంగా వుంచుతాం అంటూ వీళ్లు అంటూ వుంటే 'ఢిల్లీ సుల్తాన్ను పట్టుకుపోతాం' అని పిచ్చివాడు రోడ్లపై తిరిగినట్లుంది. కోర్టులు ఆపేస్తాయి అంటున్నారు వీళ్లు. కోర్టులు చూస్తే ముంగిలా కూర్చున్నాయి. సరైన సమయం రాలేదు, టూ ఎర్లీ అంటూ యిన్నాళ్లూ తాత్సారం చేసి యిప్పుడు రాజ్యాంగ ధర్మాసనానికి రిఫర్‌ చేస్తాం అన్నారట. ఇప్పటిదాకా చేయలేదట. దానికీ సమయం రాలేదా? పైగా విభజన గురించి కెసియార్‌కు నోటీసులు యిచ్చారట. అంటే తెలంగాణ ఆవిర్భావానికి కారకుడు కెసియారే తప్ప సోనియా కాదని కోర్టు కూడా నమ్ముతోందా? అలా యిలా చేసి వేసవికాలపు సెలవుల దాకా గడిపేస్తే సమ్మర్‌ వెకేషన్‌ తర్వాత తిరిగి వచ్చేసరికి రెండు ప్రభుత్వాలూ పని చేస్తూ వుంటాయి. ఇప్పుడు సమయం మించిపోయింది, టూ లేట్‌ అంటారు. ఇలాటి కోర్టులు విభజన ఆపుతాయని ఎలా అనుకుంటారు? ఉండవల్లి నల్లకోటు అనవసరంగా యిస్త్రీ చేయించుకున్నారు. 

మన రాష్ట్రపు విభజన విషయంలో ఎటు చూసినా నకారులే (మృచ్ఛకటికంలో శకారుల్లా) కనబడుతున్నారు. చిదంబరం, జైరాం రమేశ్‌ (కర్ణాటకకు చెందిన తమిళుడు), నారాయణస్వామి (పాండిచ్చేరికి చెందిన తమిళుడు – పాండిచ్చేరికి ప్రత్యేక రాష్ట్రప్రతిపత్తి కావాలని అక్కడివాళ్లు అడిగితే ప్రత్యేక రాష్ట్రం వేస్టు, ప్యాకేజీ అడుగుదాం అన్నాడక్కడ. తెలంగాణ విషయంలో మాత్రం ప్రత్యేక రాష్ట్రం యివ్వాలన్నాడు). గవర్నరుగారు, ఉద్యోగుల పంపకాల కమిటీ చైర్మన్‌ కమలనాథన్‌గారు, సీమాంధ్ర రాజధాని ఎక్కడ పెట్టాలో చెప్పడానికి వేసిన కమిటీ చైర్మన్‌ శివరామకృష్ణన్‌ గారు – అందరూ నకారులే. చివరకు సుప్రీం కోర్టు చీఫ్‌ జస్టిస్‌ కూడా! 

బెర్లిన్‌ గోడ యిటుక ఏం చెపుతోంది?

