సామెతలు ఊరికే పుట్టవు. పెద్దవాళ్లు ఎంతో ఆలోచించి, జీవితానుభవాలను కాచి వడబోసి సామెతల రూపంలో జీవిత సారాంశాన్ని ఒక్క వాక్యంలో చెప్పడం అబ్బురం కలిగిస్తుంది. గాడిదను చంపి గల్లుకు పోయినట్టుందనే సామెత మనం తరచూ వింటుంటాం. గాడిదను చంపి అనవసరంగా జైలుకు పోయి జీవితాన్ని సర్వనాశనం చేసుకున్న వాళ్ల గురించి చెప్పేందుకు ఈ సామెత పుట్టుకొచ్చింది. అలాగే సమాజం వదిలేసిన వ్యక్తుల గురించి పట్టించుకోవడం అంటే, జీవితాన్ని నాశనం చేసుకోవడ మనే సందేశాన్ని కూడా ఈ సామెత ఇస్తుంది.
వైసీపీ రెబల్ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు ఇవాళ తన గురించి తాను చెప్పుకున్న మాటలు వింటే… అసంకల్పితంగా గాడిదను చంపి గల్లుకు పోయిన సామెత గుర్తుకొస్తోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అప్పుడెప్పుడో ఏపీ సీఐడీ ట్రీట్మెంట్ పుణ్యమా అని రఘురామ సామాజిక అంశాలపై తనవైన సృజనాత్మక అభిప్రాయాల్ని వెల్లడిస్తున్న సంగతి తెలిసిందే. సీఐడీ ట్రీట్మెంట్ మహిమ ఏంటోగానీ, రఘురామ బ్రెయిన్ భలే పదునెక్కింది. ఈ క్రమంలో ఆయన శుక్రవారం తన మీడియాతో మాట్లాడుతూ చెప్పిన అంశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
దొంగ పోలీసుతో తనను హత్య చేసి వేరే అకౌంట్లో రాయాలని చూశారని ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఆరోపించడం గమనార్హం. రామకృష్ణారెడ్డి అనే అధికారి తన ఇంటి ముందు ఏం చేస్తున్నారని డీజీపీకి లేఖ రాసినట్లు ఆయన చెప్పుకొచ్చారు. ఇప్పటివరకు డీజీపీ స్పందించలేదని రఘురామ ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతకూ రఘురామ చెబుతున్న ఆ దొంగ పోలీసు ఎవరో గానీ, అనవసరంగా కటకటాలపాలై జీవితాన్ని వృథా చేసుకోవాలని అనుకుంటారా? అని నెటిజన్లు వ్యంగ్య కామెంట్స్ విసురుతున్నారు.
పనీపాట లేకుండా లేఖలు రాసే వాళ్లందరికీ పని వదులుకుని సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదని డీజీపీ అనుకుంటున్నారేమో అని రఘురామకు సోషల్ మీడియా యాక్టివిస్టులు సమాధానాలు ఇస్తుండడం విశేషం. రోజూ సరికొత్త అంశాలపై మీడియా ముందుకొచ్చే రఘురామ తెలివి తేటలు అద్భుతహః గురూ!