బీజేపీలో జ‌న‌సేన విలీనం.. టీడీపీలో అనుమానం!

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో బీజేపీ సొంతంగా బ‌ల‌ప‌డాల‌ని యోచిస్తోంది. ఉత్త‌రాధిలో బీజేపీ ప్ర‌భ త‌గ్గుతున్న‌ట్టుగా ఆ పార్టీ పెద్ద‌లు అంచ‌నా వేస్తున్నారు. అయితే బీజేపీ అంటే కేవ‌లం ఉత్త‌ర భార‌తదేశానికి చెందిన పార్టీగా ఉండ‌డానికి సంబంధిత నాయ‌కులు…

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో బీజేపీ సొంతంగా బ‌ల‌ప‌డాల‌ని యోచిస్తోంది. ఉత్త‌రాధిలో బీజేపీ ప్ర‌భ త‌గ్గుతున్న‌ట్టుగా ఆ పార్టీ పెద్ద‌లు అంచ‌నా వేస్తున్నారు. అయితే బీజేపీ అంటే కేవ‌లం ఉత్త‌ర భార‌తదేశానికి చెందిన పార్టీగా ఉండ‌డానికి సంబంధిత నాయ‌కులు ఏ మాత్రం సిద్ధంగా లేరు. అందువ‌ల్లే ద‌క్షిణాదిపై బీజేపీ పెద్ద‌లు ప్ర‌త్యేక దృష్టి సారించారు. ఈ క్ర‌మంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌పై బీజేపీ ప్ర‌త్యేక ప్రణాళిక ర‌చిస్తున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఇందులో భాగంగా జ‌న‌సేనను విలీనం చేసుకునే ఆలోచ‌న బీజేపీలో బ‌లంగా వుంద‌ని స‌మాచారం. జ‌న‌సేన విలీన ప్ర‌తిపాద‌న‌ను ప‌రోక్షంగా ఆ పార్టీ చీఫ్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఎదుట ఉంచిన‌ట్టు తెలిసింది. అందుకే ప‌వ‌న్‌క‌ల్యాణ్ కొత్త వేష‌ధార‌ణ‌తో బీజేపీ సిద్ధాంతంతో బ‌లమైన శ‌క్తిగా త‌న‌ను తాను ఆవిష్క‌రించుకోడానికి త‌పిస్తున్నార‌ని స‌మాచారం. స‌నాతన ధ‌ర్మంపై ప‌వ‌న్ ఉప‌న్యాసాలు, అలాగే ప్రాయ‌శ్చిత్త దీక్ష వెనుక బ‌ల‌మైన బీజేపీ రాజ‌కీయ ఎజెండా వుందంటే… కొట్టి పారేయ‌డానికి కూట‌మి నేత‌లు సిద్ధంగా లేరు.

ప‌వ‌న్‌ను ముందు పెట్టుకుని, ఏపీలో బీజేపీ పొలిటిక‌ల్ గేమ్ ఆడ‌డానికి వ్యూహాత్మ‌కంగా న‌డుచుకుంటోంద‌ని టీడీపీ ముఖ్య నేత‌లు ఆఫ్ ది రికార్డుగా మీడియాతో త‌మ అభిప్రాయాల్ని పంచుకుంటున్నారు. ఉప ముఖ్య‌మంత్రిగా ప‌వ‌న్‌క‌ల్యాణ్ అధికారాన్ని రుచి మ‌ర‌గ‌డం, బీజేపీలో జ‌న‌సేన‌ను విలీనం చేస్తే, జాతీయ స్థాయిలో, మరీ ముఖ్యంగా ద‌క్షిణాదిలో బ‌ల‌మైన రాజ‌కీయ శ‌క్తిగా రూపు దిద్దుకునే అవ‌కాశం వుంద‌ని ఆయ‌న‌కు నూరిపోస్తున్నార‌ని తెలిసింది.

