డబ్బును మించింది ప్రజల ఆదరణ!

డబ్బు వెదజల్లితే ఎన్నికల్లో గెలుస్తామని రాజకీయ పార్టీలు అనుకుంటాయి. కానీ అది నిజం కాదని తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు నిరూపించాయి. ఏ ఎన్నికల్లోనైనా సరే పెరిగిపోతున్న ధన ప్రవాహాన్ని, ప్రభావాన్ని అరికట్టడం ఏ చట్టాల…

డబ్బు వెదజల్లితే ఎన్నికల్లో గెలుస్తామని రాజకీయ పార్టీలు అనుకుంటాయి. కానీ అది నిజం కాదని తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు నిరూపించాయి. ఏ ఎన్నికల్లోనైనా సరే పెరిగిపోతున్న ధన ప్రవాహాన్ని, ప్రభావాన్ని అరికట్టడం ఏ చట్టాల వల్ల కావడంలేదు. పైకి ఎన్ని నీతులు మాట్లాడుతున్నా ఆచరణలో అమలు కావడంలేదు.

ఎన్నికలు వచ్చినప్పుడల్లా ప్రతి రాజకీయ పార్టీ ఇంత మొత్తమే ఖర్చు పెట్టాలంటూ ఎన్నికల కమిషన్ ఆంక్షలు పెడుతుంది. పార్టీలపై, అభ్యర్థులపై పటిష్టమైన నిఘా పెడుతుంది. ఎన్నికల సమయంలో పోలీసులు నిరంతరం వాహనాలను తనిఖీ చేస్తారు. బ్యాంకుల్లో కూడా అనేక నిబంధనలు అమలు చేస్తారు. ఎన్ని చేసినా ధన ప్రవాహం అరికట్టలేకపోతున్నారు.

ఈ కాలంలో డబ్బు ఖర్చు చేయలేనివారు ఎన్నికల్లో పోటీ చేయడం సాధ్యం కాదు. పార్టీలు బాగా డబ్బు ఖర్చు చేయగలిగినవారికి, మిలియనీర్లకు , బిలియనీర్లకు మాత్రమే టిక్కెట్ ఇస్తున్నాయి. రాజకీయ పిచ్చి లేదా దురద ఉన్న ఎన్నారైలు ఎన్నికల సమయంలో విదేశాల నుంచి దిగిపోతుంటారు. అభ్యర్థులు ఖర్చుకు వెనుకాడని కారణం ఏమిటంటే.. ఇప్పుడు ఖర్చు చేసినా ఎమ్మెల్యేనో, ఎంపీనో అయ్యాక భారీగా సంపాదించుకోవచ్చు.

ప్రజాసేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చామని పైకి ఎన్ని కబుర్లు చెప్పినా సంపాదనకు రాజకీయాలు ఒక మార్గమనేది అసలు నిజం. అయితే ఎన్నికల్లో ఎంత భారీగా ఖర్చు చేసినా గెలుపోటములు అనేవి డబ్బు చేతిలో ఉండవు. ప్రజల చేతుల్లో ఉంటాయి. అంతిమంగా ఒక పార్టీ అధికారంలోకి రావాలా? వద్దా? అని నిర్ణయించేది ప్రజలే.

మొన్నటి ఎన్నికల్లో ఇటు తెలంగాణలో , అటు ఆంధ్రాలో అధికార పార్టీలు ఘోరంగా ఓడిపోయాయి. సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీకి విపరీతంగా ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. అంగ బలం ఉంటుంది. ఎన్నో ప్లస్ పాయింట్లు ఉంటాయి. అన్ని హంగులు ఉండి కూడా ఓడిపోయాయి. ఇందుకు ప్రధాన కారణం ప్రజాదరణ లేకపోవడమే. అంటే డబ్బుకు మించింది ప్రజాదరణ అని అర్ధమవుతోంది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ గులాబీ పార్టీ 175 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసిందని మీడియాలో వార్త. ఇది ఎన్నికల కమిషన్ కు సమర్పించిన లెక్క మాత్రమే. అనధికారికంగా ఈ ఖర్చు ఇంకా ఎక్కువే ఉంటుంది. బీజేపీ 117 కోట్లు, కాంగ్రెస్ 98 కోట్లు ఖర్చు చేశాయట.

కానీ అంత భారీగా ఖర్చు చేసినా గులాబీ పార్టీ అధికారంలోకి రాలేకపోయింది. రాజకీయ పార్టీలు భారీగా డబ్బు ఖర్చు పెడుతున్నామనేది ఒక్కటే చూస్తాయి. కానీ ప్రజలు పార్టీల జాతకాలు కూలంకషంగా పరిశీలిస్తారు. చివరివరకు గుంభనంగా ఉంటారు. తగిన విధంగా తీర్పు ఇస్తారు.