ఇంతమంది మేధావులు, ముఖ్య రాజకీయపక్షాలైన కాంగ్రెసు, బిజెపిల మద్దతుతో, టిడిపి పక్కవాయిద్యపు సహకారంతో (బాబుగారు మొహమాటం విడిచి జై తెలంగాణ అనేశారు, మా లేఖ వలనే విభజన జరిగిందని వరంగల్‌లో గొప్పలు చెప్పుకున్నారు) రాష్ట్రాన్ని పరపరా రంపంతో కోసేస్తూ వుంటే కిరణ్‌ పార్టీ బెర్లిన్‌ గోడ యిటుకలు చూపించి ఓదార్చబోతే ప్రజలు నమ్ముతారా? నమ్మరు. కానీ ఆ యిటుకల్లోనే ఒక సందేశం వుంది – ఆశ అనేది వదులుకోవద్దని! రెండవ ప్రపంచయుద్ధంలో జర్మనీ ఓడిపోతుందని, దాన్ని యితర దేశాలు రెండుగా చీలుస్తాయనీ ఎవరూ అనుకోలేదు. అలాగే కాంగ్రెసుకు పెట్టనికోటగా నిలబడిన ఆంధ్రప్రదేశ్‌ను అదే కాంగ్రెసు పార్టీ పొరుగు రాష్ట్రనాయకుల, అధికారుల సాయంతో రెండుగా చీలుస్తుందని ఎవరూ అనుకోలేదు. విభజన వలన కాంగ్రెసు ఏం బావుకుందో చెప్పమని సోనియా నడిగినా చెప్పలేరు. సీమాంధ్రలో ఖాళీ అయిపోతోంది. 25 ఎంపీ సీట్లలో 5 గెలుస్తామని కూడా గట్టిగా చెప్పలేని పరిస్థితి. ఇక తెలంగాణలో తెరాసతో పొత్తుకోసం వెంపర్లాడుతున్నా కుదరటం లేదు. కుదరని పక్షంలో 17 సీట్లలో మహా అయితే 6 సీట్లు గెలవవచ్చు. అంటే 33కి బదులు అందులో మూడోవంతు 11 స్థానాలు గెలుస్తుందన్నమాట. ఈ భాగ్యానికి ఎవరైనా రాష్ట్రాన్ని చీలుస్తుందని అనుకుంటారా? కానీ చీల్చింది. రాష్ట్రం రెండు ముక్కలైంది. అదీ అస్తవ్యస్తంగా, ఏ రాష్ట్రమూ సొంతంగా కాళ్లపై నిలబడే పరిస్థితి లేకుండా! 

ప్రజలను ఏ మాత్రం సంప్రదించకుండా, ఏ రిఫరెండం జరపకుండా కొందరు నాయకుల అభీష్టం మేరకు జర్మనీని చీల్చినట్లే, ఆంధ్రప్రదేశ్‌ను చీల్చారు. ఆ ముక్కలు రెండూ మళ్లీ కలుస్తాయని ఎవరూ ఊహించలేదు.  బెర్లిన్‌ గోడ దాటడానికి ప్రయత్నించి చనిపోయినవారు ఎంతోమంది వున్నారు. జర్మనీ మళ్లీ ఒకటి కాకుండా అంత దారుణంగా కాపలా కాశారు. అయితే రష్యా సామ్రాజ్యం కూలిపోయింది. ఇతరదేశాలపై పట్టు సడలించింది. అంతే జర్మనీ గోడ కూలింది. ఇరుప్రాంతాల జర్మన్లు కలిసి దాన్ని కూల్చేశారు. జర్మనీ యిప్పుడు మళ్లీ అగ్రరాజ్యంగా ఎదుగుతోంది. మళ్లీ కలవడానికి దాదాపు అర్ధశతాబ్దం పట్టింది. విడిపోవడం చూసిన ప్రజల్లో చాలామంది మళ్లీ కలవడం చూసి వుండకపోవచ్చు. కానీ వారి ఆశలు ఫలించాయి. సంకల్పం అంటూ వుంటే, ఏనాటికైనా సిద్ధించవచ్చని బెర్లిన్‌ గోడ సంఘటన చెపుతుంది.

