అనుభవాలూ – జ్ఞాపకాలూ : డా|| మోహన్ కందా
నేను 'క్లవరా'?
ఓ సారి చెన్నారెడ్డిగారి క్యాబినెట్ మీటింగు జరుగుతోంది. వాళ్లు చర్చిస్తున్న ప్రతిపాదనపై నా అభ్యంతరాలు నాకున్నాయి. అందుకని ఏమీ మాట్లాడకుండా కూర్చున్నాను. చెన్నారెడ్డిగారు తను అనుకున్న విధంగా జరగాలన్న పట్టుదలతో వున్నారు. అది నా కిష్టం లేదనీ ఆయనకు తెలుసు. అందుకని నన్ను కవ్విద్దామని ''మోహన్, వై డోంట్ యూ టెల్ అజ్ వాట్ ద పొజిషన్ యీజ్'' (మోహన్, అసలు సంగతేమిటో నువ్వు చెప్పవచ్చుగా) అన్నారు.
నాకు తెలుసు దీంట్లో తలదూర్చకుండా వుంటేనే మంచిదని. అందుకని సమయోచితంగా ''సర్, ఐ యామ్ ఓన్లీ ఇంటెలిజెంట్, బట్ నాట్ క్లవర్'' అన్నాను. 'నాకు కావలసినంత తెలివే తప్ప, చాతుర్యం లేదు. మీరు చెప్పే విషయాల జోలికి నేను రానక్కరలేదు' అన్న అర్థం స్ఫురించేట్లు.
చమత్కారం నచ్చినట్టుంది. ఫక్కున నవ్వాడు. ఆయన సరసుడు. ఛలోక్తులు వేయగల సమర్థుడు. అందువలన వెంటనే ''ఐ థాట్ యూ ఆర్ బోత్'' అన్నారు. (నీకు రెండూ ఉన్నాయనుకున్నానే!) అని.
మాట్లాడే తీరు ఒక్కొక్కరిది ఒక్కోలా వుంటుంది. ఏది సరైనది, ఏది కాదు అని ఎవరూ చెప్పలేం. ఒకే మనిషి సమయాన్నిబట్టి, సందర్భాన్నిబట్టి, ఎదుటి వ్యక్తినిబట్టి వేరు వేరు తీరులుగా మాట్లాడినా స్వతహాగా జన్మతః వచ్చే లక్షణాలు కొన్నివుంటాయి. అందరూ యిలాగే మాట్లాడాలి, మాట్లాడి తీరాలి అని అనుకోలేం, అనలేం, శాసించలేం. ఆ పరిస్థితిలో నేను ఒకలా మాట్లాడి తప్పుకున్నాను. వై. వేణుగోపాలరెడ్డి (ఆర్‌బిఐ గవర్నరు చేసినాయన) గారయితే యింకోలా డీల్ చేసేవారేమో!
xxxxxx
ఎమ్. నరసింహంగారు మా నాన్నగారి కొలీగ్ జస్టిస్ శేషాచలపతిగారి అబ్బాయి. మాకు కుటుంబ స్నేహితులు. చాలా సౌమ్యులు. భారతదేశం తరఫున వరల్డ్ బ్యాంక్‌లో ఎగ్జిక్యూటివ్ డైరక్టరుగా చేశారు. ఆయనకు టెక్నికల్ అసిస్టెంటుగా ఒక ఐయేయస్ ఆఫీసరు వుండేవారు. వేణుగోపాలరెడ్డిగారు ఆ పోస్టులో కొంతకాలం చేశారు. వాషింగ్టన్‌లో వుండగా ఓ రోజు నరసింహం గారు ఆయనకు ఒక నోట్ యిచ్చి యిది చూసి ఎలా వుందో నీ అభిప్రాయం ఏమిటో నిష్కర్షగా చెప్పు అన్నారు. ఈయన అది చదివి – నచ్చనట్టుగా వుంది – తన అభిప్రాయం ఘాటుగా రాసి యిచ్చేశారు.
