Maruthi Nagar Subramanyam Review: మూవీ రివ్యూ: మారుతినగర్ సుబ్రమణ్యం

ఈ “మారుతినగర్ సుబ్రమణ్యం” ఒక సరదా చిత్రం. లాజిక్కులు, కన్విన్సింగ్ సీన్లు ఆశించకుండా చూసేస్తే బాగానే ఉంటుంది.

చిత్రం: మారుతినగర్ సుబ్రమణ్యం
రేటింగ్: 2.5/5
తారాగణం: రావు రమేష్, ఇంద్రజ, అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి, హర్షవర్ధన్, అజయ్, ప్రవీణ్, అన్నపూర్ణ, శివన్నారాయణ తదితరులు
సంగీతం: కళ్యాణ్ నాయక్
కెమెరా: బాల్ రెడ్డి
ఎడిటర్: బొంతల నాగేశ్వర రెడ్డి
నిర్మాతలు: బుజ్జి రాయుడు, మోహన్ కార్య
కథ- స్క్రీన్ ప్లే- డైలాగ్- దర్శకత్వం: లక్ష్మణ్ కార్య
విడుదల: 23 ఆగష్టు 2024

లో బడ్జెట్ కామెడీ సినిమాలు తరచూ వస్తుంటాయి. అయితే వాటికి పెద్ద బ్యానర్లో, పేర్లో తోడైనప్పుడు కాస్త అంచనాలు పెరుగుతాయి. అలా ఈ చిత్రం సుప్రసిద్ధ దర్శకుడు సుకుమార్ సతీమణి తబిత సమర్పణలో విడుదలయ్యింది. ప్రచారంలో అల్లు అర్జున్ కూడా పాల్గొనడంతో ప్రేక్షకుల దృష్టి దీనిపై పడింది. ఇంతకీ ఆశించిన ఫలితం దక్కిందో లేదో చూద్దాం.

సుబ్రమణ్యం (రావురమేష్) మారుతినగర్లో నివశించే ఒక మధ్య తరగతి మనిషి. అతను 1998లో టీచర్ ఉద్యోగానికి సెలక్టైనా నియామకం ఆపేయడంతో అప్పటి నుంచీ నిరుద్యోగిగా గడిపేస్తుంటాడు. అతని భార్య కళావతి (ఇంద్రజ) మాత్రం ఉద్యోగం చేస్తుంటుంది. వాళ్ల కొడుకు అర్జున్ (అంకిత్ కొయ్య). కానీ అతని అసలు తండ్రి నిర్మాత అల్లు అరవింద్ అని, ఎప్పుడో అప్పుడు తనను ఈ మధ్యతరగతి కూపం నుంచి తీసుకెళ్లిపొతాడని నమ్ముతుంటాడు. ఇతను కాంచన (రమ్య) అనే అమ్మాయిని ప్రేమిస్తాడు.

ఇదిలా ఉండగా ఒక రోజు అనుకోకుండా సుబ్రమణ్యం అకౌంట్లో పది లక్షలు పడతాయి. ఆ డబ్బు ఎలా వచ్చింది, ఎవరు వేసారనేది తెలీదు. అలా అనుకోకుండా వచ్చి పడిన డబ్బు సుబ్రమణ్యాన్ని ఎలా ప్రభావితం చేసింది అనేదే తక్కిన కథంతా!

ఈ కథ వింటూంటేనే ప్రధానమైన లాజిక్ లోపం అర్ధమవుతుంది. బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అయిన డబ్బు ఎవరు వేసారో తెలియకపోవడమేంటి? ఈ ఆన్లైన్ రోజుల్లో బ్యాంక్ ట్రాన్సాక్షన్ ప్రతీదీ నెట్ బ్యాంకింగులో రికార్డవుతుంది. పాస్ బుక్ అప్డేట్ చేసుకునే సీన్ కూడా ఉంది ఇందులో. అందులో అయినా తెలుస్తుంది సెండర్ ఎవరన్నది. అయినా కూడా కన్వీనియంట్ గా ఆ లాజిక్కులన్నీ వదిలేసి కేవలం డ్రామా మీదే ఫోకస్ పెట్టి, జనం కూడా అలాగే చూసేస్తారని తీసేసిన చిత్రమిది.

అయితే డ్రామా నడపడం వరకు బాగానే ఉంది. ఎంచుకున్న నటీనటులు విషయమున్నవాళ్లు కనుక అంతా సరదాగా సాగిపోయింది.

మధ్యతరగతి జీవితం, వాళ్ల చిన్న చిన్న కోరికలు, ఆశలు, భయాలు, అవసరాలు అన్నీ రావురమేష్ పాత్ర ద్వారా కళ్లకు కట్టినట్టు చూపించాడు దర్శకుడు. అయితే కథంతా అక్కడక్కడే తిరుగుతూ సీన్లు, ఎమోషన్ రిపీట్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది కొన్ని సార్లు.

ఉన్నంతలో కామెడీ ట్రాక్ ని వెరైటీగా నడపాలని చూసాడు. హీరోయిన్ ఫ్యామిలీ మోడెర్న్ సంస్కృతి, రావురమేష్ వెనకుబాటుతనం మధ్య కామెడీ వర్కౌట్ అయ్యింది. అలాగే ఇక్కడ హీరోయిన్ క్యారెక్టర్ కి, క్యారెక్టరైజేషన్ కి పెద్ద ప్రాముఖ్యత లేదు. అదొక సరదా పాత్ర అంతే. హీరో అంకిత్ కొయ్య కూడా అంతే. ప్రధాన కథంతా రావు రమేష్ మీదే నడుస్తుంది. చాలా బాగా నటించాడు. ఒక్కోసారి కాస్త ఓవరాక్షన్ అనిపించినా అది ఈ జానర్లో సెట్టైపోయింది.

