నీళ్లు లేని ప్ర‌పంచం నుంచి..

ఏప్రిల్ 25. నేష‌న‌ల్ హ‌గ్ ఎ ప్లంబ‌ర్ డే. మ‌న కుళాయిలు, డ్రైనేజీ సిస్టం చెడిపోతే వ‌చ్చి బాగు చేసే ప్లంబ‌ర్‌కి కృత‌జ్ఞ‌త‌లు చెప్పుకోవ‌డం. మ‌న‌మేమో రోజు ఎలా గ‌డ‌వాలి అని ఆలోచిస్తుంటే, అమెరికా…

ఏప్రిల్ 25. నేష‌న‌ల్ హ‌గ్ ఎ ప్లంబ‌ర్ డే. మ‌న కుళాయిలు, డ్రైనేజీ సిస్టం చెడిపోతే వ‌చ్చి బాగు చేసే ప్లంబ‌ర్‌కి కృత‌జ్ఞ‌త‌లు చెప్పుకోవ‌డం. మ‌న‌మేమో రోజు ఎలా గ‌డ‌వాలి అని ఆలోచిస్తుంటే, అమెరికా వాడు ప్ర‌తి రోజుకి ఏదో పేరు పెట్టి వ్యాపారం చేస్తుంటాడు. మ‌నం కూడా ఆ మాయ‌లో ప‌డి సంవ‌త్స‌ర‌మంతా ప‌ట్టించుకోక‌పోయినా, మ‌ద‌ర్స్ డే, ఫాద‌ర్స్ డే రోజు అమ్మానాన్న‌ల‌ని ప్రేమించేస్తాం.

ప్లంబ‌ర్ అనే ప‌దం తెలియ‌ని జ‌న‌రేష‌న్ మాది. ఎందుకంటే మేము నీళ్లు లేని ప్ర‌పంచం నుంచి వ‌చ్చాం. సినిమాల్లో సీమ పౌరుషం, నెత్తురు అంటూ వుంటారు. దాని సంగ‌తి తెలియ‌దు కానీ, సీమ, నీళ్లు, రెండూ ఒక‌ప్పుడు వేర్వేరు విష‌యాలు. ఇప్పుడు కొంచెం ప‌రిస్థితి మారింది. ఇంట్లో కుళాయిలు చూస్తూ పెరిగిన త‌రం వ‌చ్చింది.

చిన్న‌ప్పుడు నేను చూసిన దృశ్యాలు, అవ‌న్నీ నిజంగా జ‌రిగాయా అని నాకే అనుమానం వ‌స్తుంది. 1970 నాటికే రాయ‌దుర్గం మున్సిపాలిటీ ప‌ట్ట‌ణం. జ‌నానికి నిద్ర‌లేస్తే ఎదుర‌య్యే మొద‌టి స‌మ‌స్య నీళ్లు. ఆ ఊరికి కోడ‌లుగా అమ్మాయిని ఇవ్వ‌డానికి జంకే స్థితి.

తెల్లార‌గానే ఏ వీధిలో చూసినా ప‌దిర‌వై మంది బిందెల‌తో తిరుగుతూ వుంటారు. మ‌ట్టి క‌డ‌వ‌లు, రాగి బిందెలు. ప్లాస్టిక్ మెల్లిగా అడుగు పెడుతూ వుంది. ఆడా, మ‌గ ,పిల్ల‌లు ఎవ‌రి బ‌రువులు వాళ్లు మోస్తూ చీమ‌లు త‌చ్చాడిన‌ట్టు క‌దులుతూ వుంటారు. అక్క‌డ‌క్క‌డ ఉన్న బావులే గ‌తి. ల‌క్ష్మీబ‌జార్‌లో ఒక బోరు వుండేది. నాలుగైదు కుళాయిల వ‌ద్ద భీక‌ర యుద్ధాలు జ‌రిగేవి.

