ఉత్తరాంధ్ర స‌ర్వే: వైసీపీకి 18.. టీడీపీకి 16

సార్వత్రిక ఎన్నికలకు దగ్గర పడుతున్న వేళ ఉత్తరాంధ్రా రాజకీయ ముఖ చిత్రం మెల్లగా మారుతోంది. 2019 ఎన్నికలలో ఏకపక్షంగా నూటికి ఎనభై శాతం పైగా సీట్లను గెలుచుకున్న అధికార వైసీపీకి తెలుగుదేశం జనసేన కూటమి…

సార్వత్రిక ఎన్నికలకు దగ్గర పడుతున్న వేళ ఉత్తరాంధ్రా రాజకీయ ముఖ చిత్రం మెల్లగా మారుతోంది. 2019 ఎన్నికలలో ఏకపక్షంగా నూటికి ఎనభై శాతం పైగా సీట్లను గెలుచుకున్న అధికార వైసీపీకి తెలుగుదేశం జనసేన కూటమి గట్టి పోటీనే ఇస్తోంది. మూడు ఉమ్మడి జిల్లాలలో చూసుకుంటే విజయనగరం జిల్లాలోనే వైసీపీ స్పష్టమైన ఆధిక్యత చూపిస్తోంది. శ్రీకాకుళం, విశాఖపట్నం ఉమ్మడి జిల్లాలలో మాత్రం నువ్వా నేనా అన్నంతగా పోరు సాగుతోంది.

అయిదేళ్ల పాటు అధికారంలో ఉండడం వల్ల వైసీపీకి సహజమైన ప్రజా వ్యతిరేకత కనిపిస్తూంటే దానిని అందిపుచ్చుకునేందుకు టీడీపీ సేన కూటమి సిద్ధం కావడమే విశేషం. పొత్తుల ఎత్తులు ఉత్తరాంధ్రాలో ఈసారి విశేషంగా ప్రభావం చూపించనున్నాయి. ప్రధానంగా తూర్పు కాపుల తీర్పులో ఫలితాలు తారుమారు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం ముప్పయి నాలుగు అసెంబ్లీ సీట్ల విషయం తీసుకుంటే అధికార వైసీపీకి మూడు ఉమ్మడి జిల్లాలలో 18 దాకా వచ్చే అవకాశాలు ఉంటే 16 దాకా సీట్లను దక్కించుకునేందుకు జనసేన టీడీపీ కూటమి గట్టి ప్రయత్నాలు చేస్తోంది.

టీడీపీకి జనసేన తోడు కావడం వల్ల లభించిన సామాజిక తోడ్పాటు మారిన సమీకరణలే కూటమి బలం పుంజుకోవడానికి కారణం అవుతున్నాయి. ఓట్ల చీలిక చాలా చోట్ల నివారించడం వల్ల కూడా వైసీపీ మీద టీడీపీ కొన్ని నియోజకవర్గాలలో ఆధిపత్యం చూపిస్తోంది. అయితే అది కూడా మూడు నుంచి నాలుగు శాతం స్వల్ప ఆధిక్యతలు కొన్ని చోట్ల కావడం గమనార్హం. అయితే ఎస్‌సీ, ఎస్‌టీ నియోజకవర్గాలలో మాత్రం వైసీపీ హవా యథాప్రకారం కొనసాగుతోంది.

ఇక జిల్లాల వారీగా చూస్తే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో పది అసెంబ్లీ సీట్లు ఉంటే ఇందులో చెరి అయిదు సీట్లలో వైసీపీ టీడీపీ కూటమి ఆధిక్యాన్ని చూపిస్తున్నాయి. వైసీపీ ఆధిక్యత ఉన్న సీట్లలో శ్రీకాకుళం, పాలకొండ, రాజాం, నరసన్నపేట, పలాస ఉంటే టీడీపీ కూటమికి టెక్కలి, ఆముదాలవలస, ఇచ్చాపురం, పాతపట్నం, ఎచ్చెర్లలలో మొగ్గు కనిపిస్తోంది. అయితే ఇందులో అభ్యర్ధులు పూర్తి స్ధాయిలో ఖరారు అయి బరిలోకి దిగిన తరువాత పూర్తి స్పష్టత వచ్చే అవకాశాలూ ఉన్నాయి.

