అదృష్టం వెంట చాలా మంది పరిగెత్తుతారు. కానీ దక్కదు. కొందరికి అదృష్టమే వెంట పడుతుంది. అలాంటి వాళ్లలో వినోద్‌ఖన్నా ఒకడు.
హిందీ సినిమా ప్రియులు ఖన్నాని మరిచిపోలేరు. హీరో, విలన్, సెకెండ్ హీరో, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఏది చేసినా ఆయన ముద్ర వుంటుంది. నాలుగు సార్లు గురుదాస్‌పూర్ (పంజాబ్) నుంచి ఎంపీగా గెలిచాడు. కేంద్రమంత్రిగా కూడా పని చేశాడు.
1946లో పెషావర్‌లో పుట్టాడు. దేశ విభజన తర్వాత కుటుంబం బొంబాయికి వచ్చేసింది. బీకాం చదివాడు. సినిమాల్లోకి వచ్చాడు కానీ, లేదంటే పెద్ద క్రికెటర్ అయ్యేవాడు. సినిమా ఆఫీసుల చుట్టూ వినోద్ ఎప్పుడూ తిరగలేదు. సునిల్దత్ది పెషావర్ కావడమే లక్.
సునిల్‌దత్ తమ్ముడి పేరు సోమ్‌దత్. అతన్ని హీరో చేయడం కోసం 1968లో కుమరిపెన్ అనే తమిళ సినిమాని సునిల్‌దత్ హిందీలో తీశాడు. దర్శకుడు మన ఆదుర్తి సుబ్బారావు. ఆ సినిమాలో వినోద్‌ఖన్నా పరిచయమయ్యాడు సైడ్ హీరోగా. సోమ్‌దత్ ఎటుపోయాడో తెలియదు. వినోద్ మిగిలిపోయాడు.
వినోద్ స్పెషాలిటీ ఏమంటే దూకుడు ఎక్కువ. హీరోని డ్యామినేట్ చేస్తాడు. మేరాగావ్ మేరాదేశ్లో విలన్. అయినా అతనిదే హవా. 1974లో వచ్చిన ఇంతిహాన్ అప్పటి హిట్ఫిల్మ్స్ రోటీ కపడా ఔర్ మకాన్, మజ్బూర్ని తట్టుకుని నిలబడింది.
అమర్ అక్బర్ ఆంథోని (1977) ముకద్దర్ కా సికిందర్ హిట్‌కి కారణం అమితాబ్ మాత్రమే కాదు, వినోద్ కూడా. 1980లో వచ్చిన కుర్బానీ గురించి చెప్పక్కర్లేదు. 47 మల్టీ హీరో సినిమాల్లో నటించిన క్రెడిట్ కూడా అతనిదే.
1982లో ఒక అనుకోని సంఘటన. వినోద్ కజిన్ మరణించాడు. వినోద్ మెల్లిగా రజనీష్ ఆశ్రమం వైపు తిరిగాడు. కుటుంబాన్ని వదిలి అమెరికా వెళ్లిపోయాడు. సినిమాలు లేవు. భార్యాపిల్లలు వదిలేశారు.
నాలుగేళ్లకు మళ్లీ తిరిగొచ్చాడు. మళ్లీ సినిమాల్లో నటించాడు. అదే ఆదరణ. 96లో బీజేపీలో చేరాడు. ఎంపీ, కేంద్రమంత్రిగా పనిచేశాడు. ఇంకో పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లల తండ్రి అయ్యాడు. క్యాన్సర్ లోపల్లోపలే తినేసింది. ఎంత ప్రశాంతంగా జీవించాడో అంతే ప్రశాంతంగా పోయాడు. సంఘర్షణ లేని జీవితాలు అరుదు. అది అదృష్టమే కాదు, శాపం కూడా. (ఏప్రిల్ 27 వినోద్‌ఖన్నా వర్ధంతి)
జీఆర్ మహర్షి