ఇళ్ల‌కు నీళ్లు మోస్తూ జీవించేవాళ్లు ఎంద‌రో. ఇంటికి ప‌ది క‌డ‌వ‌లైతే నెల‌కు ఐదు రూపాయ‌లు. అంత‌కు మించితే ఇంకో రూపాయి అద‌నం. వీళ్లు గాకుండా ఒంటెద్దు బండ్ల‌వాళ్లు. ఒక పీపాను బండికి త‌గిలించుకుని హోట‌ళ్ల‌కి, డ‌బ్బున్న వాళ్ల‌కి అమ్మేవాళ్లు. పీపాలు నింప‌డానికి వేరే వ్య‌వ‌స్థ వుండేది. జ‌నం కుళాయిల ద‌గ్గ‌రికి వీళ్లు రాకూడ‌దు. స‌ప‌రేట్ పైపుతో ప‌ట్టుకోవాలి. వంతుల విష‌యంలో తేడా వ‌చ్చి బండ్ల వాళ్లు వీధి పోరాటాలు చేసేవాళ్లు. య‌జ‌మానుల్ని చూసి ఎద్దులు న‌వ్వుకునేవి.

బోర్‌కి ఒక హీరో వుంటాడు. కాకి ప్యాంట్‌, గ‌ల్లా చొక్కాతో మెడ‌లో శివుడి పాములా మ‌ప్ల‌ర్ చుట్టుకుని (ఎండా కాలంలో కూడా మ‌ప్ల‌ర్ వ‌ద‌ల‌డు. అప్ప‌ట్లో అది ఎన్టీఆర్ స్టైల్‌) నోట్లో సిజ‌ర్ సిగ‌రెట్ ఎర్ర‌గా వెలుగుతూ వుండ‌గా హెర్కులిస్ సైకిల్ ట్రింగ్‌ట్రింగ్‌మ‌ని మోగిస్తూ వ‌చ్చేవాడు. జ‌న‌మంతా అత‌ని వైపు ఆశ‌గా చూసేవాళ్లు. ఎవ‌ర్నీ ప‌ట్టించుకోకుండా స్టైల్‌గా స్టాండ్ వేసేవాడు. బోర్ రూమ్ తాళం తీసి స్విచ్చాన్ చేసే వాడు. గుర్‌మ‌ని సౌండ్‌తో సిమెంట్ ట్యాంక్‌లోకి నీళ్లు ప‌డేవి (ఈ ట్యాంక్‌ని క‌డ‌గ‌డం చూసిన వాళ్లు ఎవ‌రూ లేరు). మ‌రుక్ష‌ణం ఆడ‌వాళ్ల క‌ల‌క‌లం, తిట్లు విన‌ప‌డేవి.

మ‌న వాడు స్టైల్‌గా బోర్ రూమ్ నుంచి వ‌చ్చి “కొట్లాడినారంటే మిష‌న్ ఆఫ్ చేస్తా. ఏమ‌నుకుండారో” అని చిరునవ్వుతో హెచ్చ‌రిక చేసి ఒంటెద్దు బండ్ల వారి వైపు చూసేవాడు. వాళ్లు విన‌యంగా “అనా, టీ తాగుతావా” అని అడిగేవాళ్లు.

ద‌గ్గ‌ర్లో సుంక‌న్న హోట‌ల్ వుండేది. టీ ప‌ది పైస‌లు. టీ పేరుతో ఒక విచిత్ర ద్ర‌వాన్ని త‌యారు చేసి ఇచ్చేవాడు. సుంక‌న్న కోసం కొన్ని ప్ర‌త్యేక టీ కంపెనీలుండేవి. రంగు, రుచి, వాస‌న లేని టీ పొడిని ఆయ‌న కోసం త‌యారు చేసేవి. మ‌న బోర్ ఆప‌రేట‌ర్‌కి మాత్రం చ‌క్కెర ఎక్కువ వేసేవాడు. ఆ రోజుల్లో చ‌క్కెర చాలా ఖ‌రీదు, బ్లాక్‌లో మాత్ర‌మే దొరికేది.

