రామోజీ.. శతృత్వాలు

మానవ సంబంధ రాగ ద్వేషాలకు ఎవరూ అతీతులు కాదు. రామోజీ రావు కూడా. ఆయన పలువురితో శతృత్వం పెట్టుకోవడమో, లేదా పలువరిపై కత్తి కట్టడమో చేసారు. కొన్ని వ్యక్తిగత వైరాలు కావచ్చు. కొన్ని వృత్తి…

మానవ సంబంధ రాగ ద్వేషాలకు ఎవరూ అతీతులు కాదు. రామోజీ రావు కూడా. ఆయన పలువురితో శతృత్వం పెట్టుకోవడమో, లేదా పలువరిపై కత్తి కట్టడమో చేసారు. కొన్ని వ్యక్తిగత వైరాలు కావచ్చు. కొన్ని వృత్తి రీత్యా కావచ్చు. మరి కొన్ని రాజకీయంగా కావచ్చు.

దర్శకుడు దాసరి నారాయణరావుతో ఎందుకో తేడా వచ్చింది. అక్కడి నుంచి దాసరి నారాయణ రావు సినిమా వార్తలు సితారలో కనిపించేవి కావు. పైగా వారం వారం సమీక్షలు రాయాల్సి వచ్చినపుడు దాసరి సినిమా వస్తే దాన్ని చీల్చి చెండాడే వారు. దాసరి పేరు ఆ సమీక్ష టైమ్ లో తప్ప మరెప్పుడూ కనిపించేది కాదు. ఒక దశలో తన చతుర మాస పత్రికలో బదనిక అనే నవలను ప్రచురించారు. అది దాసరి మీద సెటైర్ నవల. దాసరి ఎదిగిన వైనం, దేవులపల్లి, పాలగుమ్మి లాంటి వారిని వాడుకున్న వైనం అన్నీ మారు పేర్లతో ఎండ గట్టారు. సినిమా పేర్లను అటు ఇటు మార్చి ఆ నవలలో చోటు ఇచ్చారు. ఈ వైరం నేపథ్యంలోనే ఉదయం దినపత్రిక, శివరంజని సినిమా పత్రిక, సుప్రభాతం వార పత్రిక పుట్టాయి. చాలా కాలం తరువాత దాసరి కి రామోజీకి మళ్లీ బంధం చిగురించింది. అసలు ఎందుకు వైరం వచ్చింది, మళ్లీ ఏమైంది అని వారి సన్నిహితులకే తెలియాలి.

ఉదయం పత్రికను దాసరి నుంచి మాగుంట సుబ్బరామిరెడ్డి కొనుగోలు చేసారు. వాళ్లకు లిక్కర్ మీద మంచి ఆదాయం వుండేది. అందుకే మద్య నిషేధ ఉద్యమాన్ని రామోజీ తలకెత్తుకున్నారు అని అంటారు.

ఈనాడు జోలికి కానీ, తన వ్యాపారాల జోలికి కానీ వస్తే ఎవరినైనా రామోజీ బలంగా ద్వేషించేవారు. కోపగించుకునేవారు. లక్ష్మీ పార్వతి, ఎబికె మరి కొందరు కలిసి పత్రికను ప్రారంభించాలని సమావేశాలు నిర్వహించడం మొదలుపెట్టారని తెలిసిన తరువాతే రామోజీ ఆమెపై కత్తి కట్టారనే వార్తలు అప్పట్లో వినిపించాయి. అగ్రిగోల్డ్ సంస్థ అటు రకరకాల పొడులు, పచ్చళ్లు మొదలుపెట్టడం, వాటి కోసం చైన్ స్టోర్స్ లు ఏర్పాటు చేయడం, హాయ్ లాంటి మినీ స్టూడియో ఏర్పాటు, ఓ మ్యాగ్ జైన్ పబ్లిష్ చేయడం వల్ల రామోజీ వారి మీద కూడా ఆగ్రహం పెంచుకున్నారనే టాక్ కూడా వుంది. ఆఖరికి అగ్రిగోల్డ్ ఏమైందో తెలిసిందే.

కాంగ్రెస్ కు రామోజీకి అస్సలు పడేది కాదు. ఓ దశలో రామోజీ రాసిన వార్తకు అసెంబ్లీలో అభిసంశన తీర్మానం ప్రవేశ పెట్టారు. రామోజీని అసెంబ్లీ వెల్ లోకి పిలిచి మందలించాలని తీర్మానం చేసారు. రామోజీ అప్పట్లో దాన్ని కోర్టు ద్వారా ఢీకొట్టి, వెళ్లకుండా ఆగగలిగారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రుల్లో జలగం వెంగళరావు తో రామోజీకి మంచి సాన్నిహిత్యం, స్నేహం వుండేది అంటారు తెలిసిన వాళ్లు.

స్వంత కుటుంబ సభ్యులతో కూడా విబేధాలు తలెత్తాయి. స్వంత తోడల్లుడు డాల్ఫిన్ అప్పారావు చాలా కాలం రామోజీ వ్యవహారాలు అన్నీ విశాఖలో చక్కపెట్టారు. కానీ తరువాత దూరం పెట్టారు. అలాగే కొడుకు సుమన్ తో ఎందుకో తేడా వచ్చింది.

వైఎస్ కుటుంబంతో వైరం సంగతి తెలిసిందే. దాని గురించి వివరంగా చెప్పుకునే పని లేదు. వివరించాల్సిన అవసరమూ లేదు. అందరికీ అది ఫుల్ గా తెలుసు.   

రామోజీ స్వతహాగా వామపక్ష వాది. కమ్యూనిస్టు పార్టీలకు మంచి విరాళాలు ఇచ్చేవారు అని అంటారు తెలిసిన వాళ్లు. కానీ రామోజీ సంస్థల్లో మాత్రం ట్రేడ్ యూనియన్లు ఏనాడూ ప్రవేశించలేదు. ఉద్యోగులు సంఘాలు పెట్టే అవకాశం ఇచ్చేవారు కాదు.

రామోజీ మొత్తం మీద ఓ విలక్షణ వ్యక్తి. ఏం చేసినా దాని వెనుక ఆయన భావజాలం, సంస్థల ప్రయోజనాలు ఇలా చాలా వుండేవి. ఎన్టీఆర్ ను గద్దెనెక్కించిందీ ఆయనే, దింపేయడానికి సహకరించిందీ ఆయనే.

దటీజ్ రామోజీ!