మోడీ కలల బిల్లులు ఇప్పుడు నెరవేరుతాయా?

కేంద్రంలో అధికారంలోకి మూడోసారి వచ్చిన ఎన్డీఏ కూటమికి రాజ్యసభలో చాలినంత బలం లేకపోవడం కారణంగా ఇన్నాళ్లపాటు ప్రధాని నరేంద్ర మోడీ అమ్ముల పొదిలోనే దాచుకున్నటువంటి అనేక బిల్లులు ఇప్పుడు కార్యరూపంలోకి వచ్చే అవకాశం ఉన్నదా?…

కేంద్రంలో అధికారంలోకి మూడోసారి వచ్చిన ఎన్డీఏ కూటమికి రాజ్యసభలో చాలినంత బలం లేకపోవడం కారణంగా ఇన్నాళ్లపాటు ప్రధాని నరేంద్ర మోడీ అమ్ముల పొదిలోనే దాచుకున్నటువంటి అనేక బిల్లులు ఇప్పుడు కార్యరూపంలోకి వచ్చే అవకాశం ఉన్నదా? అనే చర్చ రాజకీయ వర్గాలలో నడుస్తుంది.

ప్రస్తుతం 12 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగవలసి ఉంది. ఆ ఎన్నికలు పూర్తయితే మారే బలాబలాలతో కలిపి చూసినప్పటికీ ఎన్డీఏ కూటమికి స్పష్టమైన ఆధిక్యం కనిపిస్తుంది. వక్ఫ్ సవరణ బిల్లు వంటి వివాదాస్పద వ్యవహారాలను- ప్రస్తుత రాజ్యసభ ఎన్నికలకు ముందే రాజ్యసభలో బిల్లును నెగ్గడానికి కూడా అవకాశం ఉంది. కొన్ని తటస్థ పార్టీ లు సహకరించడం అవసరం.

రాజ్యసభలో మొత్తం 245 స్థానాలు ఉంటాయి. జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగకపోవడం వలన ప్రస్తుతం నాలుగు స్థానాలు ఖాళీగా ఉండడంతో మొత్తం సీట్ల సంఖ్య 241 మాత్రమే. 12 స్థానాలకు ప్రస్తుతం ఎన్నికలు జరగాల్సిన నేపథ్యంలో మొత్తం ఓట్ల సంఖ్య 229 మాత్రమే. భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ లోని ఇతర మిత్ర పక్షాలకు కలిపి 105 సభ్యుల బలం ఉంది. నియామకం ద్వారా ఎంపీలైన ఆరుగురుతో కలిపితే కూటమి బలం 111 అవుతుంది.

రాజ్యసభలో ప్రస్తుతం బిల్లులు నెగ్గాలంటే నాలుగు ఓట్లు అధికార కూటమికి కావలసి ఉంటుంది. ప్రస్తుత సమయంలో వక్ప్ సవరణ బిల్లు వంటివి సభ ముందుకు వచ్చినప్పుడు కొంచెం ఇబ్బంది తప్పదు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి 11 సీట్లు, బిజూ జనతాదళ్ కు 8 సీట్లు ఉన్నాయి. ఈ రెండు పార్టీలు అధికార కూటమికి సహకరిస్తారా లేదా అనేది ప్రశ్నార్ధకంగా ఉంది.

12 స్థానాలకు రాజ్యసభ ఎన్నికలు పూర్తయితే అందులో 11 ఎన్డీఏ పక్షాలు గెలుచుకుంటాయి. అప్పుడు మొత్తం 241 మంది సభ్యులు ఉన్న రాజ్యసభలో ఎన్డీఏ బలం 122 కు చేరుతుంది. అప్పుడిక వైసీపీ, బిజూ జనతాదళ్ ఓట్ల అవసరం కూడా ఎన్డీఏ కూటమికి ఉండదు.

అది జరిగిన నాడు మోడీ కలల్లో ఉన్న అనేక ఆలోచనలు స్పష్టంగా చట్టాల రూపంలోకి వస్తాయా అనే చర్చ ఇప్పుడే రాజకీయ వర్గాలలో మొదలవుతోంది. అనేక వివాదాస్పద అంశాలకు సంబంధించిన అజెండాతో మోడీ ఆలోచనలు 3.0 ప్రభుత్వంలో కార్యరూపంలోకి వస్తాయని చాలా కాలంగా ప్రచారం ఉంది. ఇప్పుడు రాజ్యసభలో కూడా స్పష్టమైన మెజారిటీ వస్తే మోడీ సర్కారుకు ఎదురే ఉండకపోవచ్చు. మరి అప్పుడు ఈ ప్రభుత్వం ఎన్ని కొత్త అనూహ్య నిర్ణయాలు తీసుకుంటుందో వేచి చూడాలి.

4 Replies to “మోడీ కలల బిల్లులు ఇప్పుడు నెరవేరుతాయా?”

Comments are closed.