తెలుగుదేశం- జనసేన- బీజేపీలు కలిసి పోటీ చేస్తే.. తెలుగుదేశం పార్టీ కొన్ని సీట్లను వదులుకోవాల్సిన పరిస్థితి అయితే తప్పదు! అదెంత స్థాయిలో వదులుకోవాల్సి ఉంటుందో ఇప్పటికీ క్లారిటీ లేదు. జనసేన విషయంలో అయితే టీడీపీ వీరముష్టిగా ఎన్ని సీట్లను ఇచ్చినా ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కిక్కురుమనే పరిస్థితి లేదు! ఇక బీజేపీ బేరం ఏమిటనేది ఇంకా బయటపడటం లేదు! ఏతావాతా 40 అసెంబ్లీ నియోజకవర్గాలు, కనీసం 12 ఎంపీ నియోజకవర్గాలను టీడీపీ తన మిత్రపక్షాలకు కేటాయించి రావాల్సి ఉంటుందనేది నడుస్తున్న టాక్!
మరి అదే జరిగితే తెలుగుదేశం పార్టీకి తీవ్రమైన నష్టం జరుగుతుందనే విశ్లేషణ ఉంది. ఒక క్యాడర్, నిర్మాణం అంటూ లేని జనసేనకు, ఏపీలో చెప్పుకోవడానికి ఏమీ లేని బీజేపీకి 40 సీట్లను ఇస్తే అవి గెలుచుకొస్తాయా లేదా అనే సంగతిని పక్కన పెడితే, ఎన్నికలకు మరెంతో లేని సమయంలో ఇన్ని త్యాగాలు చేసేందుకు తెలుగుదేశం నేతలు ఎంతమంది ఉంటారనే ప్రశ్న కూడా తలెత్తుతోంది. ప్రచారం చేసుకోవాల్సిన సమయంలో ఈ పొత్తు పితలాటకంగా మారి టీడీపీకి తీవ్రంగా నష్టం చేస్తుందనే మాటా వినిపిస్తోంది!
మరి పొత్తు వల్ల ఇలాంటి నష్టం సంగతలా ఉంటే.. ఈ పొత్తు కొన్ని చోట్ల టీడీపీ గతిలేని తనాన్ని కాస్త కవర్ చేస్తోంది! సొంతంగా 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు, 25 ఎంపీ సీట్లకు అభ్యర్థులను ప్రకటించడానికి కూడా టీడీపీకి ఇప్పుడు శక్తి లేదంటే ఆశ్చర్యం కలగకమానదు! ఒకవేళ జనసేన, బీజేపీలతో తెలుగుదేశం పొత్తు లేకపోతే.. టీడీపీ 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ అభ్యర్థులను ధీటుగా ప్రకటించే అవకాశం లేదు! ఎవరో ఒకరితో అయితే అప్పటికప్పుడు నామినేషన్ వేయించొచ్చు. అయితే టీడీపీకి చెప్పుకోదగిన అభ్యర్థులు లేని నియోజకవర్గాలు చాలా ఉన్నాయి!
ఇన్ చార్జిలుగా ఎవరో ఒకరి పేరును ప్రకటించేసి.. ఇన్నాళ్లూ బండి నడిపిస్తున్నారు. అలాంటి పేర్లు కూడా లేని నియోజకవర్గాలు కోస్తాంధ్రలోనే ఉన్నాయి! ఇక రాయలసీమ సంగతి సరేసరి! పలు ఎంపీ సీట్లకు పేర్లను టీడీపీ ఆస్థాన మీడియా ప్రకటిస్తుంటేనే.. ఆ పేర్ల వాళ్లు తమకు ఎంపీ టికెట్ వద్దే వద్దంటూ బాహాటంగా ప్రకటిస్తున్నారు! పొత్తు వల్ల టీడీపీ త్యాగరాజుల సంగతేమో కానీ.. ఈ పొత్తులే లేకపోతే సొంతంగా 175 చోట్లా అభ్యర్థులను పెట్టడానికి, 25 ఎంపీ సీట్లలో అభ్యర్థులను నిలబెట్టడానికి చంద్రబాబు అష్టకష్టాలు పడాల్సి వచ్చేది!
2009 ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇలానే ముప్పుతిప్పలు పడ్డారు. చాలా చోట్ల రాత్రికి రాత్రి చేర్చుకుని కొందరితో నామినేషన్లు వేయించారు. నూకారపు సూర్యప్రకాష్ రావును అప్పటి వరకూ తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి.. రేపోమాపో నామినేషన్లకు తుదిగడువు అన్నట్టుగా ఆయన చేత నామినేషన్ వేయించారు ఎంపీగా! ఆ ప్రభావం ఫలితాల్లో కనిపించి టీడీపీ దెబ్బతింది కూడా! పొత్తుల లేకపోతే ఈ సారి టీడీపీకి అభ్యర్థుల కరువు పతాక స్థాయిలో ఉండేది!