నిమ్మ‌గ‌డ్డ‌పై ఆ పంచాయ‌తీ నిర‌స‌న‌.. దీన్నేమ‌నాలి?

ఒక ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ తీరుపై ప్ర‌జ‌లు నిర‌స‌న తెలిపిన‌ సంద‌ర్భాలు భార‌త ప్ర‌జాస్వామ్యంలో ఉన్నాయో లేదో కానీ, ఏపీలో రాజ‌కీయ నేత త‌ర‌హాలో వ్య‌వ‌హ‌రిస్తున్న ఎస్ఈసీ నిమ్మ‌గడ్డ ర‌మేష్ కుమార్ తీరుపై ఒక గ్రామం…

ఒక ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ తీరుపై ప్ర‌జ‌లు నిర‌స‌న తెలిపిన‌ సంద‌ర్భాలు భార‌త ప్ర‌జాస్వామ్యంలో ఉన్నాయో లేదో కానీ, ఏపీలో రాజ‌కీయ నేత త‌ర‌హాలో వ్య‌వ‌హ‌రిస్తున్న ఎస్ఈసీ నిమ్మ‌గడ్డ ర‌మేష్ కుమార్ తీరుపై ఒక గ్రామం క‌న్నెర చేసింది.

నిర్వ‌హించాల్సిన స‌మ‌యంలో స్థానిక ఎన్నిక‌ల ఊసెత్త‌కుండా అచేత‌నంగా వ్య‌వ‌హ‌రించిన నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్ ఆ త‌ర్వాత ఎస్ఈసీగా త‌న‌కున్న రాజ్యాంగ‌బ‌ద్ధ‌మైన హ‌క్కుల‌ను ఉప‌యోగించుకుని ఎన్నిక‌ల‌ను తీసుకొచ్చారు. వాటికి కోర్టులు కూడా అనుమ‌తిని ఇచ్చాయి. 

ఆ తర్వాత నిమ్మ‌గ‌డ్డ చేసిన ప‌లు వ్యాఖ్య‌లు ఆయ‌న ఒక రాజ‌కీయ నేత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు అనే అభిప్రాయాన్ని క‌లిగించాయి. దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర రెడ్డి ప్ర‌స్తావ‌న‌, సీబీఐ కేసుల్లో త‌ను సాక్ష్యం అంటూ మాట్లాడ‌టం, ఆ త‌ర్వాత మంత్రి పెద్దిరెడ్డి పై ఇచ్చిన ఉత్త‌ర్వులు.. ఇవ‌న్నీ నిమ్మ‌గ‌డ్డ వ్య‌వ‌హార శైలిని ప్ర‌శ్నార్థ‌కంగా మార్చాయి. 

ఆయ‌న రాజ్యాంగ‌బ‌ద్ధ‌మైన ప‌ద‌విని ఉప‌యోగించుకుంటూ అనుచితంగా మాట్లాడుతున్నార‌నేది ప్ర‌జ‌ల అభిప్రాయంగా మారుతూ ఉంది. ఈ క్ర‌మంలో నెల్లూరు జిల్లాలో ఒక ప‌ల్లెలో మొత్తం నామినేష‌న్ల విత్ డ్రా జ‌రిగింది.

తాము ఎస్ఈసీ నిమ్మ‌గ‌డ్డ తీరుపై నిర‌స‌న‌గా ఎన్నిక‌ల‌ను బ‌హిష్క‌రిస్తున్న‌ట్టుగా నెల్లూరు జిల్లా మ‌ర్రిపాడు మండ‌లంలోని కంపసముద్రం ప్ర‌జ‌లు ప్ర‌క‌టించారు. నిమ్మ‌గ‌డ్డ రమేష్ కుమార్ ఎస్ఈసీగా ఉన్న స‌మ‌యంలో త‌మ ప‌ల్లెలో ఏ ర‌కంగానూ ఎన్నిక‌లు జ‌ర‌గ‌డానికి తమ‌కు స‌మ్మ‌తం లేద‌ని ఆ ప‌ల్లె ప్ర‌జ‌లు ప్ర‌క‌టించారు. దాదాపు 1700 ల‌కు పైగా ఓట్లు ఉన్న ఆ పంచాయ‌తీలో మొత్తం ఎనిమిది నామినేష‌న్లు దాఖ‌లు అయ్యాయి. 

