మూడు వికెట్లు కోల్పోయిన లంక.. గెలవడానికి శ్రీలంక 379 పరుగులు చేయాలి. భారత బౌలర్లు 7 వికెట్లు తీస్తే మ్యాచ్‌ని టీమిండియా గెలిచేసినట్లే. ఇదీ ఢిల్లీ ఫిరోజ్ షా కోట్లా మైదానంలో శ్రీలంక – టీమిండియా మధ్య జరుగుతోన్న టెస్ట్ పరిస్థితి. రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు కోల్పోయి 246 పరుగులు చేసిన టీమిండియా, ఇన్నింగ్స్‌ని డిక్లేర్ చేసి లంక ముందు 410 పరుగుల విజయలక్ష్యాన్ని వుంచింది. కెప్టెన్ కోహ్లీ వ్యూహం ఫలించింది. 31 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది శ్రీలంక.
ఇక, ఈ రోజు కూడా ఆటగాళ్ళని కాలుష్యం బాగా దెబ్బతీసింది. లంక బౌలర్ సురంగ లక్మల్ మైదానంలో వాంతి చేసుకుంటే, భారత బౌలర్ షమి కూడా సాయంత్రం అదే పరిస్థితిని ఎదుర్కొన్నాడు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ కాలుష్యంతో ఆటగాళ్ళు సతమతమయ్యారు. ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో లంక ఆటగాళ్ళు మొహాలకి మాస్క్ తగిలించుకుని కన్పించడం గమనార్హం. బ్యాటింగ్‌కి వచ్చేసరికి మాత్రం మాస్క్‌ల జోలికి వెళ్ళలేదు లంక ఆటగాళ్ళు. టీమిండియాలో ఎవరూ మాస్క్ గురించిన ఆలోచన చేయకపోవడం గమనార్హం.
శ్రీలంక ఆటగాళ్ళ మాస్క్‌ల వ్యవహారంపై పెద్దయెత్తున విమర్శలు వెల్లువెత్తినా, కాలుష్యం ఎఫెక్ట్‌తో భారత ఆటగాళ్ళూ ఇబ్బంది పడటంతో, లంక టీమ్ కాస్తంత ఊపిరి పీల్చుకుంది. మొత్తమ్మీద, ఫిరోజ్ షా కోట్లా మైదానంలో జరుగుతున్న ఈ టెస్ట్ మ్యాచ్‌ని 'వాంతుల టెస్ట్'గా అభివర్ణిస్తున్నారు సోషల్ మీడియాలో నెటిజన్లు.
ఢిల్లీ అంటే కాలుష్యానికి కేరాఫ్ అడ్రస్.. దేశ రాజధానికి ఈ దుస్థితి దాపురించడం అత్యంత దారుణం. కానీ, ఏం చేస్తాం.? చెడ్డ పేరు అయితే వచ్చేసింది కదా.! లంక – టీమిండియా మధ్య టెస్ట్ మ్యాచ్ దెబ్బతో ప్రపంచవ్యాప్తంగా ఢిల్లీ కాలుష్యానికి మరింత పాపులారిటీ పెరిగిందని అనుకోవాలేమో.