అన్‌హోనీకో హోనీ కర్‌ దే…

ఏ ఆర్టికల్‌ 3ను అడ్డం పెట్టుకుని, విపరీత వ్యాఖ్యానాలు చేసి రాష్ట్రాన్ని చీల్చారో, అదే ఆర్టికల్‌ 3ను సవరించి కలపవచ్చు కూడా. సిక్కిం ఒకప్పుడు విడి దేశం. భారత్‌లో కలుస్తుందని ఎవరైనా అనుకున్నామా? కలిపారు. గోవా, పాండిచ్చేరి, యానాం భారత్‌లో అంతర్భాగాలు కావు. 1947లో స్వాతంత్య్రం  వచ్చాక కూడా అవి పోర్చుగీస్‌, ఫ్రెంచ్‌ పాలనలో వుండేవి. గోవాలో చాలామంది మహారాష్ట్రులున్నారు కాబట్టి దాని విముక్తికై మహారాష్ట్రలో ఆందోళనలు జరిగాయి. చివరకు ఫలించి గోవా భారత్‌లో కలిసింది. దానితో బాటే తక్కినవీ. దేశ విభజన సమయంలో కశ్మీర్‌లో కొంతభాగాన్ని పాకిస్తాన్‌ ఆక్రమించుకుంది. దాన్ని వెనక్కి తెచ్చుకోవాలని భారత్‌ దౌత్యపరంగా ప్రయత్నాలు చేస్తోంది. పాక్‌ అడ్డుకుంటోంది. రేపు ఎప్పుడైనా పాక్‌ బలహీనపడినప్పుడో, భారత్‌ అనుకూల ప్రభుత్వం ఏర్పడినపుడో అది మళ్లీ భారత్‌లో కలవవచ్చు. తూర్పు పాకిస్తాన్‌, పశ్చిమ పాకిస్తాన్‌ విడిపోతాయని ఎవరైనా వూహించారా? 1971లో విడిపోయాక మళ్లీ వాళ్ల మధ్య అనుబంధం ఏర్పడి కలిసి భారత్‌ను వ్యతిరేకిస్తాయని కలగన్నారా? రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల విషయం తీసుకుంటే కన్యాకుమారి జిల్లా కొంతకాలం తమిళనాడులో వుంది, కొంతకాలం కేరళలో వుంది, మళ్లీ తమిళనాడుకి వచ్చింది. పాలఘాటు కూడా తమిళప్రాంతంగానే వుంటూ వచ్చి కేరళకు వెళ్లింది. తమిళనాడు-కేరళల మధ్య కొన్ని ప్రాంతాలు ఏ రాష్ట్రంలో కలవాలన్నదానిపై వివాదాలు వున్నాయి. సంయుక్త మహారాష్ట్ర ఉద్యమం కూడా సమైక్యాంధ్ర ఉద్యమం లాటిదే. నైజాంలోని మరాట్వాడా, సెంట్రల్‌ ప్రావిన్స్‌లోని విదర్భ, బొంబాయి రాష్ట్రంలోని మరాఠీ ప్రాంతాలు కలుపుతూ మహారాష్ట్ర ఏర్పడాలని ఉద్యమించారు. సాధించారు. ఇంకా సాధించాల్సినవి వున్నాయి. కర్ణాటకలోని బెళగాం కూడా మరాఠీలు ఎక్కువగా వుండే ప్రాంతం. అక్కడ మహారాష్ట్ర ఏకీకరణ సమితి అనే ఒక పార్టీ వుండి, బెళగాంను మహారాష్ట్రలో కలపాలి అనే డిమాండుతో ఎన్నికల్లో అన్ని స్థానాలు గెలుస్తూ వుండేది. ఇప్పటిదాకా ఆ కల సాకారం కాలేదు.