అది చూసి నరసింహం గారు ''ఐ వాంటెడ్ యు టు బి ఫ్రాంక్ బట్ నాట్ బ్లంట్'' (నిక్కచ్చిగా చెప్పమన్నాను కానీ కొట్టవచ్చినట్టు చెప్పమనలేదు) అని. ఎవరింటికైనా వెళ్లి ''మీ నాన్నగారున్నారా?'' అని అడగవచ్చు, లేదా ''మీ అమ్మ మొగుడున్నారా?'' అని అడగవచ్చు. సాంకేతికంగా చూస్తే రెండూ ఒకటే. కానీ ధ్వని ప్రధానం. అవతలివాళ్లను నొచ్చుకునేట్టు చేయడం అంత అభిలషణీయం కాదు.
మా నాన్నగారికి నచ్చిన ఓ కొటేషన్ – ''ఎ జెంటిల్‌మన్ యీజ్ వన్ హూ యీజ్ నెవర్ అన్‌ఇన్‌టెన్షనల్లీ రూడ్'' (పెద్దమనిషనేవాడు యితరుల పట్ల ఉద్దేశం లేకుండా దురుసుగా ప్రవర్తించడు) అని. ఇక్కడ గుర్తుకోపెట్టవలసిన పదం – ఉద్దేశం లేకుండా ! పెద్దమనిషి అంటే అందరికీ వంగి దణ్ణాలు పెట్టాలనీ, వాళ్లన్నవి పడాలనీ, ఎప్పటికీ శాంతమూర్తిలాగే వుండాలనీ లేదు. అవసరమైతే గట్టిగా, డైరక్టుగా చెప్పాలి కూడా!
ఓ సారి ఓ ఎమ్మెల్యేకి, వేణుగోపాలరెడ్డిగారికి దేనిమీదో వాదన జరుగుతోంది. ఆ ఎమ్మెల్యే ఏదో చెయ్యాలని చెపుతున్నాడు. ఈయనకు యిష్టం లేదు. కాదని చెప్పినా ఆయన వినటం లేదు. తను చెప్పినది విని తీరాలంటున్నాడు. ఈయనకు చివరకు ఒళ్లు మండి – ''నాకు తెలుసండీ మీరు ఎమ్మెల్యే అనీ, మేము పబ్లిక్ సర్వెంట్స్ అనీ. అంటే అర్థం ఏమిట్రా అంటే మీరు పబ్లిక్ అనీ, మేము సర్వెంట్లం అనీ..'' అన్నారట.
దాంతో ఎమ్మెల్యే కంగు తిని ''అబ్బే అది కాదు నా ఉద్దేశం..' అంటూ జావకారి పోయాడట.
అదీ రెడ్డిగారి స్టయిల్ !
xxxxxx
రాజకీయనాయకులలో కొందరు కొంతకాలం పోయాక గవర్నరు పదవులు అలంకరించవచ్చు. అప్పుడు వారితో యింత ముక్కుసూటిగా మాట్లాడలేం. ప్రొటోకాల్ అడ్డు వస్తుంది. చెప్పడం కాస్త సొగసుగా చెప్పాలి. ఓ సీనియర్ ఐయేయస్ ఆఫీసరుగారుండేవారు. తన సీనియారిటీకి, సామర్థ్యానికి తగిన పోస్టింగ్ యివ్వలేదన్న బాధ మనసులో వుండేది కానీ పెద్దమనిషి కాబట్టి బయటపడలేదు.
అప్పట్లో గవర్నరుగా వచ్చిన కుముద్‌బెన్ జోషీగారు యీయన్ని పట్టుకుని తన ఆఫీసులో సెక్రటరీగా రమ్మనమని అడిగారు. సర్వీసెస్‌లో వున్నవారు ఏరికోరి వరించే ఉద్యోగమేమీ కాదది. ఈయన సుతారంగా ''వద్దు లెండి'' అనేశారు. ఆవిడ వినలేదు. ఒకటికి రెండుసార్లు చెప్పింది, చెప్పించింది. ఇక ఈయనకు విసుగెత్తింది.
