మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఇవాళ 72 ఏళ్లు నిండాయి. ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు. యావత్తు రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీ శ్రేణులంతా కూడా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు, సహజంగానే తెలియజెబుతున్నారు. లాంగ్ లివ్ చంద్రబాబూ అంటూ.. దీవిస్తున్నారు. ఆయన సంపూర్ణ ఆరోగ్యం కోసం, మరింత కాలం జీవించడం కోసం పూజలు చేస్తున్నారు.
అంతా బాగానే ఉంది.. కానీ.. పుట్టినరోజు సందర్భంగా.. ఆయన రాజకీయ ప్రస్థానాన్ని తరచి చూస్తే.. ఇవాళ చంద్రబాబునాయుడు పడుతున్న కష్టం పగోడికి కూడా రావొద్దని అనిపిస్తోంది. ఆయన మీద జాలి వెల్లువలా పొంగుతోంది.
చంద్రబాబు వయస్సు ఇప్పుడు 72 ఏళ్లు. ఆయన నిర్ణయించిన వయసు పరిమితిని దాటి. ఇప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి పరిమితి పెంచిన తర్వాత.. ఆ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు విధులనుంచి రిటైరయ్యే వయసుకంటే ఆయన వయసు పదేళ్లు ఎక్కువ.
అంటే సహజంగా అయితే.. ఆయన 72 ఏళ్ల ముదిమి వయసులో క్రిష్ణారామా అనుకుంటూ, తాను తన జీవితంలో సాధించిన ఘన విజయాల గురించి నెమరు వేసుకుంటూ, అందరికీ చెప్పుకుంటూ గడుపుతూ ఉండాలి. కానీ ఇప్పుడు ఆయన పరిస్థితి అలా లేదు. ఆయనే క్రియాశీలంగా.. తెలుగుదేశం పార్టీని నడిపించవలసిన పరిస్థితిలో ఉన్నారు.
చంద్రబాబుకు అంతటి కమిట్మెంటు ఉన్నదని, రాష్ట్రం శ్రేయస్సును కోరుకుంటున్న వ్యక్తి గనుకనే ఇంత ముసలి వయసులో కూడా రాష్ట్రం కోసం ఇంతగా కష్టపడుతున్నారని.. ఆయన భజన పరులు వంది మాగధులు వేనోళ్ల పొగడవచ్చు గాక! కానీ.. తనకు ఇంత ముసలి వయసు వచ్చినా.. ఆయన నడిపితే తప్ప పార్టీ నడవలేని స్థితిలో ఉన్నదంటే.. ఆ ఫెయిల్యూర్ ఎవరిది? అచ్చంగా చంద్రబాబుది కాదా! ఇవాళ ఆయన పార్టీకోసం (ప్రజలకోసం అనుకోండి పర్లేదు) కష్టపడుతున్నారంటే.. అది ఆయన చేతగానితనం ఫలితమే కదా!
ప్రాంతీయ పార్టీల రాజకీయాలు వ్యక్తి చుట్టూనే కేంద్రీకృతమౌతాయి.. ఓకే! కుటుంబాలే వారసత్వంగా పెత్తనం సాగిస్తుంటాయి.. అది కూడా ఓకే! కనీసం తనకు 72 ఏళ్ల వయసు వచ్చే దాకా పార్టీ పగ్గాలను చేపట్టలేనంత అసమర్థుడిగా, నమ్మి అప్పగించలేనంత క్రియాశూన్యుడిగా కొడుకు నారా లోకేష్ వర్దిల్లుతున్నాడంటే ఆ పాపం ఎవరిది? ఎవరి నెత్తిన నెట్టగలరు? నాలుగున్నర దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో కొడుకును, తనకు దీటైన వారసుడిగా తయారు చేయలేకపోయారంటే.. చంద్రబాబు మహా సమర్థుడని ఎవరైనా సరే ఎలా నమ్మడం?
నారా లోకేష్ చేతిలో పగ్గాలు పెడితే.. పార్టీ సర్వనాశనం అయిపోతుందని.. ఎన్టీ రామారావు నుంచి అడ్డదారిలో దోచుకున్న పార్టీని కొడుకు దహించేస్తాడని, తాను బూడిద ఏరుకోవాల్సిందేనని చంద్రబాబుకు ఒళ్లంతా భయం. అందుకే పూర్తిగా కొడుకును నమ్మి పగ్గాలు అప్పగించలేక.. శక్తి ఉన్నా లేకపోయినా తానే కష్టపడుతున్నారు.
ఈ వయసులో ఇంతటి దైన్య స్థితిలో శ్రమపడుతున్నారంటే.. రాష్ట్రం కోసం అని అభిమానులు అందరూ కోడై కూయవచ్చు గాక.. కానీ.. ఆయనకు, ఆ పార్టీకి అంతకుమించి గతిలేకపోవడం వల్ల మాత్రమే అని తెలుసుకోవాలి. అందుకు బాధ్యత ఆయనదే. అందుకే ఇప్పుడు కష్టపడాల్సి వస్తోంది.. ఈ కష్టం చూస్తోంటే తప్పకుండా జాలి కలుగుతుంది.