వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణానికి సంబంధించిన నియామకాలు తాజాగా జరిగాయి. మంత్రివర్గం నుంచి తొలగించిన వారికి ఏదో ఒక పని కల్పించాల్సిన అవసరం నేపథ్యంలో.. పార్టీ సంస్థాగత హోదాలు, బాధ్యతలు పంచే అవకాశాన్ని జగన్ వినియోగించుకున్నారు.
తీసేసిన మంత్రుల్లో.. సెకండ్ టైం బెర్త్ పొందలేకపోయిన వారందరికీ జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతలను అప్పగించారు. మరి ఈ కొత్త బాధ్యతల పట్ల వారంతా సంతృప్తిగా ఉన్నట్టేనా? పైకి వ్యక్తం కావడం లేదు గానీ.. ఎలాంటి అసంతృప్తి లేకుండా వారు ఈ పదవులను అనుభవిస్తున్నారా? ఇవన్నీ మిలియన్ డాలర్ ప్రశ్నలు.
కేబినెట్ సమావేశానికి పిలిచి, వాళ్లంతా అక్కడ మీటింగులో కూర్చుని ఉండగానే, కూర్చున్నపళంగా వారితో రాజీనామా లేఖల మీద సంతకాలు తీసేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి. కేబినెట్ భేటీ ముగిసి తిరిగి వెళ్లిన తర్వాత.. మీరంతా రాజీనామాలు పంపండి అని చెప్పలేదు. అలా ఆప్షన్ ఇస్తే.. ఒకరిద్దరు అనుకున్న సమయానికి రాజీనామా లేఖ ఇవ్వకుండా డ్రామా నడిపిస్తే కష్టం అని ఆయనకు తెలుసు. అందుకే అలా చేశారు. అయితే ఆ సందర్భానికి తగినట్టుగా.. వారి కన్నీళ్లు తుడిచే మాటలను జగన్ చెప్పారు.
మీ అందరికీ కేబినెట్ హోదాకు తగ్గని పదవులను కట్టబెడతాను అని జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చారు. ఇన్నాళ్లూ డీడీఆర్సీ మీటింగుల్లో వేదిక మీద కూర్చున్న మీరు.. ఇప్పుడు ఎదురుగా ఉండే సీట్లలో కూర్చోవాలంటే అవమానం కదా అని కూడా ఆయనే చెప్పుకొచ్చారు. అభివృద్ధి మండలులు ఏర్పాటు చేసి.. కేబినెట్ ర్యాంకుతో సమానంగా పదవులు ఇస్తానన్నారు. ఆ మాటలు కేవలం కన్నీళ్లు తుడవడానికి మాత్రమే చెప్పినట్లుగా ఇప్పుడు అర్థమవుతోంది.
అలిగిన వారికి ఏదో పదవులు దక్కాయి గానీ.. తీసేయబడిన మంత్రులందరూ జిల్లా పార్టీ అధ్యక్ష పదవితో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అసలే ఇప్పుడు చిన్న చిన్న జిల్లాలు. 2024 అసెంబ్లీ ఎన్నికలకంటె ముందు తమ హవా నడిపించడానికి వేరే ఎన్నికలేమీ లేవు. ఇలాంటి నేపథ్యంలో ఈ బుల్లి జిల్లాల అధ్యక్ష హోదాలను మెడలో తగిలించుకుని.. సదరు తీసేయబడిన మంత్రులు ఏం వైభవం వెలగబెట్టాలి? వారిలో అదే సందేహం, అసంతృప్తి మెదలుతోంది ఇప్పుడు.
కేబినెట్ సమాన హోదా అనేది దక్కే అవకాశం లేని వాగ్దానం అని వారికి అర్థమౌతోంది. ఈ తరుణంలో జిల్లా అధ్యక్ష పదవి అంటే.. వచ్చే ఎన్నికల దాకా బండెడు చాకిరీ తప్ప, వైభవ స్థితి ఏమాత్రం ఉండదని కూడా వారికి క్లారిటీ ఉంది. చిన్న వైఫల్యాలు ఎదురైనా.. ఆ పరాజయాల్ని తమ మెడకు చుట్టేసి.. ఈసారి ప్రభుత్వం ఏర్పడితే తమను పక్కన పెడతారనే భయం వారికి ఉంది. కానీ వారికి కూడా వేరే గత్యంతరం లేదు. అందుకే పల్లెత్తు మాట అనకుండా.. ఏ పని అప్పగిస్తే ఆ పని చేసుకుపోయే తీరుగా కనిపిస్తున్నారు.