ఈ సారి ఆవిడ మళ్లీ డైరక్టుగా అడిగినప్పుడు ఒకే ఒక్క మాట అన్నారు – ''మేడమ్, ఐ యామ్ సీనియర్ ఎనఫ్ టు బీ ఎ గవర్నర్'' (నా సీనియారిటీ ఎంత వుందంటే స్వయంగా ఓ గవర్నరు కాదగినంత!) అని. గట్టిగా మాట్లాడితే నేనే మీ కుర్చీలో కూర్చునేటంత వాణ్ని మీకు సెక్రటరీగా రావడమేమిటి? అబ్సర్డ్! అన్న భావాన్ని క్లుప్తంగా, ఘాటుగా, అదే సమయంలో మర్యాదగా చెప్పారు.
xxxxxx
మనకు ఉపరాష్ట్రపతిగా చేసిన హిదాయతుల్లాగారి మాట తీరు వీళ్లందరి కంటె వేరేలా వుంటుంది. సౌమ్యత వుట్టిపడుతూ వుంటుంది. ఆయన ఉపరాష్ట్రపతి కాబట్టి రాజ్యసభకు చైర్మన్ కూడా. అవేళ గురువారం. అంటే ప్రధానమంత్రి సభలో వుంటారు. ఈయన మాటిమాటికీ పాలకపక్షంవారి బెంచీల కేసి తిరిగి చూస్తున్నారు. ప్రతిపక్షాల వారు వేరేవైపు కూర్చుంటారు కదా. పీలూ మోదీ అనే ప్రతిపక్ష నాయకుడు లేచి నిలబడి ''అయ్యా ఇవాళ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ గారు సభలో వున్నారనీ తెలుసు, ఆవిడ చూడడానికి చాలా బాగుంటారనీ తెలుసు, అంతమాత్రాన మీరు క్షణక్షణం అటే తలతిప్పి చూస్తూ వుంటే మాకు కాస్త యిబ్బందిగా వుంది సుమా!'' అన్నారు ఆయనను ఆటపట్టించడానికి.
హిదాయతుల్లాగారు నొచ్చుకోలేదు సరికదా, అతి సౌమ్యంగా ''నాకు చెవులు సరిగ్గా వినబడవు. అందుకని కళ్లజోడులో ఎడమవైపు కాడకు హియరింగ్ ఎయిడ్ పెట్టారు. ఎవరైనా కుడివైపునుండి మాట్లాడుతూంటే మొహం అటు పూర్తిగా తిప్పి ఎడమ చెవి అటు పడేస్తే కానీ వాళ్లేమి చెపుతున్నారో వినబడదు, అర్థమవదు. అందువలన తల ఎక్కువగా తిప్పాల్సి వస్తోంది. దానితో పాపం మీకు కన్‌ఫ్యూజన్ వస్తోంది.'' అన్నారు.
ఈ హియరింగ్ ఎయిడ్ సంగతి ఎవరికీ తెలియదు. ఇప్పుడు విని అందరూ అరెరే అనుకున్నారు. పెద్దాయనమీద అనవసరంగా జోక్ వేసేమే అనుకున్నారు. ఇంత ఫ్రంటల్ ఎటాక్‌కు సౌమ్యంగా జవాబిచ్చి వూరుకోబెట్టడానికి కారణం ఆయనకు చమత్కారం తెలియక కాదు, ఛలోక్తులు వేయలేరని కాదు.
xxxxxx
ఒకసారి రాజ్యసభలో ఏదో విషయంలో చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ తరఫున మార్గరెట్ ఆల్వా, ప్రతిపక్షాల తరఫున పీలూ మోదీ ఘర్షణ పడ్డారు. ఉన్నట్టుండి పరిస్థితి తారుమారై పోయి వీళ్లు వాళ్లమీద ప్రివిలేజ్ మోషన్ పెట్టేవరకూ పోయింది. హిదాయతుల్లా గారు అదంతా చూసి నవ్వి ఉక్కును కోయాలంటే ఉక్కుకే సాధ్యం అన్న అర్థంలో పార్శీలో ఓ ద్విపద చెప్పారు.
