కోలీవుడ్ ఒక్కసారిగా బోసిపోయింది. లెక్కప్రకారం, ఈపాటికి ధృవనక్షత్రం సినిమా అక్కడ రిలీజ్ అవ్వాలి. కానీ ఆఖరి నిమిషంలో సినిమాను వాయిదా వేశారు. దీంతో స్టార్ ఎట్రాక్షన్ లేకుండానే, కోలీవుడ్ లో శుక్రవారం బాక్సాఫీస్ మొదలైంది.
విక్రమ్ హీరోగా నటించిన భారీ బడ్జెట్ సినిమా ధృవనక్షత్రం. రాత్రి వరకు ఈ సినిమా విడుదలపై ఊగిసలాట కొనసాగింది. ఏ నిమిషంలోనైనా సినిమాకు లైన్ క్లియర్ అవుతుందని, ఒకవేళ మార్నింగ్ షో మిస్సయినా, మ్యాట్నీ నుంచి సినిమా అందుబాటులోకి వస్తుందని అంతా ఎదురుచూశారు.
కానీ విక్రమ్ ఫ్యాన్స్ ఎదురుచూపులు ఫలించలేదు. సినిమా వాయిదా పడినట్టు స్వయంగా దర్శకుడు గౌతమ్ మీనన్ ప్రకటించాడు. “క్షమించాలి. ఈరోజు ధృవనక్షత్రం తెరపైకి రావడం లేదు. మేం గట్టిగా ప్రయత్నించాం. కానీ ఇంకో 2 రోజులు పట్టేలా ఉంది.” అంటూ స్టేట్ మెంట్ ఇచ్చాడు గౌతమ్.
ఈ సినిమాకు నిర్మాత కూడా అయిన గౌతమ్ మీనన్.. సకాలంలో ఫైనాన్స్ ను సర్దుబాటు చేయలేకపోయారు. ఆఖరి నిమిషం వరకు ప్రయత్నించినప్పటికీ ఫైనాన్షియల్ ఇష్యూస్ కొలిక్కి రాలేదు. దీంతో సినిమాను వాయిదా వేయక తప్పలేదు.
ప్రస్తుతం ఫైనాన్షియర్స్ తో ఎగతెగని చర్చలు జరుపుతున్న గౌతమ్ మీనన్, మరో 2 రోజుల్లో అన్ని సమస్యల్ని కొలిక్కి తీసుకొచ్చి, వచ్చే వారానికి సినిమాను థియేటర్లలోకి తీసుకొస్తాడని ట్రేడ్ భావిస్తోంది.
ఎట్టిపరిస్థితుల్లో ఈ సినిమా ఈ ఏడాది రిలీజ్ అవ్వాలి. ఎందుకంటే, జనవరిలో విక్రమ్ నుంచి తంగలాన్ సినిమా రాబోతోంది. ఈ రెండు సినిమాల మధ్య మినిమం గ్యాప్ మెయింటైన్ చేయాలంటే, ధృవనక్షత్రాన్ని వీలైనంత త్వరగా విడుదల చేయాల్సిందే. లేదంటే, ఆ ప్రభావం తంగలాన్ పై పడుతుంది.