బెట్టింగ్ బంగార్రాజులకి హై బీపీ

ఎన్నికలైపోయాయి. ఫలితం ఈవీఎం బాక్సుల్లో నిక్షిప్తమై ఉంది. ప్రకటించేది మాత్రం జూన్ 4 న. అంటే 20 రోజుల నిరీక్షణ.  Advertisement అయితే ఈ గ్యాపులో వద్దన్నా రకరకాల సర్వేలొస్తున్నాయి. వాటిల్లో కొన్ని పాపులర్…

ఎన్నికలైపోయాయి. ఫలితం ఈవీఎం బాక్సుల్లో నిక్షిప్తమై ఉంది. ప్రకటించేది మాత్రం జూన్ 4 న. అంటే 20 రోజుల నిరీక్షణ. 

అయితే ఈ గ్యాపులో వద్దన్నా రకరకాల సర్వేలొస్తున్నాయి. వాటిల్లో కొన్ని పాపులర్ చానల్స్ లోగోలతో కూడా దర్శమిస్తున్నాయి. అందులో అధికశాతం ఫేకే. ఎన్నికలైపోయాక కూడా ఎందుకొస్తున్నాయివి? ఎవర్ని ప్రభావితం చేయడానికి? ఎవరికి ఉపయోగం? అంటే..బెట్టింగ్ బంగార్రాజులపై వల వేయడానికి మాత్రమే. 

బెట్టింగ్ నిర్వాహకులు వాళ్లకి అనువైన రకరకాల సర్వేలతో ఊదరగొడుతూ బెట్టింగులు కాయిస్తున్నారు. ఈ సర్వేల మాయలో పడి ఊళ్లో కూలి పని చేసుకునే వ్యక్తి దగ్గరనుంచి, అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ల నుంచి, కోట్లకి పడగలెత్తిన ఎన్నారైలు కూడా వాళ్ల శక్తికి మించి బెట్టింగులు కాస్తున్నారు. 

అసలీ బెట్టింగులు రకరకాల ప్రశ్నల మీద జరుగుతున్నాయి. ఉదాహరణకి గెలిచేది ఏ పార్టీ, గెలిచే పార్టీకి వచ్చే సీట్ల సంఖ్య, చంద్రబాబు గెలుస్తాడా ఓడతాడా, గెలిస్తే ఎంత మెజారిటీ, ఓడితే ఎంత, లోకేష్ మంగళగిరి సీటు ఏమౌతుంది, పవన్ గెలిస్తే మెజారిటీ ఎంత- ఓడితే ఎంత?….

ఇలా ఒకటి పది కాదు..ప్రతి నియోజకవర్గానికి సంబంధించి రకరకాల ప్రశ్నలు వందల సంఖ్యల్లో ఉంటున్నాయి. ప్రశ్నని బట్టి 1:2 నుంచి 1:10 వరకు పందేలుంటున్నాయి. 

ఒక సర్వేని నమ్మి ఒక పందెం కాస్తుంటే అంతలోనే మరొక సర్వే వచ్చి కాసిన పందెంపై అనుమానాలు, భయాలు పెంచుతోందట. దానివల్ల టెన్షన్లో పడుతున్న బెట్టింగ్ రాయుళ్లు పొలిటికల్ జర్నలిస్టులకి ఫోన్లు చేసి మరీ జోస్యం చెప్పమంటున్నారు. వాళ్లు మాత్రం ఏం చెప్తారు, ఏం చెప్పగలరు?

గుర్రపు పందేల దగ్గర కొన్ని పుస్తకాలుంటాయి. ఆ రోజు రేసులో ఉన్న గుర్రాలు, వాటి పేర్లు, వాటి బరువు, తోలే రౌతు ట్రాక్ రికార్డ్…ఇలా అన్ని అంశాలు అందులో ఉంటాయి. వాటిని స్టడీ చేసి పందేలు కాస్తుంటారు. అయినా చాలా సార్లు పుస్తకాల్లో ఉన్నట్టు జరగదు. అయినప్పటికీ ఆ పుస్తకం చేతిలో పెట్టుకుని ఆడితేనే ఒక ధైర్యం అంటుంటారు పందేలు కాసేవాళ్లు. అలాంటి పుస్తకాల్లాంటివే ప్రస్తుత సర్వేలు. అయితే సర్వే ఒకటైతే పర్వాలేదు. కానీ ఒకదాని వెంట ఒకటి పొంతన లేని సర్వేలొస్తుంటే పాపం బెట్టింగ్ రాయుళ్లు ఏమైపోవాలి?