పీలూ మోదీకి అది బాగా నచ్చింది. అందరూ దాన్ని ఆస్వాదించాలన్న వుద్దేశంతో లేచి నిలబడి ''మీరేదో పార్శీలో అనేశారు. మాకేం తెలుస్తుంది చెప్పండి. అర్థం చెప్పకపోతే..'' అన్నారు. పీలూ మోదీ స్వయంగా పార్శీ. ఫారసీ రాకుండా ఎలా వుంటుంది అని నవ్వుకుంటూ హిదాయతుల్లా గారు అందరికీ ఆ షేర్ అర్థం విడమరిచి చెప్పారు. రెండు నిమిషాల క్రితమే పారసీ రాదన్న పీలూ మోదీ వెంటనే ''అదెందుకు చెప్పారు? ఇది చెప్పి వుండాల్సిందిగా అంటూ పార్శీలోనే మరో షేర్ చదివారు. వజ్రం వజ్రేన భిద్యతే (వజ్రాన్ని కోయాలంటే వజ్రమే కావాలి) అన్న అర్థంలో వుంటుందది.
అది వినగానే హిదాయతుల్లా సభలో రెండు వైపులా చాలా జాగ్రత్తగా పరికించి చూసినట్టు చూసి, చివర్లో పెదాలు చప్పరించి ''ఎటు చూసినా నా కిక్కడ వజ్రాలూ, వైఢూర్యాలు కనబడటం లేదు. ఆ షేర్ యిక్కడ అన్వయించదు. నేను చెప్పిన ఉక్కే రైటు.'' అన్నారు.
అతి అమాయకంగా మొహం పెట్టి సభ్యులందరికీ కలిపి ఒకేసారి వాత వేసిన ఆయన చతురతకు అంతా ఘొల్లున నవ్వారు.
xxxxxx
మా నాన్నగారూ అంతే – సుతిమెత్తగా, నవ్వుతూ అంటించేవారు. ఆయన జడ్జిగా రిటైరయ్యాక నేషనల్ సెంట్రల్ వేజ్ బోర్డు ఫర్ టెక్స్‌టైల్ ఇండస్ట్రీస్‌కి ఒకసారి, షుగర్ ఇండస్ట్రీస్‌కి మరోసారి చైర్మన్‌గా చేశారు. షుగర్ ఇండస్ట్రీస్ వేజ్ బోర్డు చైర్మన్‌గా వుండగా ఆయన మొట్టమొదటి సారిగా దూరపు ప్రయాణం చేయాల్సివచ్చింది అదీ ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ కు.
ఆయనకు పదిహేడో ఏట పెళ్లయింది. అప్పటినుంచి అరవయ్యో యేటి వరకు ఆయన ఇల్లు, కోర్టు తప్ప వేరే బయటకి వెళ్లి ఎరుగరు. ఏదో మా అమ్మ వంటచేయడం, పొద్దున్నే కరెక్టుగా తొమిదిన్నరకి భోజనం చేయడం. తర్వాత కోర్టుకి వెళ్ళడం, మధ్యాహ్నం అక్కడ ఏదో ఓ కప్పు టీ తాగడం, సాయంకాలం ఇంటికి రాగానే ఆవిడ ఏ టిఫిను చేస్తే అది తినడం అదే రొటీన్. జడ్జీగా అవ్వక ముందర క్లబ్‌కి వెళ్లి కాస్సేపు పేకాట (బ్రిడ్జ్ అంటే యిష్టం) ఆడుకునేవారు. వెనక్కి వచ్చి రెస్టు తీసుకునేవారు. థాబ్దాల తరబడి అదే రొటీన్. ప్రాక్టీసు పెట్టారు కాబట్టి మద్రాసు, గుంటూరు, హైదరాబాదు, ఢిల్లీలలో వున్నారు. సాధారణంగా ఎక్కడికీ ప్రయాణాలు చేసేవారు కారు.
