ప్రోమోల్లో ‘దొబ్బిచ్చుకుంటే’ పర్లేదా?

తెలుగులో భాషా భేదాలు ప్రాంతాన్ని బట్టి గణనీయంగా మారిపోతుంటాయి. ఒకచోట నిత్య వ్యవహారంలో ఉండే పదం మరో చోట పచ్చిబూతుగా చెలామణీ అవుతూ ఉంటుంది. ఒకే జిల్లాలో వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు రకాల అర్థాలు…

తెలుగులో భాషా భేదాలు ప్రాంతాన్ని బట్టి గణనీయంగా మారిపోతుంటాయి. ఒకచోట నిత్య వ్యవహారంలో ఉండే పదం మరో చోట పచ్చిబూతుగా చెలామణీ అవుతూ ఉంటుంది. ఒకే జిల్లాలో వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు రకాల అర్థాలు ఇచ్చే పదాల భేదాలు కూడా మనకు ఎరుకే. అలాంటిది సినిమా డైలాగులు రాసేవారు సాధారణంగా ప్రమాణభాషను దృష్టిలోపెట్టుకోవాల్సి ఉంటుంది. అయితే తమకు పంచ్‌ కోసం రచయితలు తమకు తెలిసిన కామెడీ యాసలను వాడుకోవడం.. వాటిలో రెండో అర్థం ఉంటే.. సెన్సార్‌ వద్ద ఎడిట్‌ అయిపోతుండడం ఈ మధ్యకాలంలో తరచూ జరుగుతోంది. అలాంటి పదాల్లో ‘దొబ్బిచ్చుకోవడం’ కూడా ఒకటి. 

ఈ పదం కొన్నాళ్లు సినిమాల్లో నడిచింది గానీ.. ఇటీవలి కాలంలో చాలా రెగ్యులర్‌గా కట్‌ చేసేస్తున్నారు. అయితే ప్రోమోల్లో మాత్రం యథేచ్ఛగా వాడేస్తున్నారు. తాజాగా రాంగోపాల్‌వర్మ సత్య2 సినిమా విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ప్రోమోలకు వర్మ స్వయంగా వాయిస్‌ ఓవర్‌ ఇచ్చి ఒక క్రేజ్‌ తీసుకువచ్చారు. అయితే ప్రోమోల్లో యథేచ్ఛగా ఇలాంటి నిషిద్ధ పదాలను వాడేస్తున్నారు.  

‘‘రాయలసీమ ఫ్యాక్షనిస్టులు ఫినిష్‌ అయిపోయారు గనక..  బెజవాడ గూండాలు అంతరించిపోయారు గనుక.. హైదరాబాదు రౌడీయిజాన్ని ఏమీ దొబ్బించుకోలేకపోతున్నారు గనక ఒక కొత్త రకం క్రైం పుడుతున్నదంటూ ’’ రాంగోపాల్‌ వర్మ స్వయంగా చెప్పిన వాయిస్‌ ఓవర్‌తో టీవీ ప్రోమోలు హోరెత్తిపోతున్నాయి. ఏదో కొంత వివాదం సృష్టిస్తే సినిమాకు కాస్త మార్కెట్‌ క్రియేట్‌ అవుతుందని భావిస్తుండే రాంగోపాల్‌ వర్మ.. ఇప్పుడు కనీసం ప్రోమోల ద్వారా అయినా చిన్న వివాదం రేకెత్తిస్తే మార్కెట్‌ ఉంటుందని భావిస్తున్నట్లు కనిపిస్తోంది.