ఎమ్బీయస్‌ : ఢిల్లీ శివార్లలో ఆఫ్రికన్ల సమస్య

ఢిల్లీ శివారైన ఖిర్కీ ఎక్స్‌టెన్షన్‌లో కొందరు ఆఫ్రికన్లపై ఫిర్యాదులు రావడం, దాన్ని ఆప్‌ మంత్రి సోమనాథ్‌ భారతి స్వయంగా విచారించబోయి చిక్కుల్లో పడడం అందరికీ విదితమే. ఇద్దరు సామాజిక పరిశోధకులు దాని నేపథ్యం గురించి…

ఢిల్లీ శివారైన ఖిర్కీ ఎక్స్‌టెన్షన్‌లో కొందరు ఆఫ్రికన్లపై ఫిర్యాదులు రావడం, దాన్ని ఆప్‌ మంత్రి సోమనాథ్‌ భారతి స్వయంగా విచారించబోయి చిక్కుల్లో పడడం అందరికీ విదితమే. ఇద్దరు సామాజిక పరిశోధకులు దాని నేపథ్యం గురించి కొన్ని విషయాలను వెలుగులోకి తెచ్చారు. ఢిల్లీ మహానగరంగా విస్తరిస్తూ వచ్చినపుడు కొన్ని ప్రాంతాలు బాగా డెవలప్‌ అయ్యాయి. ధనికులు అక్కడ నివసించసాగారు. మరి కొన్ని మధ్యతరగతి ఉద్యోగులు కాలనీలుగా మార్చుకున్నారు.  వీటిలో మంచి సౌకర్యాలు వుండడంతో అద్దెలు ఎక్కువ. ఢిల్లీ శివార్లలో, యితర రాష్ట్రాల పొరుగున వున్న గ్రామాలు ఎటూ కాకుండా తయారయ్యాయి. పాత పద్ధతిలో గ్రామాల్లాగానే వుంటూ ఢిల్లీకి చేరువగా వుండడంతో నగరవాసనలు కూడా పులుముకున్నాయి. అక్కడ సందుగొందులు, అడ్డదిడ్డంగా కట్టిన యిళ్లు, మౌలిక సౌకర్యాల లేమి యిలా అన్నిరకాల యిబ్బందులూ వున్నాయి. అద్దెలు తక్కువ. అందువలన ఈశాన్య రాష్ట్రాల నుండి వలస వచ్చి చిన్న ఉద్యోగాలు చేసుకునేవారు, ఆఫ్రికా నుండి చదువుకోసమో, ఉద్యోగం కోసమో, సరదాకో వచ్చి వుండేవాళ్లు అందరూ అక్కడ చేరారు. వాళ్లు యిక్కడున్నంత మాత్రాన తమ దుస్తుల ధోరణి మార్చుకోరు కదా. పొట్టిపొట్టి స్కర్టులు వేసుకుని తిరుగుతుంటారు. ఓ పక్క వీళ్లు యిలా తిరుగుతూంటే మరో పక్క ముస్లిము స్త్రీలు బురఖాల్లో తిరగడమూ కనబడుతుంది. పల్లెటూళ్లో వుండే ఛాందసులు పట్నవాసపు పోకడలను ఎలా నిరసిస్తారో అలాగ యీ ప్రాంతాల్లో ఎప్పణ్నుంచో వుంటున్నవారు 'నీతినియమాల పట్టింపు లేని యీ ఆఫ్రికన్లు, ఈశాన్య రాష్ట్రాల వారూ వచ్చి మన యువతను భ్రష్టు పట్టిస్తున్నార'ని వాపోతూ వుంటారు. నిజానికి ఏ జాతివారూ అందరూ ఒకేలా వుండరు. మంచివాళ్లూ, చెడ్డవాళ్లూ అందరూ వుంటారు. అందరినీ కలిపి ఒకే గాటికి కట్టడం లోకుల బలహీనత.