విభజన నేర్పే గుణపాఠాలు

విడిపోవడం సులభం కానీ మళ్లీ కలవడం కష్టం అని వాదించవచ్చు. నిజమే. కానీ అసాధ్యం కాదు. ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలు విడిగా మనుగడ సాగించడం ఎంత కష్టమో పోనుపోను బాగా అర్థమౌతుంది. ఇరుప్రాంత నాయకులు వైషమ్యాలు రెచ్చగొట్టి, సమస్యలు పెంచితే మరింత జటిలమవుతాయి. పైగా ఢిల్లీ యిద్దరిపై పెత్తనం సాగించబోతోంది. ఉద్యోగుల పంపకాల విషయంలోనే చూడండి – ఎన్ని రకాల వాదనలు వింటున్నామో. పంచేందుకు ఒక స్థిరమైన కొలబద్ద లేకుండా వ్యవహారం చేస్తున్నారు. ఆప్షన్లు వుంటాయో లేదో చెప్పటం లేదు. చట్టానికి వ్యతిరేకంగా చేస్తే కోర్టుల్లో నిలుస్తాయో లేదో తెలియదు. ఉద్యోగులంత లిటిగెంట్లు ఎవరూ వుండరు. ఏ చిన్న పొరబాటు జరిగినా కోర్టుకి వెళ్లి స్టే తెచ్చుకుంటారు. ఆఫీసుల్లో ప్రమోషన్లు తేలక, బదిలీలు తేలక పని కుంటుపడుతుంది. అలాగే రాజధాని విషయం తేల్చడానికి ఓ కమిటీ. దానికి ఆరునెలల గడువెందుకు? లాబీయింగుకి అవకాశానికి యివ్వడానికా? వివిధ ప్రాంతాల ప్రజల్లో వైషమ్యాలు రెచ్చగొట్టడానికా? అయినా అక్కడ ఏర్పడే ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయాన్ని కేంద్ర కమిటీ ఎలా తీసుకుంటుంది? భద్రాచలం డివిజన్‌ సంగతి విషయం తీసుకోండి. ఇప్పటిదాకా ఏమైనా తేల్చారా? బిల్లులో ఒకటి రాశారు, తర్వాత సవరణ అన్నారు, ఆర్డినెన్సు అన్నారు, ఏదీ చేయలేదు, మహామేధావి జైరాం గారు ఎత్తు తగ్గించడానికి ప్లాను వేస్తున్నారు, రెండు నెలలు పోతే యీయన ఏ మూల వుంటాడో తెలియదు. ఇప్పుడు మాత్రం ఎగిరెగిరి పడుతున్నాడు. కెసియార్‌ కార్యవీర్యార్జునుడిలా వెయ్యి బాహువులతో నదీప్రవాహాన్ని ఆపేస్తానంటున్నాడు. చూడబోతే నదీజలాల విషయంలో  నాయకులు కొట్టుకుచచ్చి వ్యవసాయం నాశనం చేసి, ప్రజలకు విసుగు తెప్పించేట్లున్నారు. 

పునరాలోచన రాదని చెప్పలేం

ఇలా కొంతకాలం (ఎంతకాలమో యిప్పుడే చెప్పలేం) గడిచేసరికి 'ఎందుకొచ్చిన గొడవ యిది? కలిసిపోతే పోలేదా' అనుకోవచ్చు. కలిసిపోతే తమ పదవులు పోతాయన్న భయంతో కొందరు తప్పకుండా అడ్డుపడతారు. ఆ పరిస్థితిలో కనీసం కలిసిమెలసి ప్రణాళికలు రచిద్దాం, సహకరించుకుందాం అనుకోవచ్చు. ఇరు రాష్ట్రాల మధ్య నిబంధనలు ఎత్తేసి మినహాయింపులు యిచ్చుకుని వ్యాపారాన్ని, సరుకుల రవాణాను ప్రోత్సహించవచ్చు. కలిసి ప్రాజెక్టులు నిర్మించుకోవచ్చు. శత్రుదేశాలైన భారత్‌, తూర్పు పాకిస్తాన్‌లు కలిసి ఫరకా బరాజ్‌ కట్టగా లేనిది యిరు రాష్ట్రాల్లో వున్న తెలుగువారు ఉమ్మడి ప్రయోజనాలకై కలిసి ప్రాజెక్టులు కట్టుకోలేరా? ఈ రెండు రాష్ట్రాలలో ఏ రాష్ట్రవాసి ఐనా సరే, స్థానికుడిగానే లెక్కిస్తాం అని తీర్మానించవచ్చు కూడా. ఇవన్నీ జరగాలంటే సమైక్య భావన సజీవంగా వుండాలి. కొందరైనా ఆ భావజాలం వ్యాప్తి చేయడానికి కంకణం కట్టుకుని వుండాలి. 