నామినేష‌న్లు వేసినా, ప్ర‌జ‌లు చ‌ర్చించి ఎవ‌రు బ‌రిలో నిల‌వాలి, ఎవ‌రు వైదొల‌గాలి అని మాట్లాడుకునే ప‌రిస్థితి ప‌ల్లెల్లో ఇంకా ఉంది. పంచాయ‌తీ ఎన్నిక‌ల‌ను ర‌ణ‌రంగంగా మార్చుకునే ప‌ల్లెలు ఎన్ని ఉన్న‌ప్ప‌టికీ.. ఊరంతా క‌లిసి గ్రామ స‌భ ఏర్పాటు చేసుకుని ఏక‌గ్రీవం చేసుకునేంత శ‌క్తి మ‌న ప‌ల్లెల్లో ఇంకా మిగిలే ఉంది. 

ఆ మాత్రం స్ఫూర్తి లేకుండా లేరు ప్ర‌జ‌లు. అయితే ఏక‌గ్రీవాల‌పై ఎస్ఈసీ నిమ్మ‌గడ్డ ర‌మేష్ కుమార్ మొద‌ట అతిగా స్పందించ‌డం ఆయ‌న తీరుపై ప్ర‌జ‌ల్లో ఏవ‌గింపు పెరిగింది. అందుకు రియాక్ష‌నే ఈ ప‌ల్లెలో క‌నిపించిన‌ట్టుంది. ఏక‌గ్రీవం జ‌రిగితే అది అక్ర‌మ‌మే అన్న‌ట్టుగా మొద‌ట స్పందించి, రెండు జిల్లాల డిక్ల‌రేష‌న్లు ఆపాలంటూ క‌లెక్ట‌ర్ల‌ను ఆదేశించిన నిమ్మ‌గడ్డ తీరుపై ఒక పంచాయ‌తీ స్పందించింది. త‌మ ఊర్లో పంచాయ‌తీ ఎన్నిక‌ను బ‌హిష్క‌రించింది.

ఎక్క‌డైనా ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ ప్ర‌జ‌ల‌కు స‌ర్దిచెప్పి ఎన్నిక‌లు జ‌రిగేలా చూస్తూ ఉంటారు. ఎన్నిక‌ల‌ను బ‌హిష్క‌రిస్తామ‌నే ప్ర‌జ‌ల‌కు కూడా స‌ర్దిచెప్పి, రాజ‌కీయ స‌మ‌స్య‌ల‌ను కూడా ఎన్నిక‌ల‌తోనే ప‌రిష్క‌రించుకోవాల‌ని సూచిస్తూ ఉంటారు. అయితే ఏపీలో ఎన్నిక‌ల క‌మిష‌న‌రే త‌మ‌కు స‌మ‌స్య అని ఒక పంచాయ‌తీ చెబుతోంది. 

ఆయ‌న హ‌యాంలో ఎన్నిక‌లు అక్క‌ర్లేద‌ని అంటోంది. మ‌రి వారితో వెళ్లి నిమ్మ‌గడ్డ మాట్లాడ‌తారా? ఆ బాధ్య‌త ఆయ‌న మీదే ఉంది.  ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ గా ఇప్ప‌టికే వివాదాస్ప‌ద వ్య‌వ‌హార‌శైలిని అనుస‌రిస్తున్న ఆయ‌న చివ‌ర‌కు ఇలాంటి అప‌ఖ్యాతిని కూడా సంపాదించుకునేలా ఉన్నారు.

నెక్స్ట్ సినిమా లీక్‌ చేసిన చిరంజీవి..

ఆ కలాల వెనుక కులాల ఎజెండా