ఇలాటి ప్రాంతాల్లో మునీర్కా, ఖిర్కీ వంటివి వున్నాయి. హౌజ్‌ ఖాస్‌, షాపూర్‌ జాట్‌ వంటి గ్రామాల్లో యిదివరకు యిలాటి పరిస్థితే వుండేది కానీ అవి క్రమంగా ఎదిగాయి. మంచి రెస్టారెంట్లు, బార్లు, బోతిక్‌లు వచ్చి కమ్మర్షియల్‌గా అద్దె ఎక్కువ రావడం మొదలుపెట్టింది. వాటిని చూసి కాస్త డీసెంటు జనాభా కూడా రాసాగారు. దాంతో ఖిర్కీలోని యిళ్ల ఓనర్లకు కన్ను కుట్టింది. ఈ ఆఫ్రికన్ల కారణంగా మన ఏరియాకు చెత్త లొకాలిటీగా ముద్ర పడింది, సౌకర్యాలను పెంచుకుని, వీళ్లను వదిలించుకుంటే మనమూ బాగుపడవచ్చు, మన ఏరియాలు పోష్‌ అవుతాయి అనే ఆలోచన రగిలింది. రెసిడెంట్‌ వెల్‌ఫేర్‌ అసోసియేషన్‌ (రా) అనే పేర సంఘంగా ఏర్పడి ఆఫ్రికన్ల స్థావరాలపై ఫిర్యాదులు చేయనారంభించారు. అయితే పోలీసులు ఆఫ్రికన్ల వద్ద లంచాలు మరిగి, ఎటువంటి చర్యా తీసుకోలేదు. ఆప్‌ తరఫున సోమ్‌నాథ్‌ ఆ ప్రాంతం ఎమ్మెల్యేగా నెగ్గి, మంత్రి కావడంతో రా వాళ్లు వెళ్లి గోడు చెప్పుకున్నారు. పబ్లిసిటీ కోసం తహతహలాడుతున్న సోమ్‌నాథ్‌ అర్ధరాత్రి ఆ స్థావరాలకు వచ్చి పోలీసులకు ఆదేశాలివ్వడం, దానిని వాళ్లు అమలు చేయకపోవడం జరిగింది. అక్కడ డ్రగ్స్‌, అమ్మాయిల వ్యాపారం జరుగుతుండడం నిజమే అయినా, మంత్రి ఆ సమస్యతో వ్యవహరించిన తీరు బాగాలేదని అందరూ విమర్శించారు. మంత్రి మహిళల పట్ల దురుసుగా వున్నాడనీ, ఆఫ్రికన్ల పట్ల వివక్షత చూపించాడనీ ఆరోపణలు గుప్పించారు. 

కానీ ఖిర్కీ వాసులు మంత్రిని వెనకేసుకుని వచ్చారు. తమందరినీ డ్రగ్స్‌ అమ్మేవారిగా, వ్యభిచారులుగా చూస్తారన్న భయాందోళనలు కలిగి ఆఫ్రికన్లకు వాళ్లు ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసి వెళ్లిపోవడం మొదలుపెట్టారు. 'అదిగో, చెకింగ్‌కు రాగానే భయపడి వెళ్లిపోతున్నారంటే వాళ్లు అలాటి వాళ్లే అని అర్థం కదా' అని ఖిర్కీవాసులు అంటున్నారు.
అసలు యింతమంది ఆఫ్రికన్లు ఇండియాలో వుండడమేమిటి అంటే గ్లోబలైజేషన్‌ తర్వాత వారి రాకపోకలు పెరిగాయి. 2000 సం||రంలో భారత్‌-ఆఫ్రికా వ్యాపారం 7.5 బిలియన్‌ డాలర్లయితే 2013 నాటికి అది 66 బిలియన్‌ డాలర్లయింది. 2015 నాటికి 100 బిలియన్‌ డాలర్లు అవుతుందంటున్నారు. విద్య కోసం, వైద్యసదుపాయాల కోసం ఆఫ్రికన్లు యిదివరకు చైనాకు వెళ్లేవారు. ఇప్పుడు భారత్‌ అంతకంటె చవకగా కనబడడంతో, స్నేహపూర్వకమైన వాతావరణం వుండడంతో యిక్కడికి రాసాగారు. వారిలో కొందరు పెడదారిన పడిన మాట వాస్తవం. వారిని ఏరివేస్తే ఆఫ్రికన్లకు చెడ్డపేరూ రాదు, ఆఫ్రికన్లతో సరిగ్గా వ్యవహరించలేదన్న చెడ్డపేరు మన దేశస్తులకూ రాదు. ఇది సున్నితంగా నడపవలసిన వ్యవహారం. అయితే నాయకుల దూకుడు కారణంగా, స్థానికుల ఆర్థికప్రయోజనాల కారణంగా అది జటిలమై పోతోంది.  

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ 

[email protected]