ఉమ్మడి విజయనగరం జిల్లా విషయానికి వస్తే మొత్తం తొమ్మిది అసెంబ్లీ సీట్లు ఇక్కడ ఉన్నాయి. 2019లో వైసీపీ మొత్తం జిల్లాను క్లీన్‌ స్వీప్‌ చేసింది. ఈసారి మాత్రం టీడీపీకీ కొంత మొగ్గు కనిపిస్తోంది. అధికార వైసీపీకి ఈ జిల్లాలో చీపురుపల్లి, గజపతినగరం, నెల్లిమర్ల, కురుపాం, పార్వతీపురం, సాలూరు అసెంబ్లీ సీట్లలో ఆధిక్యం ఉంది. ఈ సీట్లు ఎట్టి పరిస్థితులలోనూ గెలిచేందుకు ఆస్కారం కనిపిస్తోంది. అదే సమయంలో బొబ్బిలి, విజయనగరం, శృంగవరపుకోటలలో టీడీపీ జనసేన కూటమికి పట్టు పెరిగింది. ఇందులో బొబ్బిలి, విజయనగరం సీట్లు రాజులవి కావడం విశేషం. ఎస్‌ కోటలో వైసీపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు మీద వ్యతిరేకత పార్టీకి ఇబ్బందిగా మారవచ్చు అని అంటున్నారు. గతం కంటే టీడీపీ ఇక్కడ బలం పుంజుకోవడానికి జనసేన కూడా కొంత కారణంగా చెబుతున్నారు.

ఉమ్మడి విశాఖ జిల్లా విషయానికి వస్తే ఇక్కడ పదిహేను అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఇందులో విశాఖ సీటీ పరిథిలో నాలుగు ఉంటే విశాఖ రూరల్‌ జిల్లాలో తొమ్మిది, ఏజెన్సీలో రెండు ఉన్నాయి. మొత్తం ఉమ్మడి విశాఖ జిల్లాలో అధికార వైసీపీకి ఏడు సీట్లు, టీడీపీ జనసేన కూటమికి ఎనిమిది సీట్లలో ఆధిక్యత కనిపిస్తోంది.

విశాఖ సిటీలో చూసుకుంటే విశాఖ దక్షిణం, విశాఖ ఉత్తరం వైసీపీకి మొగ్గు ఉంటే విశాఖ తూర్పు, విశాఖ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గాలు మరోమారు టీడీపీ ఖాతాలో పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక భీమునిపట్నం, గాజువాక, పెందుర్తి, అనకాపల్లి, నర్శీపట్నం, ఎలమంచిలి సీట్లలో టీడీపీ జనసేన కూటమికి ఆధిక్యత అయితే కనిపిస్తోంది. వైసీపీకి చోడవరం, పాయకరావుపేట, మాడుగులతో పాటు ఏజెన్సీలోని అరకు, పాడేరులలో మొగ్గు కనిపిస్తోంది. మొత్తానికి చూస్తే హోరాహోరీ పోరు ఉమ్మడి విశాఖ జిల్లాలో వైసీపీ టీడీపీల మధ్య ఉండే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి.

2019 ఎన్నికలలో వైసీపీ 11 సీట్లను గెలుచుకుంది. విశాఖ నగర పరిథిలో నాలుగు సీట్లనూ టీడీపీ గెలుచుకుంది. ఇపుడు మారిన రాజకీయ ముఖ చిత్రంలో చూసుకుంటే వైసీపీ విశాఖలో సిటీలో కొంత బలప‌డింది. టీడీపీ గెలుచుకున్న నాలుగు సీట్లలో రెండిరటిలో ఆధిపత్యం చూపుతోంది. అదే సమయంలో పెందుర్తి, గాజువాక, భీమిలీలలో టీడీపీ జనసేన కూటమి పాగా వేసేందుకు అవకాశాలు మెరుగు అవుతున్నాయి. ఇక్కడ జనసేన వెంట ఉండే సామాజికవర్గం సహకారం కూడా కూటమికి అవకాశం ఇస్తోంది.

విశాఖ రూరల్‌ జిల్లాలో చూసుకుంటే నర్శీపట్నం, ఎలమంచిలి, అనకాపల్లి సీట్లలో వైసీపీ సామాజిక రాజకీయ కారణాల వల్ల ఇబ్బందులలో పడుతోంది. బలమైన గవర సామాజికవర్గం మద్దతు ఈసారి వైసీపీకి తగ్గుతోంది. అలాగే వెలమల మద్దతు కూడా తగ్గుతోందని తాజా సంకేతాలు తెలియచేస్తున్నాయి. అదే విధంగా చూస్తే బలమైన నాయకత్వం కొరత కూడా రూరల్‌ జిల్లాలో వైసీపీకి కనిపిస్తోంది.

ఎన్నికల ముందు గవర సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రులు దాడి వీరభద్రరావు, కొణతాల రామకృష్ణ వంటి వారు టీడీపీ జనసేన కూటమిలో చేరడం కూడా ప్రభావం చూపిస్తోంది. మరో బలమైన కాపు సామాజికవర్గంలో మెజారిటీ కూటమి వైపు మొగ్గు చూపుతోందని తాజా సమీకరణలు తెలియచేస్తున్నాయి. అలాగే అయిదేళ్ల పాలన మీద సహజంగా ఉండే వ్యతిరేకత కూడా కూటమికి కొంత అనుకూలంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.