నెల్లూరులో అధికార పార్టీలో గ్రూపు రాజకీయాలు నెమ్మదిగా రచ్చకెక్కుతున్నాయి. ప్రస్తుతానికి నర్మగర్భ వ్యాఖ్యల వరకే పరిమితమయ్యాయి. రానున్న రోజుల్లో వైసీపీలో విభేదాలు తీవ్రమవుతాయనేందుకు తాజా మాజీ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ వ్యాఖ్యలే నిదర్శనం.
తాను మంత్రిగా ఉన్నప్పుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఎంతో సహకారం అందించారని, ప్రేమ, వాత్సల్యాన్ని పంచారని వ్యంగ్యంగా చెప్పారు. కాకాణి తనకు ఏమిచ్చారో వాటినే రెండింతలు చేసి కాకాణికి అందిస్తానని తనలోని అసంతృప్తిని పరోక్షంగా బయట పెట్టుకున్నారు.
నెల్లూరులో తాజా రాజకీయ పరిణామాలు వైసీపీలో గుబులు రేపుతున్నాయి. వ్యవసాయశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా కాకాణి సొంత జిల్లాకు ఈ నెల 17న వస్తున్నారు. కాకాణికి అభిమానులు ఘన స్వాగత ఏర్పాట్లు చేస్తున్నారు.
నెల్లూరు నగరంతో పాటు సర్వేపల్లి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున స్వాగత ప్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. నెల్లూరు నగరంలోని హరనాథపురం సర్కిల్లో ప్లెక్సీని చించివేయడంపై కాకాణి వర్గీయులు మండిపడుతున్నారు. ఇదంతా మాజీ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ వర్గీయుల పనేనని ఆరోపిస్తున్నారు.
ఈ నేపథ్యంలో కాకాణి నెల్లూరుకు వచ్చే రోజే, నగరంలో అనిల్‌కుమార్ నేతృత్వంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం చర్చనీయాంశమైంది. కాకాణి ర్యాలీ ట్రంక్ రోడ్డు మీదుగా వెళ్లనుందని సమాచారం. అదే దారిలో గాంధీబొమ్మ సెంటర్లో అనిల్‌కుమార్ బహిరంగ సభకు ఏర్పాట్లు చేయడంపై కాకాణి వర్గీయులు మండిపడుతున్నారు.
పరస్పరం ఎదురుపడితే ఏదైనా జరగొచ్చని అనిల్‌కుమార్ హెచ్చరించినట్టు ప్రచారం జరుగుతోంది. కాకాణితో విభేదాల కారణంగా ఇలాంటి చర్యలకు అనిల్‌కుమార్ దిగి తప్పు చేస్తారా? అనే ప్రశ్న వినిపిస్తోంది. కాకాణిపై అక్కసుతో పార్టీకి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు నష్టం కలిగించేందుకు అనిల్‌కుమార్ తెగబడతారా? అనే టాక్ నడుస్తోంది.
గతంలో అనిల్‌కుమార్ మంత్రిగా వుండగా, కనీసం ఒక్కరోజు కూడా కాకాణి తన నియోజకవర్గంలో కార్యక్రమాన్ని నిర్వహించలేదని అనిల్ అనుచరులు గుర్తు చేస్తున్నారు. వైసీపీలో విభేదాలకు ఆజ్యం పోసిందే కాకాణి అని మాజీ మంత్రి అంటున్నారని సమాచారం.
ఇప్పుడు మంత్రి పదవి వచ్చిన తర్వాత స్నేహ హస్తం అందిస్తే… ప్రయోజనం ఏంటనే ప్రశ్నలొస్తున్నాయి. మొత్తానికి కాకాణి పర్యటనపై సర్వత్రా ఉత్కంఠ నెలకుంది.