డబ్బున్న భారతీయులు తీరాలు దాటి వేరే దేశాల్లో సెటిలవ్వడం గురించి ఎంత ఆసక్తితో ఉంటున్నారో వేరే చెప్పనక్కర్లేదు! మరీ ఇక్కడ రాజకీయాల్లో రాణించాలనో, ఇంకా బాగా కూడబెట్టాలనో, భారీ ఎత్తున ఆస్తులు ఉంటే వాటిని దేశం దాటించడం ఎలాగో తెలియక ఇక్కడే ఉంటున్న వారు కూడా కోకొల్లలు కానీ, చాలా మంది భారతీయులు వీలైనంత సంపదను తీసుకెళ్లిపోయి విదేశాల్లో సెటిలవ్వడానికే ఉత్సాహం చూపిస్తున్నారు! మరి ఈ జాబితాలో టీమిండియా క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్, ప్రస్తుత ప్లేయర్ విరాట్ కొహ్లీ పేరు విప్పుడు వినిపిస్తూ ఉండటం గమనార్హం!
విరాట్, అతడి భార్య అనుష్కలు బ్రిటన్ లో సెటిలయ్యే ప్రయత్నాల్లో ఉన్నారనే ప్రచారం జరుగుతూ ఉంది. ఆల్రెడీ వాళ్లు అక్కడ సెటిలయిపోయినట్టే అనే మాట కూడా వినిపిస్తోంది. ఇటీవలే అనుష్కా శర్మ బ్రిటన్ లోనే తమ రెండో బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం విరాట్ కూడా అక్కడే ఉంటున్నాడు. స్వదేశంలో ఇంగ్లండ్ తో జరిగిన టెస్ట్ సీరిస్ కు విరాట్ దూరం అయ్యాడు. రేపోమాపో ఐపీఎల్ కోసం విరాట్ ఇండియాకు వస్తాడు!
ఇక విరాట్ వయసు రీత్యా, ప్రస్తుతం జాతీయ జట్టులో కుర్రాళ్ల రాణింపును చూసినా.. ఇక అంతర్జాతీయ కెరీర్ కు వీడ్కోలు పలికే సమయం మరెంతో దూరంలో లేనట్టుగా ఉంది. ఐపీఎల్ లో కొనసాగవచ్చేమో కానీ.. అంతర్జాతీయ కెరీర్ సుదీర్ఘ సమయం అయితే సాగించలేకపోవచ్చు విరాట్. ఈ నేపథ్యంలో విరాట్ అండ్ ఫ్యామిలీ పూర్తిగా బ్రిటన్ లో సెటిల్ అయిపోయినా పెద్ద ఆశ్చర్యం లేదనే టాక్ వస్తోంది.
అనుష్క చాలా కాలం నుంచి ఆ దేశంలోనే ఉంటోందట, ఆమె ఇండియాలో కనిపించి కూడా నెలలు గడిచిపోయాయట! విరాట్ కూడా తన ఆటను చూసేసుకుని ఇండియా దాటి వెళ్లిపోవచ్చనే అంచనాలు ఏర్పడ్డాయి. విరాట్ ఆస్తుల విలువను బట్టి చూస్తే.. బ్రిటన్ పౌరసత్వం పెద్ద కష్టం కాదు. అక్కడ పెట్టుబడులను బట్టి కూడా పౌరసత్వం పొందే అవకాశం ఉంది! తమ పిల్లల ప్రైవసీని దృష్టిలో పెట్టుకుని కూడా వీరు అక్కడ సెటిలవ్వాలనుకుంటూ ఉండవచ్చు!
ఐపీఎల్ కోసం రెండు మూడు నెలలు విరాట్ ఇక్కడ స్టే చేయడం కూడా కష్టం కాదు! గతంలో పాక్ క్రికెట్ మాజీ లు చాలా మంది ఇంగ్లండ్ లోనే సెటిలయ్యారు. చెస్ గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ కూడా చాలా యేళ్ల కిందటే ఇండియా వదిలి వెళ్లిపోయినట్టుగా ఉన్నాడు! మరి ఇలాంటి జాబితాలో విరాట్ నిలుస్తాడేమో చూడాలి!