లెక్కప్రకారం, ఈ ఏడాది రీ-రిలీజ్ ల సందడి కాస్త తగ్గుతుందని ట్రేడ్ ఊహించింది. ఎందుకంటే, బడా సినిమాలు లైన్లో ఉండడం, మీడియం రేంజ్ హీరోలంతా తమ సినిమాల్ని సిద్ధం చేస్తుండడంతో… బాక్సాఫీస్ కళకళలాడుతుందని భావించారు. అది నిజమే కానీ, ఎగ్జామ్స్ సీజన్ లో సినిమాను రిలీజ్ చేయాలని ఎవ్వరూ అనుకోరు కదా.
సరిగ్గా ఈ గ్యాప్ ను క్యాష్ చేసుకోవడానికి రెడీ అవుతున్నాయి కొన్ని పాత చిత్రాలు. ఈ కోవలో ఇప్పటికే కొన్ని సినిమాలు థియేటర్లలోకి రాగా.. ఈ నెలలో ఏకంగా 3 పాత హిట్ చిత్రాలు థియేటర్లలోకి మళ్లీ వస్తున్నాయి.
ఈనెల 26న మగధీర సినిమా థియేటర్లలోకి రానుంది. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాను రీ-రిలీజ్ చేస్తున్నారు. శ్రీ విజయలక్ష్మి ట్రేడర్స్ అధినేత యర్రంశెట్టి రామారావు, అరిగెల కిషోర్ బాబు.. ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేస్తున్నారు.
ఇక మార్చి 21న నువ్వు-నేను సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ఉదయ్ కిరణ్ హీరోగా తేజ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అప్పట్లో ట్రెండ్ సెట్ చేసింది. 2001లో వచ్చిన సినిమా, రిలీజైన ప్రతి సెంటర్ లో వంద రోజులాడి రికార్డ్ సృష్టించింది. ఇప్పుడీ సినిమాను మరోసారి థియేటర్లలోకి తీసుకొస్తున్నారు. ఆల్రెడీ ట్రయిలర్ రిలీజ్ చేశారు. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ప్రారంభించారు.
ఈ నెలలో థియేటర్ లోకి రాబోతున్న మరో పాత చిత్రం ఈరోజుల్లో. దర్శకుడు మారుతికి గుర్తింపు తీసుకొచ్చిన ఈ సినిమా విడుదలై పుష్కరం అవుతోంది. 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజుల్లో సినిమాను ఈనెల 23న రీ-రిలీజ్ చేస్తున్నారు. ఇలా వారం రోజుల గ్యాప్ లో 3 రీ-రిలీజెస్ చూడబోతోంది టాలీవుడ్.