అంటే అన్నాడు కానీ.. మంచి చర్చ మొదలైంది

కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు వాస్తవాలా..? వక్రీకరణలా..? అనే విషయం పక్కనపెడితే రాష్ట్ర విభజన జరిగిన ఎనిమిదేళ్ల తర్వాత అసలు ఏ రాష్ట్రం బాగుంది, ఎంత బాగుంది అనే విషయంపై చర్చ నడుస్తోంది. కరోనా కాలంలో…

కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు వాస్తవాలా..? వక్రీకరణలా..? అనే విషయం పక్కనపెడితే రాష్ట్ర విభజన జరిగిన ఎనిమిదేళ్ల తర్వాత అసలు ఏ రాష్ట్రం బాగుంది, ఎంత బాగుంది అనే విషయంపై చర్చ నడుస్తోంది. కరోనా కాలంలో మీ వాళ్లు మా రాష్ట్రం వచ్చి వైద్యం చేయించుకుని వెళ్లారని ఏపీ వైసీపీ నేతలంటుంటే.. లేదు లేదు మీ మంత్రులు, ఎంపీలే మా దగ్గర ఐసీయూ బెడ్స్ కోసం రికమండేషన్ చేయించుకున్నారని టీఆర్ఎస్ నేతలు బదులిస్తున్నారు.

వైద్యం ఎక్కడ జరిగిందనే విషయం పక్కనపెడితే వైద్యుల్లో నూటికి 70 మంది ఏపీ వాళ్లే కావడం విశేషం. తెలంగాణలో ఉన్న ఆస్పత్రుల్లో ఏపీ యాజమాన్యాల కింద ఉన్నవే ఎక్కువ. కానీ అప్పట్లో సౌకర్యాలన్నీ అక్కడే ఉన్నాయి కాబట్టి వెళ్లిపోయారు. ఇప్పుడు ఏపీకి రావాలని ఉన్నా కూడా ఆ బ్రాండ్ వదులుకోలేరు, ఇక్కడ బ్రాంచీలు పెట్టినా లాభం వస్తుందనే గ్యారెంటీ లేదు. అందుకే ఇప్పటికీ వైద్యం కోసం ఏపీ వాసులు హైదరాబాద్ వైపు చూడాల్సిన పరిస్థితి.

చంద్రబాబు ఏం చేశారు..?

చంద్రబాబు ఓటుకి కోట్లు కేసు విషయంలో భయపడి ఏపీకి పరిగెత్తారు కానీ, ఆయనకు అక్కడి నుంచే పాలించాలనే ఆశ ఉంది. పోనీ ఇక్కడికి వచ్చాక ఏమైనా అభివృద్ధి చేశారా అంటే అదీ లేదు. అన్నీ గ్రాఫిక్స్ మాయలే. 

పన్ను పీకించుకోడానికి సాక్షాత్తూ అప్పటి ఆర్థిక మంత్రి విమానం ఎక్కి విదేశాలకు వెళ్తే.. ఇక సామాన్యులకి ఇక్కడి ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకం ఏముంటుంది చెప్పండి. విద్య, వైద్యం విషయంలో చంద్రబాబు చేసింది శూన్యం. ఇంకా చెప్పాలంటే అప్పటి తన మంత్రివర్గంలో ఉన్న నారాయణ లాంటి వారి కోసం విద్య, వైద్య రంగాలను దోచిపెట్టారు. ఆ ఫలితం ఇప్పుడు స్పష్టంగా కనపడుతోంది.

జగన్ ఏం చేస్తున్నారు..?

చంద్రబాబు చేసిన తప్పుల్ని సరిదిద్దడమే జగన్ కు పెద్ద పనిగా మారింది. పోనీ ఇంగ్లిష్ మీడియం తెచ్చి విద్యా విధానంలో విప్లవాత్మక మార్పులు తెద్దామనుకుంటే దానికీ మోకాలడ్డుతున్నారు. నాడు-నేడుతో ఇప్పటికే సగం పని పూర్తయింది. తాజాగా డిగ్రీ కాలేజీల ప్రక్షాళణ మొదలు పెట్టారు. అన్నిటినీ ఒకే యూనివర్శిటీ కిందకు తెచ్చి, వృత్తి నైపుణ్యాలను పెంచే విధంగా తీర్చిదిద్దబోతున్నారు.

ఇక జిల్లాకు ఓ ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు చేస్తున్నారు. ప్రైవేటు రంగానికి ధీటుగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో సౌకర్యాలు మెరుగుపరుస్తున్నారు. వైఎస్సార్ అర్బన్ హెల్త్ క్లినిక్ ల పేరుతో వైద్యాన్ని ప్రజలకు దగ్గరగా చేశారు. ఆరోగ్యశ్రీని మరింత మెరుగుపరిచి పేదలకు భరోసా ఇస్తున్నారు. మూడేళ్లలో ఇప్పటికే విద్య, వైద్యంపై వేల కోట్లు ఖర్చు చేసి, ప్రజలకు గొప్ప భరోసా ఇచ్చారు జగన్. ఈ స్ఫూర్తి ముందుకు కదిలితే మరింత మేలు కలుగుతుంది. అప్పుడు తెలంగాణకు, ఏపీకి స్పష్టమైన తేడా తెలిసొస్తుంది.

ఏపీ ఎప్పుడు తెలంగాణను వెనక్కి నెడుతుంది..?

తెలంగాణతో ఏపీ పోటీ పడుతుందా..? పడినా నిలబడుతుందా..? చంద్రబాబు హయాంలో ఆ అనుమానాలు ఉండేవి కానీ, ఇప్పుడు ఏపీలో రైతులు సంతోషంగా ఉన్నారు, విద్యార్థులను బడికి పంపిస్తున్న తల్లిదండ్రులు హ్యాపీగా ఉన్నారు. చేనేత, టైలర్, ఆటో డ్రైవర్.. ఇలా అందరూ ఏపీలో హ్యాపీగా ఉన్నారు. 

అంతెందుకు తెలంగాణ ఆర్టీసీ కార్మికులు తాము ఏపీలో పుట్టి ఉంటే ఎంతో బాగుండేదని రోజూ అనుకుంటూనే ఉన్నారు. మార్పు మొదలైంది, అది జగన్ తో సాధ్యమైంది, కచ్చితంగా ఏపీ అభివృద్ధిలో దూసుకెళ్లడం ఖాయం.