ఇంద్రజ తెర మీద కనిపించిన సీన్లలోనే కాకుండా, కనిపించని సీన్లల్లో కూడా తన ఇంపాక్ట్ చూపించింది. అయితే సీరియస్ గా కనిపించిన క్యారెక్టర్ చివరి భాగంలో ఊర మాస్ తీన్మార్ స్టెప్పులేయడం నాన్ సింక్ అనిపించింది. ఇంద్రజ డ్యాన్స్ బాగా చేస్తుంది కనుక ఆమె ప్రతిభని వాడేయాలని బలవంతంగా చొప్పించినట్టుంది ఈ డ్యాన్స్.

హర్షవర్ధన్ తన పాత్ర వరకు హుందాగా, సటిల్ గా చేసుకుపోయాడు. బిందు చంద్రమౌళి కూడా ఓకే. పక్కింటి పార్ధసారధిగా శివన్నారాయణది చిన్న ట్రాక్.

భారీ బిల్డప్పుతో ఎంట్రీ ఇచ్చిన కమెడియన్ ప్రవీణ్ ఆశించిన రీతిలో నవ్వించలేదు. స్క్రిప్ట్ ఇంకాస్త బలంగా ఉంటే ఆ క్యారెక్టర్ కూడా బాగా పండేది.

అన్నట్టు ట్రావెల్ వీడియోలు చేసే వ్లాగర్ అన్వేష్ క్యారక్టర్ ని ఇందులో వాడుకోవడం జరిగింది. అతను అర్జెంటైనా టూరులో బ్లాక్ మనీ, వైట్ మనీ కాకుండా “బ్లూ మనీ” గురించి చెప్పాడు. అదే మేటర్ ని ఇందులో ప్రవీణ్ ట్రాకులో వాడారు. అంతటితో ఆగకుండా అన్వేష్ బాడీ లాంగ్వేజ్, వాయిస్ ని ఇమిటేట్ చేస్తూ ఒక పాత్రను కూడా పెట్టారు.

టెక్నికల్ గా చూస్తే యావరేజ్ గా ఉంది. పాటల్లో కూడా పట్టు లేదు. నేపథ్య సంగీతం జస్ట్ ఓకే. ఇలాంటి సినిమాని సరైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ఇంకా హిలారియస్ గా చేయొచ్చు అనిపించింది.

ఈ చిత్రానికి ప్రధానమైన ప్లస్ పాయింట్ కథలో ఐడియా, మరియు రావురమేష్ నటన. మైనస్ ఏమిటంటే ప్రధానమైన ట్విస్టులు కనివిన్సింగ్ గా లేకపోవడం.

ప్రధమార్ధంలో పాత్రల పరిచయంతో మొదలై వాళ్ల ఇష్టాలు, కష్టాలు అన్నీ చెబుతూ కథలో కాన్ ఫ్లిక్ట్ పాయింట్ కూడా స్టార్ట్ అవుతుంది. ఇంటర్వల్ బ్యాంగ్ సరదాగానే ఉంది. ద్వితీయార్ధంలో సస్పెన్స్ వీడినట్టే వీడి మళ్లీ ఒక చోట మొదలవుతుంది. ఈ విషయంలో స్క్రీన్ ప్లేని మెచ్చుకోవచ్చు.

తాను కోరుకున్న ప్రభుత్వ ఉద్యోగం రాలేదని 26ఏళ్లుగా అసలు ఏ ఉద్యోగమూ చేయకుండా గడిపేసే వ్యక్తిని అర్ధం చేసుకోవడం కష్టం. ఎంత కనిన్విన్స్ చేసే ప్రయత్నం చేసినా కనెక్ట్ అవడం కూడా కష్టం. అలాగే, అల్లు అరవింద్ కొడుకుని అనే భ్రమలో బతికే హీరో ట్రాక్ ని కూడా కామెడీ దిశగా ఇంకాస్త నడిపించినా బాగానే ఉండేది.

మొత్తంగా చూస్తే ఈ “మారుతినగర్ సుబ్రమణ్యం” ఒక సరదా చిత్రం. లాజిక్కులు, కన్విన్సింగ్ సీన్లు ఆశించకుండా చూసేస్తే బాగానే ఉంటుంది. అదే కనుక ఇంకాస్త కన్విన్సింగ్ స్క్రీన్ ప్లే రాసుకుని మరింత బలమైన ట్విస్టుతో ప్రెజెంట్ చేసి ఉంటే ఈ చిత్రం మరో మెట్టు పైకెక్కి ఉండేది. ఇలాంటి సినిమాలు పండగ సీజన్లోనో, సెలవల్లోనో వస్తే ప్రేక్షకాదరణ బాగుండేది.

బాటం లైన్: కొన్ని నవ్వులు

8 Replies to “Maruthi Nagar Subramanyam Review: మూవీ రివ్యూ: మారుతినగర్ సుబ్రమణ్యం”

  1. I think meeku positive nachadu anukunta, cinema from starting to ending totally superb, with continuous entertainment.

    All the cast in the movie were really amazing and their acting.

  2. Stop writing reviews Mr. GA broker of Mr.Jagan and YSRCP. You dont deserve to be maintaining the Website. You always write bullshit supporting Mr. Criminal Jagan apposing PK and Mega Family….Shame on you CHEAP GA…..

Comments are closed.