ఈ విలీనం లేదా సహకారం ఏ పదేళ్లకో, యిరవై ఏళ్లకో జరుగుతుందనుకుంటే అప్పటిదాకా యీ పార్టీ నోట్లో వేలు వేసుకుని కూర్చోవాలా అన్న ప్రశ్న వస్తుంది. అలా అనుకుంటే బెళగాం మహారాష్ట్ర ఏకీకరణ సమితి అన్నేళ్లు మనగలిగి వుండేది కాదు. సమైక్యపార్టీ సీమాంధ్ర, తెలంగాణ రెండు ప్రాంతాల్లో ప్రతి నియోజకవర్గంలో ఏదో ఒక స్థాయిలో వ్యాపించి వుంటే విభజన వలన జరిగే నష్టాలు ప్రజలకు గమనంలోకి వచ్చిన ప్రతీసారీ వీళ్లు తమ ప్రచారం చేస్తూ వుండవచ్చు. స్థానిక నాయకులలో విభేదాలు వచ్చినపుడు వీరు తమ ప్రయోజనాలకు అనుగుణంగా పరిస్థితిని మలచుకుంటూ, సందర్భాన్ని బట్టి ఎవరో ఒకరికి మద్దతు యిస్తూ క్రమేపీ బలపడవచ్చు. ఇది దీర్ఘకాలంలో జరగవలసిన పని. అప్పటిదాకా నిలదొక్కుకునే ఓపిక వుండాలి. ఈ ఎన్నికలలో పెద్దగా సీట్లు రాలేదు కదాని, పార్టీ మూసిపడేస్తే పని జరగదు. సీట్ల సంఖ్య బట్టి చూస్తే కమ్యూనిస్టు పార్టీలు ఎప్పుడో కార్యకలాపాలు కట్టిపెట్టాలి. కానీ కొంత శాతం ఓట్లు వాళ్లకు తప్పకుండా పడతాయి కాబట్టి కొన్ని నియోజకవర్గాలలో అయినా వారి ప్రభావం వుంటుంది కాబట్టి, వారి అస్తిత్వానికి విలువ వుంది. సమైక్యపార్టీకి తప్పకుండా వారి కంటె ఎక్కువ విలువే వుంటుందని నా నమ్మిక. 

ఈ ఎన్నికల వరకు చూసుకుంటే ఎటు చూసినా కప్పదాట్లే కనబడుతున్నాయి. ఎవరు ఏ పార్టీలో ఎందుకు చేరుతున్నారో తెలియకుండా వుంది. అలా చేరడానికి అవకాశవాదం తప్ప ఒక సిద్ధాంతనేపథ్యం కనబడటం లేదు. జీవితాంతం తిట్టిపోసిన పార్టీలోకే కేవలం టిక్కెట్టు యిస్తారన్న కారణంగా చేరుతున్నారు. వీరిని చూసి సాధారణ ఓటరు అసహ్యించుకుంటాడు. విద్యాధికులు, యువత, మేధావివర్గాలు అయితే మరీను. వారిని ఆకట్టుకుంటే సమైక్యపార్టీ కొన్ని సీట్లు తప్పకుండా గెలుచుకోగలదు. ఆ వర్గాల వారికి టిక్కెట్లు యిచ్చినపుడే అది సాధ్యం. ఇవ్వడానికి వీరికి యిబ్బందీ లేదు. ఎందుకంటే  వీరి పార్టీలో చేరడానికి రాజకీయనాయకులు, వ్యాపారవేత్తలు ఎగబడటం లేదు. అందువలన విద్యార్థులు, ఉద్యోగులు, మేధావులు, యువత – యీ వర్గాల వారికి టిక్కెట్లు యిస్తే తప్పకుండా ఓట్లు పడవచ్చు. ఆ శాతం ఎంత అని అడిగితే యిప్పుడే చెప్పలేం కానీ అది రెండంకెల సంఖ్య (అంటే 10 నుంచి ప్రారంభమవుతుంది) కావడానికి అవకాశమైతే వుంది.

 – ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఏప్రిల్‌ 2014)

[email protected]