చిత్రం ఏమిటంటే యింట్లో వుంటూనే ఆయనకు లండన్ అంతా కరతలామలకంలా పూర్తిగా తెలుసు. ఏ వీధిలో ఏ షాపుంటుందో చెప్పగలిగేవారు. ఓ సారి మా అన్నయ్య లండన్‌నుండి ఫోన్ చేసి ''ఇక్కడ పెద్ద బుక్ షాపుంది. వీధికి యీ మూలనుండి ఆ మూల దాకా వుంది.'' అన్నాడు. మా నాన్నగారు ''ఏ వీధిలో వున్నావు?'' అని అడిగారు. మా అన్నయ్య ఏదో చెప్పాడు. ''ఏడిచినట్టే వుంది, అది అవతలివీధి. నువ్వున్న వీధి పేరు ఫలానా..'' అని చెప్పారు. వెరిఫై చేస్తే ఆయన చెప్పినదే కరక్టని తేలింది. ప్రఖ్యాత ఇండో ఆంగ్లికన్ రచయిత నీరద్ సి. చౌధురికి కూడా యీ ప్రజ్ఞ వుందని చదివాను.
ఇలాటి గడపదాటని మనిషి గోరఖ్‌పూర్ వంటి సుదూరప్రదేశానికి వెళ్లడం, పైగా అమ్మలేకుండా ప్రయాణం చేయడం, ఆయనను చికాకు పెట్టాయి. వెళ్లాక ప్రభుత్వ గెస్ట్‌హౌస్‌లో అతిథ్యం యిచ్చారు. వయసులో పెద్దవాడు, రిటైర్డ్ జడ్జి, పరాయి రాష్ట్రంనుండి వచ్చారు, వేజ్ బోర్డు చైర్మన్.. బాగా చూసుకోవాలి అని ప్రోటోకాల్ మర్యాదలన్నీ చెప్పి యీయన్ని చూసుకోవడానికి అక్కడ ఒకతన్ని నియమించారు. పొద్దున్నే అతను వచ్చేసరికి మా నాన్నగారు విసుగ్గా వున్నారు. కొత్తవాళ్లు, కొత్తపరిసరాలంటే చిన్నప్పటినుంచి అలవాటులేక అదొక బాధ. రాత్రంతా దోమలు కుట్టాయట. ఈయనకు నిద్రపట్టలేదు. ఈయన ముఖకవళికలు, పరిస్థితి చూసి కొంచెం జంకుతూనే సంభాషణ ఎలా మొదలు పెట్టాలా అనుకుంటూ ''అయ్యా! గోరఖ్‌పూర్ రావడం మొదటిసారా?'' అని పలకరించాడు
పలనాడు వెళ్లిన శ్రీనాథుడిలా వున్న మా నాన్నగారు శ్రీనాథుడి టైపులో కసిగా పద్యాలు చెప్పలేదు. తన పరిస్థితిమీద జోకులేసుకుంటూ, అవతలివాణ్ని ఆటపట్టిస్తూ అతి సీరియస్‌గా మొహం పెట్టి ''ఏమయ్యా ఒట్టేసి చెప్పు, యిక్కడకు రెండోసారి వచ్చినవాళ్లు కూడా వున్నారా?'' అన్నారు. అంటే ఒక్కసారి వస్తే జన్మలో యీ వూరి మొహం చూడరన్న శ్లేష వుంది.
xxxxxx
కొసమెరుపు – మా నాన్నగారే కంగు తిన్న సందర్భం ఒకటుంది. మా పిన్నీ, మా అమ్మా ఒక్కటే పోలిక. ఓ పెళ్లిలో మా అమ్మ అనుకుని మా నాన్నగారు 'ఇదిగో, నిన్నే' అంటూ మా పిన్ని భుజంమీద చెయ్యి వేయబోయారు. తనను చూడగానే తమాయించుకున్నారు – ''నువ్వా'' అంటూ. అప్పుడు మా పిన్ని ''ఎంత అదృష్టం బావా?'' అంది.
మా నాన్నగారు కొంటెగా ''ఏదీ.. చేయి పడందే'' అన్నారు. ''అబ్బే నా అదృష్టం గురించి కాదు, నీ అదృష్టం గురించి.. కాస్త వుంటే నీ చెంప వాచిపోవును గదా'' అంది మా పిన్ని కొంటెన్నరగా!
మీ సూచనలు [email protected] కి ఈమెయిల్ చేయండి.
excerpted from the forthcoming book Mohana Makarandam
print version distributed by Navodaya, e-version by kinige.com
please click here for audio version