ఏపీలో మాత్ర‌మే కాకుండా. త‌మిళ‌నాడు, క‌ర్నాట‌క‌, మ‌హారాష్ట్ర‌ల‌లో నాయ‌క‌త్వ బాధ్య‌త‌ల్ని ప‌వ‌న్‌కు అప్ప‌గించేందుకు బీజేపీ పెద్ద‌లు సిద్ధంగా ఉన్నార‌ని ఢిల్లీ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఇటీవ‌ల కాలంలో టీడీపీ నేత‌లు ప‌వ‌న్‌లో వ‌చ్చిన , వ‌స్తున్న మార్పును సునిశితంగా ప‌రిశీలిస్తున్నారు. ప‌వ‌న్‌క‌ల్యాణ్ స‌నాత‌న ధ‌ర్మం గురించి ప్ర‌బోధిస్తుండ‌డంపై లాభ‌న‌ష్టాల లెక్క‌ల్ని టీడీపీ నేత‌లు వేస్తున్నారు.

ఒక‌వేళ ప‌వ‌న్‌క‌ల్యాణ్ త‌న పార్టీని బీజేపీలో విలీనం చేసి, విడిగా ఎన్నిక‌ల్లో పోటీ చేస్తే ఎలా వుంటుందో కూడా టీడీపీ నేత‌లు అభిప్రాయాల్ని సేక‌రిస్తున్నారు. అందుకే జ‌న‌సేన‌, బీజేపీ నేత‌ల‌కు అప‌రిమిత‌మైన అధికారాల‌న్ని ఇవ్వ‌డంపై టీడీపీ జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రిస్తోంది. బీజేపీ ఏమంత న‌మ్మ‌ద‌గ్గ పార్టీ కాద‌నే స్పృహ‌లో వుండాల‌ని టీడీపీ పెద్ద‌ల నుంచి నియోజ‌క‌వ‌ర్గాల నాయ‌కుల‌కు స‌మాచారం వెళ్లింది.

విడ‌గొట్టు, పాలించు అనేది బీజేపీ సిద్ధాంత‌మ‌ని, దూర‌దృష్టితో ఆ పార్టీ వేసే అడుగుల్ని అర్థం చేసుకుంటూ, అప్ర‌మ‌త్తంగా వుండాల‌ని టీడీపీ భావిస్తోంది. రానున్న ఎన్నిక‌ల నాటికి బీజేపీలో జ‌నసేన విలీనం అవుతుంద‌ని వైసీపీ బ‌లంగా న‌మ్ముతోంది. అదే జ‌రిగితే టీడీపీతో ఎట్టి ప‌రిస్థితుల్లోనూ క‌లిసి వెళ్ల‌ర‌ని కూడా వైసీపీ అనుకుంటోంది. రాజ‌కీయాల్లో ఎప్పుడూ నిన్న‌టి ప‌రిస్థితి నేడు, నేటి ప‌రిస్థితి రేపు వుండ‌ద‌ని అంటుంటారు.

అయితే ఎప్ప‌టిక‌ప్పుడు అప్ర‌మ‌త్తంగా వుంటేనే, మ‌నుగ‌డ సాగించ‌గ‌ల‌మ‌నే ఆలోచ‌నను మ‌న‌సులో పెట్టుకుని అప్ర‌మ‌త్త‌తో వ్య‌వ‌హ‌రించాల‌ని టీడీపీ, వైసీపీ నాయ‌కులు అడుగులు వేస్తున్నారు. జ‌న‌సేన ఏ తీరాల‌కు చేరుతుందో కాలం జ‌వాబు చెప్పాల్సి వుంది.

13 Replies to “బీజేపీలో జ‌న‌సేన విలీనం.. టీడీపీలో అనుమానం!”

  1. మన అన్నయ్య పార్టీ నీ కాంగ్రెస్ లో కలిపేస్తున్నాడని బాధగా ఉందా GA….😂😂😂

Comments are closed.