ఈ విధంగా జులై 30 ప్రకటన ద్వారా కాంగ్రెసు ప్రతిపక్షాలను బలహీనపరచ గలిగింది. ప్రత్యర్థులు బలహీనంగా వున్నపుడు అధికారపక్షంగా వున్నవారికి వుండే సహజమైన అనుకూలతలతో కాంగ్రెసు తన పరిస్థితిని మెరుగు పరచుకోగలుగుతుంది. ఎందుకంటే ఏ పార్టీ బలంగా లేనపుడు ఓట్లు చీలిపోయి 1-2% ఓట్ల తేడాతో ఎవరైనా గెలిచే పరిస్థితి వస్తుంది. యుపి వంటి రాష్ట్రాలలో యిలాటి పరిస్థితి చూశాం. ఇలా చూస్తే కాంగ్రెసుకి ఎంతో కొంత లాభపడవచ్చని అనిపిస్తుంది. ఇది ఒక జూదం మాత్రమే. కానీ జూదం ఆడకపోతే యీ పాటి సీట్లయినా గెలవమని అధిష్టానం అంచనా కాబోలు. మరి అలా అయితే ప్రస్తుత తెలంగాణ బిల్లు పాస్ చేసేసి, సీమాంధ్రకు పూర్తిగా అన్యాయం చేసేస్తుందా? ఆ మేరకు తెలంగాణలో లాభపడుతుందా? కాంగ్రెసు-తెరాస పొత్తులో కెసియార్ ఎమ్జీయార్ ఫార్ములా అమలు చేద్దామని చూస్తున్నారు. అంటే అసెంబ్లీ ఎన్నికలలో ప్రాంతీయపార్టీకి మూడింట రెండు సీట్లు, జాతీయపార్టీకి మూడో వంతు సీట్లు ఎలాట్ చేస్తారు. పార్లమెంటు ఎన్నికలలో జాతీయపార్టీకి మూడింట రెండు వంతులు, ప్రాంతీయపార్టీకి మూడోవంతు సీట్లు వస్తాయి. ఆ ప్రకారం టి-కాంగ్రెసు నాయకులు రాష్ట్రంలో 40 సీట్లలో మాత్రం పోటీ చేయగలరు. పొత్తు ఎంత సవ్యంగా నడుస్తుందో, వీరిలో ఎన్ని సీట్లు నెగ్గుతారో తెలియదు. రాష్ట్రప్రభుత్వంలో వాళ్లకు పదవులు దక్కుతాయో లేదో డౌటు. ఇక పార్లమెంటు సీట్లలో 17 సీట్లలో ఒకటి మజ్లిస్‌కు పోగా 16టిలో 10 సీట్లలో కాంగ్రెసు పోటీ చేస్తుందనుకోవాలి. వాటిలో ఎక్కువలో ఎక్కువ 7,8 సీట్లు గెలవగలదు. అంటే తెలంగాణ యిచ్చి కాంగ్రెసు బావుకునేది 8 ఎంపీ సీట్లన్నమాట! సీమాంధ్రలో వాటిలో సగమైనా వస్తాయో లేదో తెలియదు. ఎంతటి బుద్ధిహీనులైనా యింత ఘోరంగా విభజన చేయరు.
ప్రతిపక్షాల్లో బిజెపి ఒకటి మిగిలింది. రాష్ట్రంలో దాని ఉనికి ప్రస్తుతం తక్కువే. కానీ మోదీ రంగప్రవేశం వలన, దాని తెలంగాణ ఉద్యమంలో పాలు పంచుకోవడం వలన కాస్త బలపడే పరిస్థితిలో వుంది. జులై 30కి ముందు బిజెపి ఒకే మాటపై వుంది – తెలంగాణ యివ్వాలి అని. సీమాంధ్ర ప్రయోజనాల గురించి మాట్లాడలేదు. ఇప్పుడు పార్లమెంటులో బిజెపిని యిరకాటంలో పెట్టడం వలన ఆ పార్టీ కూడా ప్రాంతాల వారీగా చీలింది. ఏ ప్రాంతపు నాయకులు ఆ ప్రాంతపు వాదన వినిపించ నారంభించారు. దానివలన సీమాంధ్రలో ఎంత పుంజుకుంటుందో వేచి చూడాలి కానీ, తెలంగాణలో మాత్రం బలహీనపడింది. బిజెపి చిత్తశుద్ధిని తెరాస, టి-కాంగ్రెసు ప్రశ్నించ నారంభించాయి. టిడిపితో దాని దోస్తీ కూడా తెలంగాణలో యిబ్బంది కలిగిస్తోంది. ఇప్పుడు కాంగ్రెసు బిజెపిని దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తోంది. 'మేం తెలంగాణ యివ్వాలనుకుంటే అది ఏదో పితలాటకం పెడుతోంది' అని చెప్తోంది. బిజెపి 'అదేమీ కాదు, కాంగ్రెస్సే నాటకం ఆడుతోంది. తన ముఖ్యమంత్రిని కావాలనే అదుపు చేయటం లేదు. అసెంబ్లీ తిరస్కరించిన తీర్మానాన్ని పార్లమెంటులో పెడుతోంది. ఇరుప్రాంతాల వారినీ ఒప్పించకుండా, సవరణలు చేయకుండా బిల్లు పెడదామని చూస్తోంది' అని వాదిస్తోంది.
