టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు తనయుడు, ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ కోసం జగన్ ఓ పథకాన్ని తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా వుంది. వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాల పథకాల్లో ఏదో ఒక పథకం కింద లబ్ధి పొందని మనిషి ఉండరు. ముఖ్యంగా జగన్ ప్రభుత్వం చదువు విషయమై ఎంతో శ్రద్ధ పెట్టింది.
పిల్లల్ని చదివించేందుకు అమ్మ ఒడి పథకాన్ని జగన్ ప్రభుత్వం అమలు చేస్తోంది. విద్యార్థులు సక్రమంగా స్కూల్‌కు వెళ్లాలని ప్రభుత్వం నిబంధన పెట్టడం లోకేశ్ దృష్టిలో నేరమైంది. ప్రభుత్వం రూ.14 వేలు చొప్పున అమ్మ ఒడి పథకం కింద తల్లుల ఖాతాల్లో వేస్తున్నప్పుడు, పిల్లల్ని బడికి పంపేలా చర్యలు తీసుకోవడం నేరం ఎలా అవుతుందో ఎవరికీ అర్థం కాని విషయం. ఇక 300 యూనిట్ల లోపు విద్యుత్ వాడుతున్న వాళ్లకే పథకం వర్తిస్తుందని గతంలోనే ప్రభుత్వం చెప్పింది.
ఈ నేపథ్యంలో అమ్మ ఒడి పథకానికి ప్రభుత్వం నిబంధనలను విధించడాన్ని నారా లోకేశ్ తప్పు పడుతున్నారు. కన్న తల్లికి అన్నం పెట్టనోడు పినతల్లికి బంగారు గాజులు చేయిస్తానన్నట్టుందని ఎద్దేవా చేశారు. ఆంక్షల కత్తి ఎక్కుపెట్టి పథకం మనుగడనే ప్రశ్నార్ధకంగా మార్చేశారని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆంక్షలు తీసేసి అర్హులందరికీ అమ్మఒడి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. అమ్మ ఒడి పథకంపై లోకేశ్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. లోకేశ్‌నే ఎమ్మెల్యేగా గెలిపించలేని చంద్రబాబు, పార్టీని అధికారంలోకి తీసుకొస్తా అనడం కంటే జోక్ ఏమైనా వుంటుందా? అని నెటిజన్లు వెటకరిస్తున్నారు.
అమ్మఒడి పథకంలా అసెంబ్లీ ఒడి పథకాన్ని జగన్ తీసుకొస్తే తప్ప, నారా లోకేశ్ అసెంబ్లీలో అడుగు పెట్టే పరిస్థితి వుండదని సోషల్ మీడియాలో సెటైర్స్ వెల్లువెత్తుతున్నాయి. నారా లోకేశ్ ఎమ్మెల్సీ పదవీ కాలం పూర్తయితే, చట్టసభలో అడ్మిషన్ ఇప్పించే బాధ్యతను జగన్ తీసుకోవాలని నెటిజన్లు వ్యంగ్యంగా కామెంట్స్ చేస్తున్నారు. అమ్మ ఒడి పథకం లబ్ధిదారులకు లేని ఆందోళన లోకేశ్‌కు ఎందుకో అర్థం కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.