గతంలో దేనినీ నమ్మకుండా గుడ్డిగా లగడపాటి రాజగోపాల్ సర్వేని బేస్ చేసుకుని బెట్టింగులు కాసేవాళ్లు. 2019లో ఆయన చెప్పిన జోస్యం పూర్తిగా రివెర్స్ అవడంతో లక్షలమంది బెట్టింగ్ రాయుళ్లు రోడ్డున పడ్డారు. అప్పులపాలయ్యారు. ఇప్పుడాయన సైలెంటుగా కూర్చుని మంచి పని చేస్తున్నాడు. 

ప్రస్తుతం లగడపాటి స్థానంలో ఎవ్వరూ లేరు. ఏ సర్వేనీ ప్రామాణికంగా తీసుకునే పరిస్థితి లేదు. తెదేపా పక్ష మీడియాహౌసులు వదిలిన ప్రీ పోల్ సర్వేలు చూస్తే కూటమి గెలిచిపోతుందనిపిస్తుంది. వైకాపా సానుకూల మీడియాల లెక్కలు చూస్తే ఆ పార్టీ భారీ మెజరిటీతో 2019 ఫలితాన్ని పునరావృతం చేస్తుందనిపిస్తుంది. అయితే రెండూ నిజమవడం సాధ్యం కాదు. గెలుపు ఎవరో ఒకరికే దక్కుతుంది. మరి ఏ సర్వేని నమ్మి పందెం కాయాలి అనేది ఇక్కడ టెన్షన్. 

అయితే ఈ వెయిటింగ్ పీరియడ్ ఎంత ఎక్కువుంటే అంతమంది కార్యకర్తలు అధోగతి పాలౌతారు. ఎందుకంటే ఈ బెట్టింగులు కాస్తున్న వారిలో కార్యకర్తలే ఎక్కువగా ఉన్నారు. అది కూడా కాస్తా కూస్తా కాదు..లక్షల్లోనూ, కోట్లల్లోనూ అప్పులు చేసి మరీ ఆడేస్తున్నారు. తాము నమ్మిన ఒక అభ్యర్థి గెలుపు మీద పందెం కాస్తే, ఊళ్ళో జనమో ఎగస్పార్టీ కార్యకర్తలో ఆ కేండిడేట్ ఓడిపోతున్నాడని కన్విన్సింగ్ గా చెబితే ఇక బెట్టింగ్ కాసిన వ్యక్తికి నిద్ర పట్టదు. బీపీలొస్తాయి. ఎందుకంటే ఆ స్థాయిలో బెట్టింగులాడేస్తున్నారు. 

ఈ బెట్టింగులన్నీ క్యాష్ ద్వారానే జరుగుతున్నాయి. ఎన్నారైలు, ఇతర ప్రాంతాల్లో ఉన్నవారి కోసం నమ్మకస్తులైన మధ్యవర్తులుంటున్నారు. షేర్ మార్కెట్ పద్ధతిలో నచ్చిన పాయింట్ మీద బెట్టింగులాడేది కొందరైతే, మ్యూచువల్ ఫండ్స్ మాదిరిగా ఒక మొత్తాన్ని ఆ మధ్యవర్తికి ఇచ్చేసి ఆడమంటున్నారు. అతను రకరకాల ప్రశ్నల మీద ఆ మొత్తన్ని డివైడ్ చేసి ఆడతాడు. వచ్చిన లాభంలో అతనికి కమీషన్ ఉంటుంది… పోతే మొత్తం పోతుంది…అదీ లెక్క. 

ఇవన్నీ వాట్సాప్, టెలిగ్రాం లాంటి క్లోస్డ్ గ్రూపుల్లో జరుగుతుంటాయి. హవాల కొంత, బినామీ అకౌంట్ల ద్వారా కొంత లావాదేవీలు జరుగుతుంటాయి. ఇదంతా ఇండియన్ లా ప్రకారం ఇల్లీగల్. అయినా సరే జరిగేవి జరిగిపోతుంటాయి. ఈ మొత్తం ప్రక్రియలో నిర్వాహకులు ఎప్పుడూ ప్రాఫిటెబుల్ గానే ఉంటారు. గెలిచినా, ఓడినా ఆడేవాళ్లే. 

గెలిస్తే..“అనుభవించు రాజా..” అన్నే పాట…ఓడితే..“అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయెనే..” అనే పాట యూట్యూబులో పెట్టుకుని వినడమే తరువాయి! 

– శ్రీనివాసమూర్తి