బిజెపి అలా వాదించేట్లు చేస్తున్నది కాంగ్రెస్సే. తొమ్మిది వేల సవరణలు పంపిస్తే బండిల్స్ కూడా తెరిచి చూడకుండా అరగంటలో మంత్రుల ముఠా తను అనుకున్నది చేసేసింది. ఎమ్మెల్యేలను పూచికపుల్లల కంటె అన్యాయంగా తీసిపారేసింది. వాళ్లనే కాదు, రాష్ట్రపతిని కూడా తేలిగ్గా తీసుకుంది. ఆయన తెలంగాణ బిల్లుకు ఆమోదం తెలపకుండానే, అజెండాలో పెట్టేసింది. అంటే ఆయన వట్టి రబ్బరు స్టాంపే, మేం ఏం చెప్తే అదే చేస్తాడు అనే సంకేతాన్ని దేశానికి పంపింది. ఆర్థిక బిల్లులు తప్ప వేరేవీ తలపెట్టకండి, పార్లమెంటు గందరగోళంలో పడుతుంది అన్నా వినకుండా యీ బిల్లుని పట్టుకుని వేళ్లాడుతోంది. రాజ్యసభలో ముందు ప్రవేశపెడతాం అనడమే ఓ డ్రామా. సాధారణంగా నాన్-సీరియస్ బిల్లులనే అక్కడ మొదట పెడతారు. మహిళా బిల్లు వంటివి ఏళ్లూ, పూళ్లూ గడిచినా మోక్షం లేకుండా గడిపేశారు. ఇప్పుడు తెలంగాణ బిల్లుకు అదే గతి పట్టించబోతున్నారన్నమాట. ఇప్పుడు ఎన్నికలలో 'మేం తెలంగాణ యిద్దామనుకుంటే బిజెపి అడ్డుపడింది' అన్న నినాదంతో ముందుకు వెళతారన్నమాట! మరి బిజెపి? 'మేం ఎంత చెప్పినా కాంగ్రెసు బిల్లును సరిదిద్దలేదు. వారికి చిత్తశుద్ధి లేదు. మాకుంది.' అనే నినాదంతో బయలుదేరుతుంది. తెలంగాణ ఓటరు ఎవరిని నమ్ముతాడో వేచి చూడాలి.
టి-బిల్లును యింత మెసప్ చేశాక, సీమాంధ్రలో కాంగ్రెసు గతి ఏమిటి? ఇదంతా కావాలనే చేసింది అని సీమాంధ్ర కాంగ్రెసు నాయకులు లోపాయికారీగా చెప్పుకుని ఓట్లు అడగవచ్చు. 'కొందరు తెలంగాణ నాయకుల మాటలు విని సోనియా మిస్‌లీడ్ అయ్యారు, ఇప్పుడు రాహుల్ ప్రధాని కాబోతున్నారు. మనకు అన్యాయం చేయరు' అని చెప్పుకోవచ్చు. రాహుల్ యిప్పటిదాకా తెలంగాణపై నోరు విప్పకపోవడం యీ సందర్భంలో గుర్తు చేసుకోవాలి. నమ్మినంతమంది నమ్ముతారు, నమ్మనివాళ్లు కిరణ్‌కో, జగన్‌కో ఓట్లేయవచ్చు. 2014లో యుపిఏ 3 ప్రభుత్వం ఏర్పడుతుందన్న నమ్మకం కాంగ్రెసుకు లేదనే అనుకోవాలి. అందుకే రాహుల్‌ను ప్రధాని అనకుండా ఆగిపోయారు. కాంగ్రెసు ప్రచారసారథిగానే ప్రకటించారు. పార్లమెంటులో ప్రభుత్వ ఏర్పాటుపై ఆశ వీడిన తర్వాత కిరణ్‌తో, జగన్‌తో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. రాష్ట్రంలో కిరణ్, జగన్, బాబు యించుమించు సమానస్థాయిలో పోటీ పడ్డారనుకోండి. కిరణ్ లేదా జగన్ ప్రభుత్వం ఏర్పరచడానికి కొన్ని సీట్లు తక్కువ పడితే కాంగ్రెసు ఆమ్ ఆద్మీకి మద్దతు యిచ్చినట్లే బయటినుండి మద్దతు ప్రకటించవచ్చు. బాబు బిజెపితో జట్టు కడతారు కాబట్టి కిరణ్ లేదా జగన్ కాంగ్రెసు మద్దతు స్వీకరించవచ్చు. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. కాంగ్రెసు పూర్తిగా మట్టి కరిస్తే వీళ్లు కాంగ్రెసును పట్టించుకోకుండా తృణమూల్‌లా, ఎన్‌సిపిలా ఎదగవచ్చు. ఫిబ్రవరి నెలంతా రసవత్తరంగా వుంచడానికి కాంగ్రెసు నిశ్చయించుకుంది. ఆ రసభరితనాటకంలో అన్ని పార్టీలకు పాత్రలిచ్చింది. ప్రస్తుతం బిజెపిది ప్రధాన భూమిక. కాంగ్రెసు చర్యకు అది ప్రతిచర్య కనబరుస్తోంది. ఆ ప్రతిచర్యను కాంగ్రెసు ముందే వూహించిందనడంలో సందేహం అక్కరలేదు. (సమాప్తం)
– ఎమ్బీయస్ ప్రసాద్ (ఫిబ్రవరి 2014)