మ‌న ఆప‌రేట‌ర్ తీపి ప్రియుడు. ఎంత వేసినా “స‌క్క‌రీ” అని అరిచేవాడు. సుంక‌న్న తిట్టుకుంటూ వేసేవాడు. అన్ని కాలాల్లోనూ క‌రెంట్ వాళ్లు న్యాయంగా , స‌మ‌ధ‌ర్మంతో ప‌నిచేసేవాళ్లు. రోజులో 8 సార్లు క‌ట్ చేసేవాళ్లు. దాంతో అరుపులు, కేక‌లు, ముష్టి యుద్ధాలు.

ఈ బోర్ అప్పుడ‌ప్పుడు చెడిపోయేది. ఆ ఏరియా అంతా బ్రేకింగ్ న్యూస్‌. అక్క‌డికి ద‌గ్గ‌ర్లోని బావుల‌కి, అర‌కిలో మీట‌ర్ దూరంలోని ఇంకో బోర్‌కి వ‌ల‌స వెళ్లేవాళ్లు. స‌రిహ‌ద్దులు లేకుండా దేశాలే కాదు, మ‌నుషులు కూడా జీవించ‌లేరు. ఆ ఏరియా వాళ్ల‌కి , ఈ ఏరియా వాళ్ల‌కి నీటి యుద్ధాలు.

ల‌క్ష్మీవిలాస్ అని ఒక హోట‌ల్ వుండేది. అక్క‌డ నీళ్లు మోయ‌డానికే ప్ర‌త్యేక నైపుణ్యం క‌లిగిన ప‌నివాళ్లు ఉండేవాళ్లు. వాళ్లు త‌ర‌చూ పారిపోయేవాళ్లు. ఎందుకంటే బావిలోని నీళ్లైతే తోడ‌చ్చు. పాతాళంలోంచి తోడాలంటే? క‌రెంట్ పోతే మ‌ట్టి క‌డ‌వ‌లు అమ్మేవాళ్ల‌కి మంచి వ్యాపారం. ఎందుకంటే బావిలోంచి నీళ్లు తోడాలంటే కొంచెం టెక్నిక్ కావాలి. అది తెలియ‌ని వాళ్లు క‌డ‌వ‌ల్ని ప‌గ‌ల‌గొట్టుకునేవాళ్లు.

మా క్లాస్‌లో కోట బ్యాచ్ వుండేది. ఆ ఏరియాలో మ‌రీ నీటి క‌రువు. తెల్లారిలేస్తేనే బావుల్లో నీళ్లు దొరికేది. అందుక‌ని వాళ్లు క్లాస్‌లో నిద్ర‌పోయి త‌న్నులు తినేవాళ్లు. సుబ్బ‌నాచారి అని లెక్క‌ల అయ్య‌వారు ఉండేవాడు. కోట కుర్రాళ్ల‌తో ఆయ‌న‌కి నీటి త‌గాదాలు. అందుక‌ని బెత్తంతో లెక్క స‌రిచేసేవాడు.

ఈ రోజు బాత్రూంలో కుళాయిలు, ష‌వ‌ర్లు తిప్పితే నీళ్లు వ‌స్తున్నాయంటే అంత‌కు ముందు త‌రాల‌ వాళ్లు ఎడారి జీవితం అనుభ‌వించ‌డం వ‌ల్లే. నాయ‌కుల్ని, ప్ర‌భుత్వాల్ని నీటి కోసం ఏళ్ల త‌ర‌బ‌డి నిల‌దీస్తే కుళాయి ఇంట్లోకి వ‌చ్చింది.

ఓట్ల కోసం అప్పుడ‌ప్పుడు మంచి ప‌నులు జ‌ర‌గ‌డ‌మే ప్ర‌జాస్వామ్యం.

-జీఆర్ మ‌హ‌ర్షి