బాబూ కేటీఆర్ !
రాజకీయాల్లో నువ్వు ఇంకా బొడ్డూడని బుడ్డోడివే అయినా.. కొండంత సీనియారిటీ ఉన్న వాళ్లను కూడా ఎగిరెగిరి సవాలు చేస్తుంటావు చూడూ…. ఆ అమాయకత్వం చూస్తే బలె ముచ్చటేస్తుంటుంది బాబూ! మడిసన్నాక ఆ మాత్రం అమాయకత్వం ఉండాల్సిందే! లేపోతే విమర్శలు గుప్పించేటప్పుడు పెద్దా చిన్నా తెలిసిపోతుంది. పెద్దా చిన్నా తెలిసిపోయాక అరె మనం బుడ్డోళ్లమే.. ఆళ్లని తిట్టడానికి మన రేంజి సరిపోద్దో లేదో అనే అనుమానం వచ్చేస్తాది. అప్పుడు మన నోటికి తాళం పడిపోద్ది. బాబూ కేటీఆర్! నేనో సత్యం చెప్పనా.. అనుమానం అనేది.. జ్ఞానానికి తోబుట్టువు లాంటిది! జ్ఞానం ఉన్నవాడికే అనుమానాలు వస్తాయి! అసలు విషయమే తెలియనివాడికి విషయమ్మీద డౌట్లు ఎందుకొస్తాయి చెప్పు! అలాగన్నమాట.
అవతలి వాళ్లను తిట్టేప్పుడు ఎవరైనా సరే.. ముందు వెనకా చూస్కుంటారేమో గానీ.. అవతల ప్రధాని అయినా రాష్ట్రపతి అయినా.. జానేదో అనుకుని తెగడ్డంలో నిన్ను మంచిన వాడు లేడనేది నా సర్టిఫికేటు. ఇప్పుడు మటుకు అటు చంద్రబాబునీ, ఇటు కిరణ్‌కుమార్‌రెడ్డిని ఏకబిగిన వాయించేయడం నీకే చెల్లింది మరి!
ఇకపోతే అసలు విషయానికి వస్తున్నా..
ఏది ఏమైనా నువ్వు చెప్పిన ఒక మాట మాత్రం నికార్సయిన నిజం బాబూ! కిరణ్‌కుమార్ రెడ్డి మాట్లాడే తెలుగు చూస్తాంటే మాక్కూడా ఏదో ఉల్లిగడ్డలు తరుగుతున్నంత ఘాటుగా కళ్లమ్మట గంగా ప్రవాహం వచ్చేస్తూ ఉంటుందంటే నమ్ము! నీ తెలుగు చూడముచ్చటగా వినసొంపుగా ఉంటుంది.
తెలంగాణ యాస ఇసుమంతైనా లేకుండా, ప్రయత్నపూర్వకంగా ఎక్కడో ఒకటిరెండు తెలంగాణ పదాలను బలవంతంగా చొప్పిస్తూ శిష్ట వ్యావహారికంలో చక్కటి తెలుగు మాట్లాడగలవు నువ్వు! కిరణ్ రెడ్డి పేరుకు తెలుగురాష్ట్రానికి ముఖ్యమంత్రే గానీ.. అచ్చంగా చదవడం కూడా రాదాయె. మొన్నటికి మొన్న రాష్ట్రావతరణ దినోత్సవం రోజు కిరణ్ కుమార్ రెడ్డి రాసుకువచ్చిన కాగితాన్ని ముందు పెట్టుకుని దాన్ని చదవడానికి పడిన పాట్లు చూస్తే నాక్కూడా బాధేసింది. నీక్కూడా బాధేసింది గనుకనే.. ఏకంగా నువ్వు కిరణ్‌రెడ్డికి సవాళ్లు విసిరావు. అంతా బాగుంది. పదినిమిషాలు తప్పుల్లేకుండా తెలుగు మాట్లాడితే పదిలక్షల రూపాయలు ఇస్తానన్నావంటే మామూలు విషయం కాదు బాబూ! నిన్ను సెభాష్ అనాల్సిందే.
అయినా బాబూ కేటీఆర్!! ఇక్కడ మనం ఓ సంగతి గేపకం తెచ్చుకోవాలి. కిరణ్‌రెడ్డి పుట్టకముందు నుంచి ఆళ్ల నాయిన పెద్ద పొలిటీషియను. బిడ్డల మీద పెద్ద శ్రద్ద లేదు. మీరు పుట్టే నాటికి మీ నాయిన అంత పెద్ద హీరో అనిపించుకునే రేంజిలో లేడు. కనక మీ మీద చానా శ్రద్దపెట్టాడు. బాగా చదివించాడు. అందుకు మీ నాయిన్ని కూడా సెభాష్ అనాల్సిందే.
మరో సంగతి ఏటంటే.. మీ నాయినకి మీమీద శ్రద్ధ ఎక్కువ కాబట్టి.. నిన్ను తీస్కెళ్లి గుంటూర్లో బెట్టి జాగర్తగా చదివించినాడు. ఇయ్యాలంటే సీమాంధ్రోళ్లనంతా తెగ తిట్టిపోస్తన్నావు గానీ.. ఆళ్లు విద్యాదానం చెయ్యబట్టి మరో మాటల్లో చెప్పాలంటే.. ఆళ్లు చదువును బిచ్చంగా వెయ్యబట్టి నువ్వు ఎంచక్కా మంచిగ బాస నేర్చుకున్నావు. ఏకంగా అమెరికాకు వెళ్లి కొలువులు జేసినావు. మళ్లీ వచ్చి ఎమ్మెల్యే అయినావు. చక్కటి తెలుగు మాటాడతన్నావు. కిరణ్ రెడ్డి నాయినకు శ్రద్ద లేదు… పిలకాయిలు ఎట్ట నాశినం అయిపోతే ఏముండాదిలే అనుకోని.. ఆళ్లని ఈ అయిద్రాబాదులో సదువులకు యేసినాడు. అవికాస్తా సంకనాకి పోయినాయి. ఏదో నికరంగా నాలుగు ఇంగ్లిషు ముక్కలు వొచ్చినాయి గానీ.. తెలుగెక్కడ నేర్చుకున్నాడని..! అది రాకపాయె. మీ తెలంగాణ నేలని నమ్ముకోని ఈడ సదుకున్నందుకు కిరణ్‌రెడ్డి తెలుగు భ్రష్టు పట్టిపోయింది. ఈ బళ్లు చేతగాని బళ్లని క్లారిటీ ఉండబట్టి గుంటూరు పొయ్యి చదువుకున్నందుకు నువు సక్కంగా మాటాడతా ఉంటివి. సెబ్బాస్ అనాల్సిందే.
అయినా కేటీఆర్ బాబూ! కిరణ్ రెడ్డి సక్కంగా పది నిమిషాలు తెలుగుమాటాడితే పది లక్షలు ఇస్తామని సవాళ్లు జేసినావు గదా.. దానికి వాళ్లు గూడా జవాబియ్యాలనుకుంటన్నారంట. మీ నాయిన అదే బాబూ కేసీఆరు.. అయిదు నిమిషాలు బూతులు దొర్లకుండా ప్రసంగిస్తే ఇరవై లక్షల రూపాయలు ఇస్తారంట. రెడీ అయిపోరాదా.. క్యాష్ గిఫ్టు ఊరిస్తా ఉండాదే!!
– కపిలముని